Begin typing your search above and press return to search.

చిన్నారి జ్ఞానేశ్వరి దొరకాలని ....పవన్ సంచలన నిర్ణయం

ఇంతకు ముందే చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం ఘటనపై పవన్ కళ్యాణ్ అధికారులను అప్రమత్తం చేశారు.

By:  Satya P   |   14 Jun 2026 1:39 AM IST
చిన్నారి జ్ఞానేశ్వరి దొరకాలని ....పవన్ సంచలన నిర్ణయం
X

కాకినాడ జిల్లాలోని తుని ప్రాంతంలో చిన్నారి అదృశ్యం ఘటన ఇపుడు రాష్ట్రమంతా ప్రకంపనలు రేపుతోంది. ఈ బాలిక ఎలా అదృశ్యం అయింది అన్న దాని మీద అంతా ఉత్కంఠతను ప్రదర్శిస్తున్నారు. బాలిక పెంపుడు కుక్క కూడా శనివారం మరణించడంతో మరింత ఉత్సుకత పెరిగింది. ఈ పెంపుడు కుక్క ఏకంగా ఎనిమిది కిలోమీటర్లు తిరిగింది. బాలిక ఆచూకీ కోసం పోలీసులు ఈ కుక్కను వినియోగించారు. బాలికతో పాటే వెళ్ళి తరువాత వెనక్కి వచ్చిన కుక్క ఇలా ఆహారం ఏమీ తినకుండా కుప్పకూలడం విషాదంగా మారింది. దీంతో బాలిక ఆచూకీ కోసం పోలీసులు చేస్తున్న ప్రయత్నాలలో ఉన్న ఒక్క ఆధారం కూడా లేకుండా పోయినట్లు అయింది.

ఉప ముఖ్యమంత్రి చొరవ :

ఇదిలా ఉంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ కేసు విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఆయన శనివారం నేరుగా కాకినాడ జిల్లా ఎస్పీతో ఫోన్లో మాట్లాడారు. బాలిక ఆచూకీ కనిపెట్టేందుకు చేపట్టిన చర్యలపై పవన్ చర్చించారని భోగట్టా. కాకినాడ జిల్లా తుని మండల పరిధిలోని సీహెచ్ అగ్రహారంలో వారం రోజుల క్రితం అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ త్వరితగతిన కనుగొనేందుకు మరిన్ని బృందాలను రంగంలోకి దించాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ప్రస్తుతం గాలింపు చర్యలలో పాల్గొంటున్న పోలీసు ఎస్డీఆర్ఎఫ్ బృందాలతోపాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాల సేవలు కూడా వినిగియోగించుకోవాలని పవన్ సూచించారు. అదే విధంగా దట్టమైన అడవుల్లోకి సైతం వెళ్లగలిగే అటవీశాఖ నైట్ వాచర్స్ బేస్ క్యాంప్ వాచర్స్ ఎక్స్ పర్ట్స్ సహాయం తీసుకుని పరిసర అటవీ ప్రాంతాల్లో జల్లెడ పట్టాలని కూడా పవన్ పోలీసులను ఆదేశించినట్లుగా చెబుతున్నారు.

మరో మారు సమీక్ష :

ఇంతకు ముందే చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం ఘటనపై పవన్ కళ్యాణ్ అధికారులను అప్రమత్తం చేశారు. అయితే శనివారం మరోసారి కాకినాడ జిల్లా ఎస్పీతో ఫోన్ లో ప్రస్తుతం పరిస్థితిని సమీక్షించారు. అంతే కాదు ఇప్పటికే పలుమార్లు ఈ అంశంపై పోలీసు ఉన్నతాధికారులతో ఉప ముఖ్యమంత్రి మాట్లాడారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. అదృశ్యం అయిన బాలిక ఆచూకి కనుగొనేందుకు ఇప్పటికే 400 మందికిపైగా సిబ్బంది గాలింపు చర్యలలో పాల్గొంటున్నట్టుగానూ అత్యాధునిక డ్రోన్లతో అణువణువు జల్లెడ పడుతున్నట్టుగానూ పవన్ కళ్యాణ్ కి కాకినాడ ఎస్పీ వివరించారు.

ఈ కేసు లోతుల్లోకి :

చిన్నారి ఇంటి పరిసరాల్లో ఏకంగా 38 సీసీ కెమెరాల్లో ఫుటేజీని పరిశీలించినట్టు తెలిపారు. ఇదిలా ఉంటే చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమై వారం రోజులు గడచిన క్రమంలో దర్యాప్తు మరింత వేగవంతం చేయాలని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ పోలీస్ యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో ఆదేశించారు. మరి పవన్ చొరవతో మరింతగా పోలీసు అధికారులు ఈ కేసు లోతుల్లోకి వెళ్తున్నారు. ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుని మరీ గాలింపు ముమ్మరం చేశారు. తప్పిపోయిన చిన్నారి జ్ఞానేశ్వరి దొరకాలని కాకినాడ జిల్లా వాసులతో పాటు ఏపీ ప్రజలు అంతా కోరుకుంటున్నారు. ఏ క్షణం అయినా శుభవార్త వింటామన్న ఆశాభావంతో అంతా ఉన్నారు.