Begin typing your search above and press return to search.

అటు ఆపరేషన్ సింధూర్ సక్సెస్.. ఇటు రాజస్థాన్‌లో మిస్సైల్ కలకలం

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన దాడికి 15 రోజుల తర్వాత భారత సైన్యం మంగళవారం రాత్రి పీవోకే, పాకిస్తాన్ లో ఎయిర్ స్ట్రైక్ చేసి క్షిపణులను ప్రయోగించింది.

By:  Tupaki Desk   |   7 May 2025 5:10 PM IST
అటు ఆపరేషన్ సింధూర్ సక్సెస్.. ఇటు రాజస్థాన్‌లో మిస్సైల్ కలకలం
X

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన దాడికి 15 రోజుల తర్వాత భారత సైన్యం మంగళవారం రాత్రి పీవోకే, పాకిస్తాన్ లో ఎయిర్ స్ట్రైక్ చేసి క్షిపణులను ప్రయోగించింది. ఈ ఆపరేషన్‌కు సింధూర్ అని పేరు పెట్టారు. పాకిస్తాన్‌పై ఎయిర్ స్ట్రైక్ కోసం భారత వైమానిక దళానికి చెందిన యుద్ధ విమానాలు రాజస్థాన్‌లోని బికానెర్ జిల్లాలోని ఖాజువాలా నుంచి బయలుదేరాయి.

పాకిస్తాన్‌పై జరిగిన ఈ ఎయిర్ స్ట్రైక్‌లో భారత సైన్యం రాఫెల్ విమానాలలో బ్రహ్మోస్ క్షిపణులను ఉపయోగించారు. రాజస్థాన్ నుంచి ఒక వీడియో బయటకు వచ్చింది. అందులో ఒక పొలంలో క్షిపణి కవర్ పడి ఉండడం కనిపించింది. ఈ క్షిపణి కవర్ రాజస్థాన్‌లోని బికానెర్ జిల్లాలోని బంధనావు గ్రామానికి చెందిన రాంప్రసాద్ జోషి పొలంలో పడింది. దీనిని చూడటానికి గ్రామస్తులు గుమిగూడారు. క్షిపణి కవర్ దాదాపు 15 అడుగుల పొడవు ఉంది.

గ్రామస్తులు తాము ఒక ప్రకాశవంత మైనటువంటి కాంతిని చూశామని .. పెద్ద శబ్దం కూడా విన్నామని చెప్పారు. బంధనావుతో పాటు, మోమాసర్, ఉదరాసర్, సురన్‌జసర్ మొదలైన గ్రామాల్లో కూడా పెద్ద శబ్దం వినిపించినట్లు చెప్పారు. వైరల్ వీడియోలో పొలంలో క్షిపణి కవర్ పడి ఉండడం స్పష్టంగా కనిపిస్తోంది. గ్రామస్తులు ఆ కవర్‌ను ఆసక్తిగా చూస్తున్నారు.

ఆపరేషన్ సింధూర్‌లో పాకిస్తాన్‌లోని 9 టెర్రరిస్ట్ స్థావరాలను భారత సైన్యం ధ్వంసం చేసింది. ఈ స్థావరాలు పాకిస్తాన్, పీవోకేలో ఉన్నాయి, వీటిని భారత సైన్యం లక్ష్యంగా చేసుకుంది. రాత్రి 1:30 గంటలకు ఆపరేషన్ సింధూర్ కింద బహవల్‌పూర్, మురీద్కే, బాఘ్, కోట్లి, ముజఫరాబాద్‌లలో భారత సైన్యం దాడులు చేసింది. భారత సైన్యం దాడిలో 100 మందికి పైగా టెర్రరిస్టులు హతమయ్యారని సమాచారం అందుతోంది.

ఈ దాడి తర్వాత భారతదేశంలోని మూడు సైనిక దళాలు అప్రమత్తంగా ఉన్నాయి. ఏప్రిల్ 22న పాకిస్తాన్ నుండి వచ్చిన టెర్రరిస్టులు జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లోని బైసరన్ లోయలో దాడి చేశారు. ఈ పిరికిపందల దాడిలో 26 మంది పౌరులు మరణించారు. ఈ దాడి తర్వాత దేశం దుఃఖంలో, ఆగ్రహంతో ఉంది. ప్రతి దేశ పౌరుడు పాకిస్తాన్‌కు గట్టి గుణపాఠం చెప్పాలని కోరుకుంటున్నాడు.