ఎమ్మెల్యేలకు క్వార్టర్లు.. ప్రజలకు ఇండ్లు ఏవీ?
రాజధాని అమరావతిలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ క్వార్టర్సు నిర్మించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
By: Tupaki Desk | 10 July 2025 8:00 PM ISTరాజధాని అమరావతిలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ క్వార్టర్సు నిర్మించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాజధానిలో ప్రజాప్రతినిధుల నివాసం ఉండేలా ఏర్పాట్లు చేయడంలో తప్పు ఏమీ లేకపోయినా, అదే సమయంలో పేదలకు శాశ్వత గృహ వసతి కల్పించాలన్న బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉందని గుర్తు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్నా, కొత్తగా బలహీన వర్గాల గృహ నిర్మాణానికి ఎలాంటి చొరవ తీసుకోలేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాజధానిలో కోట్ల రూపాయల ఖర్చుతో ఎమ్మెల్యేల క్వార్టర్లు నిర్మించాలని ప్రతిపాదన తీసుకువరావడం కరెక్టు కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రాజధాని అమరావతి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అంతర్గత రహదారులు, కాలువలతోపాటు ఐకానిక్ భవనాల నిర్మాణం వేగవంతమైంది. ఇక ఇప్పటికే అఖిల భారత సర్వీసు అధికారుల కోసం భారీ గృహ సముదాయాన్ని సిద్ధం చేశారు. చంద్రబాబు 3.O సర్కారులోనే ఈ పనులు పూర్తి అయినా, తుది మెరుగులు దిద్దాల్సిన సమయంలో ప్రభుత్వం మారడంతో పనులు నిలిచిపోయాయి. ఇక సీఎంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఈ భవన సముదాయాన్ని పరిశీలించిన చంద్రబాబు.. సాధ్యమైనంత తొందరగా వాటి నిర్మాణాలను పూర్తి చేయాలని కంకణం కట్టుకున్నారు.
ఇదేవిధంగా రాజధానిలో ఎమ్మెల్యే క్వార్టర్సు ఉండాలనే సంకల్పం తీసుకున్నారు చంద్రబాబు. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలతోపాటు భవిష్యత్తులో పెరగనున్న ఎమ్మెల్యేల సంఖ్య ఆధారంగా మొత్తం 225 నివాసాలు ఉండేలా ఎమ్మెల్యే క్వార్టర్సు నిర్మాణానికి సీఎం ప్రతిపాదిస్తున్నారు. ప్రస్తుతం 175 మంది ఎమ్మెల్యేలు ఉండగా, మరో రెండేళ్లలో పెరగనున్న ఎమ్మెల్యేలతో మొత్తం 225 క్వార్టర్లు నిర్మించాలని భావిస్తున్నారు. అయితే సీఎం ప్రతిపాదనపై పేద ప్రజలు, ప్రతిపక్ష నేతలు మాత్రం విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలో పేదలకు ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయలేదని వైసీపీ ఆరోపిస్తోంది.
రాష్ట్రంలో శాశ్వత గృహ నిర్మాణానికి చాలా మంది ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తే ఇళ్లు నిర్మించుకోవాలని భావిస్తున్నారని చెబుతున్నారు. కొందరికి స్థలాలు ఉండగా, మరికొందరు ఉచిత స్థలాలు కోసం కూడా దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఎన్నికల సమయంలోను, అనంతరం బలహీన వర్గాల గృహ నిర్మాణానికి పెద్దపీట వేస్తామని సీఎం ప్రకటించారు. గ్రామాల్లో రెండు సెంట్లు, పట్టణాల్లో సెంటున్నర చొప్పున భూమి కేటాయిస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా బీసీలకు రూ.50 వేలు, ఎస్సీ, ఎస్టీలకు రూ.లక్ష చొప్పున గృహ నిర్మాణానికి అదనపు సాయం చేస్తామని చెప్పారు. కానీ ఏడాదిగా ఒక్కరికి కూడా ఈ విధమైన సాయం చేయలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
గత ప్రభుత్వంలో మంజూరైన ఇళ్లు, కేంద్రం కేటాయించిన ఇళ్లకు మాత్రమే ప్రస్తుతం బిల్లులు చేస్తున్నారు గానీ, కొత్తగా ఎవరికీ ఇళ్లు మంజూరు చేయలేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గత ప్రభుత్వంలో గృహ నిర్మాణాల్లో చాలా అవకతవకలు జరిగాయని టీడీపీ అప్పట్లో ఆరోపించింది. కనీసం వాటిని చక్కదిద్దే అంశంపై కూడా ఈ ఏడాదిలో ఆలోచన చేయలేదని మరికొందరు విమర్శిస్తున్నారు. ఎమ్మెల్యే క్వార్టర్సు కట్టే ముందు బలహీన వర్గాల కాలనీలకు ప్రభుత్వం ఆలోచన చేయాలని పలువురు పేదలు కోరుతున్నారు.
