Begin typing your search above and press return to search.

సీఎం గౌరవం చచ్చిపోయింది.. తల వెంట్రుకలు పంపిన ఎమ్మెల్యే

రాజకీయాల్లో కొత్త తరహా నిరసనలు ఈ మధ్యన ఎక్కువ అయ్యాయి. అలాంటి తీరుకు పరాకాష్ఠగా మారిన ఉదంతం రాజస్థాన్ లో చోటు చేసుకుంది

By:  Tupaki Desk   |   13 Sep 2023 6:07 AM GMT
సీఎం గౌరవం చచ్చిపోయింది.. తల వెంట్రుకలు పంపిన ఎమ్మెల్యే
X

రాజకీయాల్లో కొత్త తరహా నిరసనలు ఈ మధ్యన ఎక్కువ అయ్యాయి. అలాంటి తీరుకు పరాకాష్ఠగా మారిన ఉదంతం రాజస్థాన్ లో చోటు చేసుకుంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్ కు వ్యతిరేకంగా మాజీ మంత్రి ఒకరు చేసిన పని ఇప్పుడు షాకింగ్ గా మారింది. సాధారణంగా అధికారపక్ష అధినేతపై విపక్షాలు విరుచుకుపడుతుంటాయి. అందుకు భిన్నంగా కాంగ్రెస్ సీఎం అశోక్ గెహ్లాత్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన సొంత పార్టీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.

మాజీ మంత్రిగా వ్యవహరించిన సాంగోద్ ఎమ్మెల్యే భరత్ సింగ్ తాజాగా సొంత పార్టీకి చెందిన ముఖ్యమంత్రిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ.. పార్టీలోని అంతర్గత కుమ్ములాటలు ఏ స్థాయిలో ఉన్నాయో చాటేలా తాజా పరిణామం ఉంది. ముఖ్యమంత్రిని తీవ్రంగా తప్పు పడుతూ.. ఆయనకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసే భరత్ సింగ్ తాజాగా అనూహ్య రీతిలో రియాక్టు అయ్యారు. అశోక్ గహ్లాత్ గౌరవం.. విశ్వాసం చనిపోయాయని.. అందుకే ఆయనకు తన తల వెంట్రుకలు పంపుతున్నట్లుగా పేర్కొన్నారు.

'నేను గుండు చేయించుకున్నాను. నా కేశాల్ని ఆయనకు పంపుతున్నా' అంటూ ఒక బాక్సుకు తన ప్రశ్నలతో కూడిన ఒక లేఖను జత చేసిన వైనం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కోటా హెరిటేజ్ రివర్ ఫ్రంట్ ప్రారంభోత్సవానికి హాజరు కావాల్సిన ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్ రాని వేళ.. ఆయనపై విరుచుకుపడిన సొంత పార్టీ ఎమ్మెల్యే వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యమంత్రి గాంధీ సిద్ధాంతాల్ని అనుసరిస్తారని.. ఆయన గనుల మంత్రి ప్రమోద్ జైన్ మరో దారిలో వెళతారన్న భరత్ సింగ్.. 'ముఖ్యమంత్రి పదవి శాశ్వితం కాదు' అంటూ ఆగ్రహాన్ని ప్రదర్శించారు.