బ్రేకింగ్... కరుణానిధి పెద్ద కుమారుడు, నటుడు ముత్తు మృతి!
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి పెద్ద కుమారుడు ముత్తువేల్ కరుణానిధి ముత్తు (ఎంకె ముత్తు) అనారోగ్యంతో మరణించారు.
By: Tupaki Desk | 19 July 2025 10:42 AM ISTతమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి పెద్ద కుమారుడు ముత్తువేల్ కరుణానిధి ముత్తు (ఎంకె ముత్తు) అనారోగ్యంతో మరణించారు. ప్రస్తుతం ఆయన వయస్సు 77 ఏళ్లు. గత కొంతకాలంగా అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆయన కాసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు. ఈయన 1948 జనవరి 14న కరుణానిధి - పద్మావతి దంపతులకు జన్మించారు.
అవును... కరుణానిధి పెద్ద భార్య పద్మావతికి జన్మించిన ఎం.కె.ముత్తు కాసేపటి క్రితం మరణించారు. తన తండ్రి కళాభిరుచి లాగే ఎం.కె.ముత్తు కూడా తొలుత నాటకాల్లో, తరువాత సినిమాల్లో నటించడం ప్రారంభించారు. ఇదే సమయంలో.. 70వ దశకంలో డీఎంకే వేదికలపై పార్టీ విధానాలను వివరిస్తూ పాటలు పాడటం ద్వారా ప్రజల్లో ఎంతో ఆదరణ పొందారు.
వాస్తవానికి ఎంజీఆర్ కు పోటీగా ఎం.కె.ముత్తును కరుణానిధి చిత్ర పరిశ్రమలోకి తీసుకువచ్చారని చెబుతారు. ఆయన నటించిన చిత్రాలలో పిళ్ళైయో పిళ్ళై (1972), పూకారి (1973), షయాలికారన్ (1974), దమయ విల్లుక్కు (1975) అత్యంత ముఖ్యమైనవిగా చెబుతారు. ఆయన డీఎంకే వేదికలపైనే కాకుండా పలు సినిమాల్లో కొన్ని పాటలు కూడా పాడారు.
ఆయన నటన, రూపురేఖలు ఎంజీఆర్ కు ఏమాత్రం తగ్గకుండా ఉన్నాయని అప్పట్లో చెప్పుకునేవారు! ఇక గత కొంతకాలంగా వృద్ధాప్యం, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఎం.కె.ముత్తు చెన్నైలోనే ఉంటున్నారు. ఈ క్రమంలో శనివారం అనారోగ్యంతో మరణించారు. ఆయన భౌతికకాయాన్ని చెన్నైలోని ఇంజంబక్కంలోని ఆయన నివాసంలో ప్రజల సందర్శనార్ధం ఉంచారు.
మరోవైపు ఈరోజు డీఎంకే తరపున జరగాల్సిన అన్ని కార్యక్రమాలు రద్దు చేయబడ్డాయి. ఎం.కె.ముత్తు జీవితంలో కళ, రాజకీయాలు, వ్యక్తిగత సవాళ్లు సహా అనేక కోణాలు ఉన్నాయని చెబుతారు. ఆయన మరణం డీఎంకే కార్యకర్తలలోనూ, అటు చిత్ర పరిశ్రమలోనూ తీవ్ర విషాదాన్ని కలిగించింది.
కాగా... కరుణానిధికి పద్మావతి, దయాళు అమ్మాళ్, రాజతి అమ్మాళ్ అనే ముగ్గురు భార్యలు ఉండేవారు! కరుణానిధి, అతని మొదటి భార్య పద్మావతి దంపతుల ఏకైక కుమారుడు ఎంకే ముత్తు. ముత్తుకు భార్య, ఇద్దరు సంతానం ఉన్నారు. వారిలో కుమారుడు అరివునిధి, కుమార్తె తెన్ మొళి.
కరుణానిధి రెండో భార్య దయాళు అమ్మాల్ కాగా... వీరికి నలుగురు సంతానం. అందులో వారి మొదటి కొడుకు ఆళగిరి.. రెండో కుమారుడు సీఎం స్టాలిన్.. మూడో కుమారుడు తమిళరసు కాగా.. కుమార్తె సెల్వి!
ఇక.. కరుణానిధి మూడో భార్య పేరు రాజాతి అమ్మాళ్ కాగా.. ఆమెకు ఒకరే కుమార్తె. ఆమె పేరు కనిమొళి!
