Begin typing your search above and press return to search.

అమరావతి మీద క్లారిటీ లేదా...మిధున్ రెడ్డి సీరియస్ కామెంట్స్

అంతే కాదు మాజీ మంత్రి ఆర్కే రోజా విషయంలోనూ ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

By:  Satya P   |   12 April 2026 10:47 AM IST
అమరావతి మీద క్లారిటీ లేదా...మిధున్ రెడ్డి సీరియస్ కామెంట్స్
X

ఏపీకి ఒక రాజధాని ఉండాలన్నది ఆంధ్రుల కోరిక. దాని కోసం ఏడున్నర దశాబ్దాల బట్టి అలా వివాదాలు సాగుతూనే ఉన్నాయి. మద్రాస్, కర్నూల్, హైదరాబాద్ ఇపుడు అమరావతి. ఏకైక రాజధాని శాశ్వత రాజధాని అమరావతి అని ఇప్పటికైనా అంతా ఒక మాటకు వచ్చి అనుకుంటారా అంటే జవాబు నిరాశగానే వస్తోంది. ఏపీలో కూటమి ప్రభుత్వం అయితే అమరావతికి చట్టబద్ధత తెచ్చామని చెబుతోంది. దీనిని ఎవరూ కదల్చలేరని అంటోంది. అదే సమయంలో వైసీపీ ఏ చట్ట సభలలో దీని మీద సవరణలు తెచ్చారో అదే చట్ట సభలలో మార్పులు చేయలేరా అని అంటోంది. మొత్తం మీద చూస్తే అమరావతి అని కూటమి అంటే అది అధిక ఖర్చు మావిగాన్ అని వైసీపీ కొత్త ప్రతిపాదన చేస్తోంది. ఈ విధమైన వాదాలు వివాదాల నేపథ్యంలో వైసీపీకి లోక్ సభలో నాయకుడు అయిన పెద్దిరెడ్డి మిధున్ రెడ్డిని ఒక ప్రముఖ తెలుగు చానల్ క్రాస్ ఫైర్ చేస్తూ అనేక రకాలైన ప్రశ్నలు సంధించింది. వాటికి అంతే ఫైర్ తో ఆయన కూడా బదులు ఇచ్చారు.

బాబుకే క్లారిటీ లేదు :

తాము పార్లమెంట్ లో అమరావతి చట్టబద్ధత కల్పించే బిల్లుకు మద్దతు ఇవ్వకపోవడానికి కారణం అనేక సందేహాలు ఉండడమే అని అన్నారు. ఈ బిల్లు విషయంలో చాలా వాటి మీద స్పష్టత లేదని అన్నారు మొదట సేకరించిన యాభై వేల ఎకరాల భూములకు సంబంధించి ఏ విధంగా అభివృద్ధి చేస్తారు, ఎంత కాలం పడుతుంది అన్న దానికి బాబు బదులు ఇవ్వలేకపోతున్నారు అని అన్నారు. ఇదిలా ఉంటే రెండవ విడత భూసేకరణకు ఆయన పూనుకుంటున్నారు అని విమర్శించారు. అక్కడ రైతులకు అన్యాయం జరుగుతోందని వారికి ప్లాట్స్ ఎప్పటిలోగా అన్ని వసతులు కల్పించి అప్పగిస్తారు అన్నది కూడా తెలియడం లేదని మిధున్ రెడ్డి చెప్పుకొచ్చారు. అమరావతికి ఎంత ఖర్చు చేస్తామని ఇప్పటిదాకా చంద్రబాబు ఎక్కడా చెప్పలేదని మిధున్ రెడ్డి గుర్తు చేశారు. ఒక్కో రోజు ఒక్కో మాట చంద్రబాబు అమరావతి విషయంలో మాట్లాడుతున్నారని మిధున్ రెడ్డి విమర్శించారు.

గల్లా జయదేవ్ మంచి మిత్రుడు :

ఇదిలా ఉంటే తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ ఎంపీ కీలక నాయకుడు గల్లా జయదేవ్ తనకు మంచి అని మిధున్ రెడ్డి క్రాస్ ఫైర్ లో చెప్పడం విశేషం. ఆయనకు చెందిన అమర రాజా కంపెనీని తాము ఎక్కడికీ పంపించవేయలేదని చెప్పారు. అవన్నీ తప్పుడు వార్తలు అని అన్నారు. గల్లా కుటుంబంతో తమకు మంచి సంబంధాలు గతం నుంచి కొనసాగుతున్నాయని చెప్పారు. అంతే కాకుండా తాను 2024 ఎన్నికల్లో రాజంపేట నుంచి ఎంపీగా గెలిచినపుడు తనకు తొలి ఫోన్ కాల్ చేసి అభినందించిన వారు మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి అని చెప్పారు. మీడియాలో వచ్చిన వార్తలు వేరు, బయట జరిగేది వేరు అని ఆయన క్లారిటీ ఇచ్చారు.

రోజా మా బంధువు :

అంతే కాదు మాజీ మంత్రి ఆర్కే రోజా విషయంలోనూ ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రోజా తమకు బంధువు అవుతుందని అన్నారు. ఆమె సోదరులతో తనకు మంచి రిలేషన్స్ ఉన్నాయని చెప్పారు. తమ పార్టీకి చెందిన రోజాని తాము ఎందుకు వ్యతిరేకిస్తామని ఆయన ప్రశ్నించారు. జగన్ మంత్రివర్గంలో తన తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తో పాటు రోజా కూడా పనిచేసిన సంగతిని ఆయన గుర్తు చేశారు. జగన్ తలచుకుంటే ఎవరైనా మంత్రులు అవుతారు కానీ ఎవరు ఎవరినీ అడ్డుకునేది లేదని అన్నారు. నగరిలో రోజా గెలవాలని తాను ఎన్నికల ప్రచారం నిర్వహించానని ఆయన చెప్పారు. తమకు పార్టీ తల్లి లాంటిదని ఆయన అంటూ పార్టీకి ఎవరు విరుద్ధంగా వ్యవహరించినా తాము కూడా దూరం అవుతామని చెప్పారు.

విజయసాయి చెప్పింది అదే :

లిక్కర్ స్కాం విషయంలో మిథున్ రెడ్డితో కీలక పాత్ర అని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎక్కడా చెప్పలేదని మిధున్ రెడ్డి స్పష్టం చేశారు. పైగా మిధున్ రెడ్డికి ఏమి సంబంధం అని ఆయన మీడియాతో అన్న మాటలను తాను కూడా చూశాను అన్నారు ఇక అరబిందో సంస్థ నుంచి తన సంస్థ పీఎల్ఆర్ ప్రాజెక్టుకు అయిదు వేల రూపాయలు లావాదేవీలు జరిగాయని అయితే ఆరు నెలల తేడాలో అవి వెనక్కి వెళ్ళాయని చెప్పారు. లిక్కర్ స్కాం కి ఈ లావాదేవీలకు ఏమీ సంబంధం లేదని అన్నారు. అదొక లెజిట్మెంట్ లావాదేవీ అని అన్నారు. ఇలా వచ్చింది అలా వెళ్ళిపోయిందని చెప్పారు. తాను లిక్కర్ వ్యాపారానికి ఎపుడూ దూరమని ఆయన చెబుతూ ఇది తన విధానం అని కూడా స్పష్టం చేశారు.