Begin typing your search above and press return to search.

కేటీఆర్ భేటీకి మిస్ అయిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఎవరు?

ఇదిలా ఉంటే.. ఈ భేటీకి ముగ్గురు ఎమ్మెల్యేలు హాజరు కాకపోవటం కలకలాన్ని రేపింది. ఏదైనా వ్యక్తగత కారణాలతో హాజరు కాలేదా?

By:  Tupaki Desk   |   4 Dec 2023 11:15 AM GMT
కేటీఆర్ భేటీకి మిస్ అయిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఎవరు?
X

ఎగ్జిట్ పోల్స్ ను నమ్మకండి.. ఎగ్జాట్ పోల్స్ ను నమ్మాలంటూ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు.. కం మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యల గురించి తెలిసిందే. పోలింగ్ పూర్తైన వెంటనే పెద్ద ఎత్తున ఎగ్జిట్ పోల్స్ వెల్లడి కావటం.. నాలుగైదు మినహా మిగిలిన అన్ని ఎగ్జిట్ పోల్స్ లోనూ కాంగ్రెస్ గెలుస్తుందన్న మాట రావటం తెలిసిందే. నిన్న వెల్లడైన ఫలితాల్లోనూ ఎగ్జిట్ పోల్స్ కు తగ్గట్లే ఉండటంతో ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాట్ పోల్స్ అన్న మాట పలువురి నోట వినిపించింది. ఫలితాల వెల్లడైన కాసేపటికే కేటీఆర్ పార్టీనేతల్ని ఉద్దేశించి మీడియాతో మాట్లాడటం తెలిసిందే.

ఈ సందర్భంగా తమ తప్పుల్ని సరిదిద్దుకుంటామని.. తమ స్పీడ్ కు బ్రేకులు పడ్డాయే తప్పించి.. రెట్టింపు స్పీడ్ తో వస్తామన్న మాటలు ఎన్నిచెప్పినా.. ఐదేళ్ల తర్వాతే ఏదైనా అన్న విషయం తెలిసిందే. ఫలితాలు వెల్లడైన రెండో రోజున కేటీఆర్ తెలంగాణ భవన్ లో పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి పార్టీ ముఖ్యనేతలతో పాటు.. పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేల్ని ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఎన్నికల్లో ఓడిపోవటానికి కారణం ఏమిటి? అందుకు దారి తీసిన కారణాల మీద చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. ఈసందర్భంగా ఎమ్మెల్యేలుగా గెలిచిన వారందరికి అభినందనలు తెలిపిన ఆయన.. తాము అధికారంలో ఉన్న పదేళ్లలో అద్భుతమైన కార్యక్రమాల్ని తమ ప్రభుత్వం చేపట్టినట్లుగా చెప్పుకున్నారు. ఇంత అద్భుతంగా పాలించినప్పటికీ ప్రజలు ఎందుకు తిరస్కరించారన్న విషయాన్ని కేటీఆర్ మళ్లీ మర్చిపోయారు.

ఇదిలా ఉంటే.. ఈ భేటీకి ముగ్గురు ఎమ్మెల్యేలు హాజరు కాకపోవటం కలకలాన్ని రేపింది. ఏదైనా వ్యక్తగత కారణాలతో హాజరు కాలేదా? ఇంకేదైనా కారణం ఉందా? అన్నది చర్చగా మారింది. ఆసక్తికరమైన విషయం ఏమంటే..ఈ ముగ్గురు ఎమ్మెల్యేల గురించి సోషల్ మీడియాలోనూ.. వాట్సాప్ గ్రూపుల్లోనూ పార్టీ మారే అవకాశాలున్నట్లుగా అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

అలా వినిపిస్తున్న పేర్లలో ప్రముఖంగా ఉన్న వారే కేటీఆర్ భేటీకి గైర్హాజరుకావటం ఇప్పుడు చర్చగా మారింది. ఇంతకీ ఆ ముగ్గురు మరెవరో కాదు.. మాజీ మంత్రి మల్లారెడ్డి.. ఆయన అల్లుడు కమ్ మల్కాజిగిరి ఎమ్మెల్యేగా గెలిచిన మర్రిరాజశేఖర్ రెడ్డి అయితే.. మూడో వారు ఎల్ బీనగర్ ఎమ్మెల్యేగా గెలిచిన సుధీర్ రెడ్డి. ఈ ముగ్గురు భేటీ కి ఎందుకు హాజరు కాలేదన్న దానిపై ఆ ముగ్గురి నుంచి కూడా ఎలాంటి ప్రకటన లేకపోవటం ఆసక్తికరంగా మారింది.