ఏసీబీ కోర్టు కీలక నిర్ణయం... రాజమండ్రి సెంట్రల్ జైలుకు మిథున్ రెడ్డి!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారిన లిక్కర్ స్కామ్ కేసులో వరుస సంచలనాలు నమోదవుతున్నాయి.
By: Tupaki Desk | 20 July 2025 5:32 PM ISTఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారిన లిక్కర్ స్కామ్ కేసులో వరుస సంచలనాలు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని శనివారం సిట్ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఆదివారం ఆయనను ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో కోర్టు మిథున్ రెడ్డికి రిమాండ్ విధించింది.
అవును... ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వరుస కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ సమయంలో... ఈ కేసులో అరెస్ట్ అయిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. ఇందులో భాగంగా.. 14 రోజులు విధించింది. దీంతో.. కాసేపట్లో భారీ బందోబస్తు నడుమ మిథున్ రెడ్డిని రాజమండ్రిలోని సెంట్రల్ జైలుకు తరలించనున్నారు.
మిథున్ రెడ్డిని కోర్టులో హాజరుపరచకముందు సిట్ కార్యాలయం నుంచి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా... బీపీ, షుగర్, ఈసీజీ వంటి వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని నిర్ధారించారు. దీంతో... ఆయన్ను సిట్ అధికారులు ఏసీబీ కోర్టులో హాజరు పరిచారు.
కాగా... ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మిథున్ రెడ్డి ఏ4గా ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయనను శనివారం సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. విచారణకు హాజరైన ఆయనను సుమారు 6 గంటలకు విచారించిన అనంతరం అదుపులోకి తీసుకున్నారు. ఈ సమయంలో కోర్టులో ప్రవేశపెట్టగా.. ఇరు పక్షాల వాదనలు విన్న అనంతరం మిథున్ రెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించింది.
