జీవో వార్త కూడా టీడీపీ ఎమ్మెల్యే చెబితేనే రాయాలట!
వ్యతిరేక వార్త రావటం కానీ.. ఇమేజ్ డ్యామేజ్ వార్త రాస్తే ప్రజాప్రతినిధులకు.. రాజకీయ నేతలకు కోపం రావటం ఇప్పటివరకు చూశాం.
By: Tupaki Desk | 28 March 2026 12:17 PM ISTవ్యతిరేక వార్త రావటం కానీ.. ఇమేజ్ డ్యామేజ్ వార్త రాస్తే ప్రజాప్రతినిధులకు.. రాజకీయ నేతలకు కోపం రావటం ఇప్పటివరకు చూశాం. అందుకు భిన్నంగా.. అధికారికంగా వెల్లడైన జీవోలోని అంశాలతో వార్త రాసినందుకు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయటమే కాదు..వెధవ వేషాలు వేస్తావా? అంటూ తిట్ట పురాణం అందుకోవటమే కాదు.. తాను చెప్పినప్పుడు మాత్రమే వార్త రాయాలే తప్పించి.. నీ సొంతానికి సొంతంగా వార్త రాస్తావా? అంటూ విరుచుకుపడిన షాకింగ్ ఉదంతం ఏపీలో చోటు చేసుకుంది. ఏపీలోని అధికారపక్షమైన కూటమిలో టీడీపీకి చెందిన ఎమ్మెల్యే మామిడి గోవిందరావు బూతుపురాణం ఇప్పుడు సంచలనంగా మారింది.
ఒక ప్రముఖ మీడియా ప్రతినిధితో సదరు ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయటమే కాదు.. నోటికి వచ్చినట్లుగా తిట్టిన వైనంపై విస్మయం వ్యక్తమవుతోంది. ఏపీ అధికారపక్షానికి దన్నుగా ఉంటుందన్న పేరున్న మీడియా సంస్థకు చెందిన ప్రతినిధి పట్ల ఈ విధంగా వ్యవహరించటం చూస్తే.. ఏంది చంద్రబాబు అని అనుకోకుండా ఉండలేని పరిస్థితి. ఇంతకూ సదరు వార్త కారణంగా ఎమ్మెల్యేకు జరిగే నష్టం కూడా ఏమీ లేకపోవటం విశేషం. ఇంతకూ అసలేం జరిగిందన్నది చూస్తే.. ఇలా కూడా తిట్టేస్తారా? అన్న సందేహం కలుగుతుంది.
శ్రీకాకుళం జిల్లా పిండ్రువాడకు చెందిన శిమ్మయ్య అనే వ్యక్తి గత ఏడాది అక్టోబరు 10న పిడుగుపాటుకు గురై మరణించాడు. జిల్లా కలెక్టర్ పంపిన ప్రతిపాదనల నేపథ్యంలో శిమ్మయ్య కుటుంబానికి రూ.4 లక్షల నష్టపరిహారాన్ని మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ గురువారం అధికారిక ఉత్తర్వు జారీ చేశారు. ఇదే అంశాన్ని ప్రభుత్వం జీవోఐఆర్ వెబ్ సైట్ లోనూ ఉంచింది.
దీని ఆధారంగా వార్త రాసిన సదరు విలేకరిపై ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఇష్టారాజ్యంగా తిట్టేశారు. తాను చెప్పకుండానే జీవో వివరాలతో వార్త ఎలా రాస్తావు? అంటూ చెలరేగిపోయిన ఆయన.. నువ్వేం రాస్తావో చూసుకుందాం. నిన్ను వదలనంటూ విరుచుకుపడటమేకాదు.. ‘‘నేను తిరగబడకూడదని ఊరుకుంటున్నాం. డబ్బులు కావాలంటే కుక్కలకు వేసినట్లు వేస్తాం. ఇలా రాస్తే నా పని నేను చేస్తా’’ అంటూ విరుచుకుపడ్డారు. ప్రభుత్వం జీవోలు పెట్టిన తర్వాత రాయటమన్నది రెగ్యులర్ గా జరిగే ప్రక్రియగా చెప్పినా.. తాను చెబితేనే రాయాలన్న ధోరణి చూస్తే.. ఇలా కూడా మొదలెట్టేశారా? అన్న సందేహం మనసుకు రాక మానదు. ఏమైనా.. ఈ ఉదంతం షాకింగ్ గా మారింది.మరి..దీనిపై సీఎం చంద్రబాబు ఎలా స్పందిస్తారు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.
