టెర్రరిస్టులా చూస్తున్నారు.. కంటతడి పెట్టిన మిథున్ రెడ్డి తల్లి
వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి తల్లి స్వర్ణలత కంట తడి పెట్టుకున్నారు. రాజమండ్రి జైలులో ఉన్న తన కుమారుడిని చూసిన ఆమె చలించిపోయారు.
By: Tupaki Desk | 28 July 2025 6:40 PM ISTవైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి తల్లి స్వర్ణలత కంట తడి పెట్టుకున్నారు. రాజమండ్రి జైలులో ఉన్న తన కుమారుడిని చూసిన ఆమె చలించిపోయారు. జైలులో ఎంపీకి ఎలాంటి సౌకర్యాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన బిడ్డకు బాగా చూసుకోవాలని జైలు అధికారులను కోరారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న మిథున్ రెడ్డితో తల్లి స్వర్ణలత సోమవారం మిలాఖత్ లో కలిశారు. అనంతరం జైలు బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. ఈ సమయంలో ఆమె కంటితడి పెట్టిన వీడియో వైరల్ గా మారింది.
సౌకర్యాల కోసం వినతి
లిక్కర్ స్కాంలో అరెస్టు అయి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న మిథున్ రెడ్డికి కోర్టు ఆదేశాలతో ఐదు మిలాఖతుల ద్వారా కుటుంబ సభ్యులను కలుసుకునేందుకు అవకాశం కల్పించారు. అదేవిధంగా రోజూ ఇంటి నుంచి ఆహారం అందివ్వాలని కోర్టు సూచించడంతో మిథున్ రెడ్డి తండ్రి రామచంద్రారెడ్డి రోజూ రాజమండ్రి జైలుకు వస్తున్నారు. ఈ క్రమంలోనే సోమవారం మిథున్ రెడ్డి తల్లి జైలు వద్దకు వచ్చారు. కొద్దిసేపు ఆయనతో మాట్లాడిన తర్వాత బయటకు వచ్చి మీడియా ఎదుట తన కుమారుడి దుస్థితిపై ఆవేదన వ్యక్తం చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న మిథున్ రెడ్డి జైలులో అరకొర సౌకర్యాలతో ఇబ్బంది పడుతున్నట్లు తెలిపారు.
కన్నీరుపెట్టుకున్న స్వర్ణలత
జైలులో అదనపు సౌకర్యాల కోసం తమ లాయర్ ద్వారా ప్రయత్నిస్తున్నట్లు స్వర్ణలత చెప్పారు. అయితే తమ వినతిపై కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సివుందని ఆందోళన వ్యక్తం చేశారు. అదేసమయంలో మిథున్ రెడ్డికి మంచం ఇచ్చారా? లేక కిందే పడుకుంటున్నారా? అంటూ మీడియా ప్రశ్నించగా, తాను ఆ విషయం అడగలేదంటూ ఆమె కన్నీరు పెట్టుకున్నారు. తన కుమారుడు ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. జైలు అధికారులు మిథున్ రెడ్డిని బాగా చూసుకోవాలని కోరారు. ఆయనను టెర్రరిస్టు మాదిరిగా చూడొద్దని ప్రాధేయపడ్డారు.
తిరుపతి నుంచి రాజమండ్రికి..
దాదాపు నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న పెద్దిరెడ్డి కుటుంబం లిక్కర్ స్కాం కారణంగా తొలిసారి ఇలా రోడ్డుపైకి రావడం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబుకు సమకాలీకుడుగా రాజకీయాలు చేస్తున్న సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గత ప్రభుత్వంలో కీలక నేతగా పనిచేశారు. ప్రధానంగా ఆయన కనుసన్నల్లో రాయలసీమ రాజకీయాలు కొనసాగాయి. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి జగన్ కు అత్యంత సన్నిహితుడైన మిథున్ రెడ్డి పార్టీలో ప్రధాన నేతగా ఎదిగారు. ఉభయ గోదావరి జిల్లాల వ్యవహారాలతోపాటు ఢిల్లీ స్థాయిలో పార్టీ వ్యవహారాలను చక్కబెట్టేవారు. అలాంటి నేతను అరెస్టు చేసి జైలులో వేయడంతో వైసీపీ శ్రేణులు కంగుతిన్నాయి. ఈ పరిణామాన్ని ఊహించని పెద్దిరెడ్డి కుటుంబం తిరుపతి నుంచి రాజమండ్రి తరలివచ్చి మిథున్ రెడ్డి యోగక్షేమాలను పర్యవేక్షిస్తోంది. జైలులో మిథున్ రెడ్డి ఉండగా, ఆయన కుటుంబ సభ్యులు జైలు బయట పడిగాపులు కాస్తున్నారు. వారిని పరామర్శించేందుకు వైసీపీ నేతలు పెద్ద సంఖ్యలో రాజమండ్రి తరలివస్తున్నారు.
