Begin typing your search above and press return to search.

టూమచ్ బాబూ... పార్టీలో చేరకపోయినా టిక్కెట్!

By:  Tupaki Desk   |   24 Feb 2024 3:17 PM GMT
టూమచ్ బాబూ... పార్టీలో చేరకపోయినా టిక్కెట్!
X

ఎన్నికలు సమీపిస్తున్న వేళ చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు.. మంచి ముహూర్తం దొరికిందంటూ జనసేనతో కలిసి అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేశారు. ఇందులో భాగంగా 118 సీట్లు ప్రకటించిన బాబు వాటిలో 94 సీట్లలో టీడీపీ అభ్యర్థుల పేర్లు వెల్లడించారు. 175 లోనూ 24 స్థానాల్లో జనసేన అభ్యర్థులు పోటీ చేస్తారని తెలిపారు. మిగిలిన సీట్లలో పూర్తిగా టీడీపీ అభ్యర్థులే పోటీకి నిలబడతారా.. లేదా అనే విషయం బీజేపీ నుంచి స్పష్టత వచ్చాక తెలిసే అవకాశం ఉంది.

ఈ సమయంలో గరిష్టంగా పాత నేతలనే ప్రకటించారు చంద్రబాబు! ఇందులో జనసేనకు కేటాయించే నియోజకవర్గాలపైనే సస్పెన్స్ తప్ప.. బాబు ప్రకటించిన అన్ని స్థానాల్లోనూ అభ్యర్థులు ఆల్ మోస్ట్ ప్రచారంలో ఉన్నవారే అనే కామెంట్లు వినిపిస్తున్నాయి! ఈ సమయంలో టిక్కెట్లు దక్కని నేతలు చంద్రబాబుపై నిప్పులు చెరుగుతున్నారు.. పైగా ఇన్ ఛార్జ్ లుగా ఉన్నవారికి సైతం చివరి నిమిషంలో షాకులు ఇవ్వడంతో వారంతా జీర్ణించుకోలేకపోతున్నారు!

వీరిలో కొంతమంది రాజీనామాలు చేస్తున్నారని తెలుస్తుండగా.. మరికొంతమంది రెబల్స్ గా బరిలోకి దిగబోతున్నారని తెలుస్తుంది. మరికొంతమంది ఆయా నియోజకవర్గాల్లో తమను కాదని టిక్కెట్ ఇచ్చిన టీడీపీ నేతలు ఎలా గెలుస్తారో చూస్తామంటూ సవాల్ చేస్తున్నారు. అవన్నీ ఒకెత్తు అయితే... ఇప్పటివరకూ పార్టీలో చేరని నేతకు కూడా చంద్రబాబు టిక్కెట్ ప్రకటించడం ఇప్పుడు ఆసక్తిగా మారింది. దీంతో "ఇది టూమచ్ బాబూ" అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.

అవును... తాజాగా ప్రకటించిన అభ్యర్థుల తొలి జాబితాలో భాగంగా నూజివీడు నుంచి వైసీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి పోటీ చేస్తారని ప్రకటించారు చంద్రబాబు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే... ఆయన ఇప్పటివరకూ అధికారికంగా తెలుగుదేశం పార్టీలో చేరలేదు.. పసుపు కండువా కప్పుకోనూ లేదు!! అలా పార్టీలో చేరని వ్యక్తికి కూడా చంద్రబాబు టిక్కెట్ ప్రకటించేశారు. అయితే... మరో రెండు రోజుల్లో ఆయన చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరే అవకాశం ఉందని అంటున్నారు.

దీంతో ఇది పార్థసారధి తరుపున నెలకొన్న రికార్డ్ అనుకోవాలా.. లేక, బాబు దయనీయ పరిస్థితి అనుకోవాలా అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. మరోపక్క ఈ నిర్ణయం చాలా రోజుల క్రితమే తెరపైకి రావడంతో నూజివీడు టీడీపీ ఇన్ ఛార్జ్ గా ఉన్న ముద్దరబోయిన వెంకటేశ్వర రావు ఆ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.