మూడు రాజధానుల మీద వైసీపీ ఎంపీ షాకింగ్ కామెంట్స్
ఏపీలో మూడు రాజధానులు అన్నది ముగిసిన అధ్యాయమా లేక భవిష్యత్తులో తెరవబడే అధ్యాయమా అంటే వైసీపీ నుంచి స్పష్టత ఉందా.
By: Satya P | 12 April 2026 12:51 AM ISTఏపీలో మూడు రాజధానులు అన్నది ముగిసిన అధ్యాయమా లేక భవిష్యత్తులో తెరవబడే అధ్యాయమా అంటే వైసీపీ నుంచి స్పష్టత ఉందా. అలాగే అమరావతి రాజధాని రైతులు వైసీపీ మీద తీవ్ర ఆగ్రహంగా ఒకానొక దశలో ఉన్నారు. ఏకంగా 1500 రోజులకు పైగా ఆందోళనలు నిరసనలు చేశారు. వారు వైసీపీని నమ్మొచ్చా. అమరావతి రాజధాని విషయంలో వైసీపీకి ఉన్న వ్యతిరేకత ఏమిటి ఇలాంటి ప్రశ్నలకు ఒక ప్రముఖ తెలుగు చానల్ లో ఇచ్చిన ఇంటర్వ్యూలో వైసీపీకి లోక్ సభలో నాయకుడు అయిన పి మిథున్ రెడ్డి పూర్తి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అమరావతి రైతులు తమను నమ్మవచ్చు అని ఆయన అంటున్నారు.
తప్పులు దిద్దుకుంటూ :
ఇక చూస్తే 2019 నుంచి 2024 మధ్యలో వైసీపీ మూడు రాజధానుల విషయం మీద గట్టి పట్టుదల మీద ఉంది. దానికి సంబంధించి మిధున్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో ఓటమి తరువాత తాము పునరాలోచన చేశామని చెప్పారు. ఏ రాజకీయ పార్టీ అయినా తప్పులను సరిదిద్దుకునేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. అది ఆ పార్టీ భవిష్యత్తుకే మంచిదని ఆయన చెప్పుకొచ్చారు. ఆ విధంగా తమ పార్టీ కూడా మూడు రాజధానుల విషయంలో రీ థింక్ చేస్తోంది అన్నారు. అమరావతి ప్రాంతంలో రాజధానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆయన చెప్పారు. అదే సమయంలో అమరావతి తో పాటుగా మచిలీపట్నం, విజయవాడ గుంటూరు కలిపి అభివృద్ధి చెందాలన్నదే తమ ఆలోచన అని చెప్పారు. అలాగే ఏపీలో ఉత్తరాంధ్రా రాయలసీమ వంటి వెనుకబడిన ప్రాంతాలకు సమగ్రమైన అభివృద్ధిని చూపించాలన్నదే తమ ఆలోచన అని చెప్పారు.
అమరావతి పరిధి :
అమరావతి రాజధాని పరిధిలో విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకే క్లారిటీ లేదని మిధున్ రెడ్డి విమర్శించారు. యాభై వేల ఎకరాలు మొదట తీసుకున్నారని 2014 నుంచి 2019 మధ్యలో తొలి అయిదేళ్లలో పూర్తి చేయలేకపోయారు అని ఆయన విమర్శించారు. 2024 నుంచి 2026 మధ్యలో రెండేళ్ల కాలంలో కూడా అమరావతికి పెద్దగా ఖర్చు చేసింది ఏమీ లేదని అన్నారు పైగా మరో యాభై వేల ఎకరాలను సేకరిస్తున్నారని ఈ సేకరణ లక్ష ఎకరాలకు మించి కూడా సాగుతుందేమో అని ఆయన అన్నారు. అసలు అమరావతి రాజధాని పరిధి ఎక్కడ ఏమిటి ఎన్నాళ్ళలో ఎలా అభివృద్ధి చేస్తారు అన్న దాని మీద చంద్రబాబు ఈ రోజుకీ జవాబు చెప్పలేకపోతున్నారు అని మిధున్ రెడ్డి విమర్శించారు.
అందుకే వ్యతిరేకించాం :
ఏపీకి రాజధాని విషయం టీడీపీ సొంత వ్యవహారం కాదని మిధున్ రెడ్డి అన్నారు. ఏపీ ప్రజల భవిష్యత్తు అని ఆయన అంటూ దీని మీద ఎపుడూ క్లారిటీగా టీడీపీ వ్యవహరించలేదని ఆయన విమర్శించారు. అమరావతి పేరుతో చేసే దోపిడీ అధికంగా ఉందని అన్నారు. అక్కడ నిర్మాణాల పేరుతో అవినీతి జరుగుతోదని అన్నారు. అందుకే తాము పార్లమెంట్ లో తమ పార్టీ వ్యతిరేకించాల్సి వచ్చిందని మిధున్ రెడ్డి చెప్పారు.
అభివృద్ధి వికేంద్రీకరణ :
వైసీపీ మొదటి నుంచి చెబుతోంది అభివృద్ధి వికేంద్రీకరణ గురించే అని ఆయన అన్నారు. ఈ రోజున దేశంలో ముంబైని ఆర్ధిక రాజధానిగా చేసుకున్నామని కీలక పరిశ్రమలు దేశంలో అంతటా విస్తరించాలని ఆ మోడల్ ని వైసీపీ నమ్ముతుందని చెప్పారు. అన్నీ ఒకే చోట అన్న కాన్సెప్ట్ మంచిది కాదని ఆయన అన్నారు. తాము మంచి ఆలోచనతోనే విశాఖను ఆర్థిక రాజధాని అని అన్నామని, వెనుకబడిన కర్నూలుకు హైకోర్టు పెట్టాలని సూచించామని చెప్పారు అయితే ఈ విషయంలో రాజకీయ రచ్చ జరిగిందని ఆయన అన్నారు.
లిక్కర్ స్కాం రాజకీయ కక్ష :
ఏపీలో లిక్కర్ స్కాం లో తన పేరుని పెట్టారని వేధించారని ఆయన విమర్శించారు. చంద్రబాబు సొంత జిల్లా కాబట్టే తమను లక్ష్యంగా చేశారని అన్నారు. కాలేజీలో ఉన్నప్పుడే తన మీద కేసులు పెట్టారని ఆయన గుర్తు చేశారు. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చాక వైసీపీ నేతలను పూర్తిగా లక్ష్యంగా చేసుకుని పని చేస్తున్నారు అని అన్నారు. కూటమి కట్టుకధలలో తనను 75 రోజుల పాటు జైలులో పెట్టారని అన్నారు. తన మీద ఏ అవినీతి ఆరోపణలు రుజువు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తాను ఎన్నికల్లో ఇచ్చిన అఫిడవిట్ తప్పించి కొత్తగా ఏమి ఆస్తులు ఉన్నాయో చూపించాలని మిధున్ రెడ్డి సవాల్ చేశారు.
