ఏపీ బాటలో కర్ణాటక పరిశ్రమలు.. ఫస్ట్ వచ్చే పరిశ్రమ ఇదే..
కర్ణాటకలో సానుకూల పరిస్థితులు లేకపోవడంతో ఆ రాష్ట్రం నుంచి తరలిపోవాలని భావిస్తున్న పరిశ్రమలకు ఏపీ రెడ్ కార్పెట్ స్వాగతం పలుకుతోంది
By: Tupaki Desk | 21 Sept 2025 2:00 PM ISTకర్ణాటకలో సానుకూల పరిస్థితులు లేకపోవడంతో ఆ రాష్ట్రం నుంచి తరలిపోవాలని భావిస్తున్న పరిశ్రమలకు ఏపీ రెడ్ కార్పెట్ స్వాగతం పలుకుతోంది. ఇప్పటికే ఈ విషయంలో దూకుడు ప్రదర్శిస్తున్న ఏపీ ప్రభుత్వం, మంత్రి లోకేశ్ కు దిగ్గజ స్టీల్ పరిశ్రమ యాజమాన్యం మిట్టల్ గ్రూప్ గుడ్ న్యూస్ చెప్పింది. కర్ణాటకలో ఏర్పాటు చేయాలని భావించిన తమ స్టీల్ ప్లాంట్ ను విశాఖకు తరలిస్తున్నట్లు మిట్టల్ గ్రూప్ తాజాగా ప్రకటించింది. దీంతో కర్ణాటక నుంచి ఏపీ వస్తున్న తొలి పరిశ్రమగా మిట్టల్ స్టీల్ రికార్డు నమోదు చేసింది.
గతంలో ఏపీ, తెలంగాణ నుంచి పరిశ్రమలను తన్నుకుపోయిన కర్ణాటక.. తాజా పరిస్థితుల్లో వాటిని కాపాడుకోవడం పెద్ద చాలెంజింగ్ గా మారిందని అంటున్నారు. చంద్రబాబు 3.O ప్రభుత్వంలో ఫాక్స్ కాన్ పరిశ్రమను ఏపీలో ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరిగాయి. అయితే 2019లో చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయిన తర్వాత ఫాక్స్ కాన్ కర్ణాటకకు తరలిపోయింది. అయితే ఇప్పుడు అక్కడి పరిస్థితులు సానుకూలంగా లేకపోవడంతో అనేక పరిశ్రమలు ఇతర ప్రాంతాలకు తరలిపోవాలని భావిస్తున్నాయి. ఇటువంటి వాటిని అందిపుచ్చుకునేలా ఏపీ ప్రభుత్వం పావులు కదుపుతోంది.
గతంలో కర్ణాటకలో ఏరో స్పేస్ పార్క్ ఏర్పాటుకు స్థానికుల నుంచి వ్యతిరేకత వచ్చినప్పుడు, ప్రైవేటు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయిస్తే నాస్కామ్ (నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్భంలోనూ మంత్రి నారా లోకేశ్ చురుగ్గా స్పందించారు. ఆయా పరిశ్రమలను ఏపీకి రమ్మంటూ బహిరంగంగా ఆహ్వానించారు. ఇక రెండు రోజుల క్రితం బెంగళూరులో రోడ్ల నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ బ్లాక్ బక్ సీఈవో రాజేశ్ యాబాజీ ట్వీట్ చేయగా, ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పందిస్తూ బ్లాక్ మెయిల్ చేయొద్దంటూ హెచ్చరించారు. అప్పుడు కూడా లోకేశ్ వేగంగా స్పందించి బ్లాక్ బక్ ను విశాఖకు ఆహ్వానించారు.
ఇలా ఏ అవకాశం దొరికినా మంత్రి లోకేశ్ పోటీపడుతూ, పరిశ్రమలను ఆహ్వానిస్తుండటాన్ని మిట్టల్ గ్రూప్ పరిగణలోకి తీసుకుంది. కర్ణాటకలోని బళ్లారి జిల్లాలో ఏర్పాటు చేయాలని భావించిన స్టీల్ పరిశ్రమను ఏపీకి తరలించాలని నిర్ణయం తీసుకుంది. దాదాపు 15 ఏళ్ల నుంచి బళ్లారిలో స్టీల్ పరిశ్రమ ఏర్పాటుకు మిట్టల్ గ్రూప్ ప్రయత్నాలు చేస్తున్నా, ఇంతవరకు ఎలాంటి పురోగతి సాధించలేకపోయినట్లు ఆ సంస్థ ఆవేదన వ్యక్తం చేస్తోంది. స్టీల్ పరిశ్రమ ఏర్పాటుకు భూమిని కేటాయించిన కర్ణాటక ప్రభుత్వం.. అనుమతులు జారీలో అంతులేని జాప్యం చేయడాన్ని జీర్ణించుకోలేని మిట్టల్ స్టీల్ తమ పరిశ్రమను ఏపీలోని విశాఖకు తరలిస్తున్నట్లు ప్రకటించింది. దీనిపై త్వరలో ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోనున్నట్లు వెల్లడించింది.
వాస్తవానికి కర్ణాటకలోని బళ్లారి జిల్లా కుడితిని సమీపంలో పరిశ్రమల స్థాపనకు 2010లో 12,500 ఎకరాల భూమిని రిజర్వు చేశారు. బీజేపీ నేత బీఎస్ యడియూరప్ప ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేఐఏడీబీ ద్వారా ఈ భూములను సేకరించారు. ఇందులో మిట్టల్ స్టీల్ కి 2,643 ఎకరాలు కేటాయించారు.. కుడితిని, వేణివీరాపురం, హరగినధోని, కొలగల్లు, రారంగవి, జానకుంట, సిద్దమనహళ్లి తదితర గ్రామాల పరిధిలో సేకరించిన 12,500 ఎకరాలలో 4,800 ఎకరాలను ఉత్తమ్ గాల్వా, 2,850 ఎకరాలను ఎన్‌ఎండీసీ, 2,643 ఎకరాలను మిట్టల్ కంపెనీకి కేటాయించారు. ఆ తర్వాత ఇక్కడ పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం ఇవ్వలేదని చెబుతున్నారు. ఫలితంగా ఆయా భూముల్లో ఇంత వరకూ ఒక్క పరిశ్రమ కూడా ఏర్పాటు కాలేదు. ఈ పరిస్థితుల్లో ఏపీకి తరలిరావాలని మిట్టల్ స్టీల్ నిర్ణయించుకోవడం విశేషంగా చెబుతున్నారు.
