కాళ్లు కడిగే కల్చర్ పరిచయం చేస్తే ఇంత ఆగమేంది బ్రో?
మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన అందాల భామల్లో కొందరిని తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించేలా షెడ్యూల్ చేసిన వైనం తెలిసిందే
By: Tupaki Desk | 15 May 2025 9:05 AM ISTమిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన అందాల భామల్లో కొందరిని తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించేలా షెడ్యూల్ చేసిన వైనం తెలిసిందే. మొత్తం 108 దేశాలకు చెందిన (మిస్ ఇండియాతో కలుపుకుంటే 109 మంది) మిస్ వరల్డ్ కంటెస్టెంట్లను నాలుగు జట్లుగా చేయటం.. రెండు జట్లు ఒక చోటకు.. మిగిలిన రెండు జట్లు మరో ప్రాంతానికి వెళ్లేలా ప్లాన్ చేయటం తెలిసిందే. ఇందులో భాగంగా బుధవారం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు పర్యాటక ప్రాంతాల్లో పర్యటించిన సంగతి తెలిసిందే.
రామప్ప దేవాలయాన్ని సందర్శించే క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో ప్రాచీన సంప్రదాయాల్లో ఒకదాన్ని పరిచయం చేశారు. సాధారణంగా తెలుగు వారి ఇళ్లల్లో కొన్ని ప్రత్యేక పూజలు నిర్వహించినప్పుడు (మహిళలు నిర్వహించే వ్రతాలు.. ప్రత్యేక పూజలు) ఇంటికి వచ్చే మహిళల కాళ్లను కడిగి. .వారి కాళ్లకు పసుపు పూయటం తెలిసిందే. ఇదే సంప్రదాయాన్ని వారికి పరిచయం చేసేందుకు రామప్ప దేవాలయ ప్రాంగణంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
రామప్ప టెంపుల్ ముందు స్టూల్స్ వేసి.. వాటిపై వివిధ దేశాల సందరీమణులు కూర్చున్న తర్వాత.. వారి కాళ్లను బంగారు వర్ణంలోని ప్లేటల్లో ఉంచి.. వారి పాదాల్ని నీళ్లతో కడిగారు పలువురు మహిళలు. ఈ సంప్రదాయానికి విదేశీ మహిళలు ఫిదా కావటమే కాదు.. ఇలాంటి కల్చర్ వారిని విస్మయానికి గురయ్యేలా చేసింది. నిజానికి ఈ సంప్రదాయం వెనుక ఉన్న ఉద్దేశం.. ఇంటికి వచ్చిన అతిధులకు ఎలాంటి అహం లేకుండా వారికి మర్యాదలు చేస్తానని చెప్పటమే నిదర్శనం. సోదర భావం.. ప్రేమాభిమానాల్ని పెంచేందుకు వీలుగా ఉండే ఈ సంప్రదాయం వారిని ఆశ్చర్యానికి గురయ్యేలా చేసింది.
అయితే.. ఇలాంటి వాటిల్లో నెగిటివ్ కోణాన్ని చొప్పించేందుకు కొన్ని శక్తులు కాచుకొని ఉంటాయి. అలాంటి గొంతులు ఇప్పుడు ఒక్కసారిగా యాక్టివ్ అయ్యాయి. మిస్ వరల్డ్ పోటీల్ని తప్పుగా చూపించే కొన్ని వర్గాలు అతిధుల కాళ్లు కడిగే కార్యక్రమాన్ని తప్పుగా.. దారుణంగా అభివర్ణించటం.. సోషల్ మీడియాలో నెగిటివ్ గా ప్రచారం చేయటం మొదలు పెట్టారు. దీనికి కొన్ని రాజకీయ శక్తులు తోడు కావటంతో.. ఇది మన పాత సంప్రదాయం అన్న విషయాన్ని మరిచిపోయి.. విదేశీ మహిళల కాళ్లను మనం కడగటం ఏమిటి? అంటూ సరికొత్త చెత్త వాదనను తెర మీదకు తీసుకొచ్చారు.
ఇదే విదేశీ మహిళలు.. తమ సంప్రదాయం.. మతాచారాల్నిపక్కన పెట్టేసి.. హిందూ దేవాలయాలను సందర్శించటమే కాదు.. వాటికి సంప్రదాయంగా చేసే పూజల్లో పాల్గొనటం.. ప్రసాదాల్ని స్వీకరించటం లాంటివి చేసినప్పుడు.. ఆ విషయాల్ని ఎందుకు హైలెట్ చేయటం లేదన్నది ఒక ప్రశ్న. అంతేకాదు.. చివరకు బతుకమ్మను కూడా విదేశీ వనితలు ఆడారు. అలా ఆడుతూ.. దాని ప్రాధాన్యతను.. చరిత్రను తెలుసుకొని అబ్బురపడ్డారు.
కేవలం నెగిటివ్ అంశాల్ని మాత్రమే ప్రచారం చేసే వారు.. ఈ పాజిటివ్ అంశాల్ని అస్సలు ప్రస్తావించకపోవటం విశేషం. మొత్తంగా చూస్తే.. ఇంటికి వచ్చిన అతిధుల్ని దేవుళ్లతో సమానంగా కొలిచే మన సంప్రదాయాన్ని.. కల్చర్ ను విదేశీ మహిళలకు పరిచయం చేయటం.. అందునా శక్తివంతమైన సెలబ్రిటీలకు అర్థమయ్యేలా చేసినప్పుడు.. మన ఘన సంస్క్రతి ప్రపంచానికి తెలిసేలా చేస్తుంది కదా? ఆ విషయాన్ని ఎందుకు మర్చిపోయినట్లు? అన్నది ప్రశ్న. అందుకే.. నెగిటివ్ మైండ్ సెట్ తో చెత్తను ప్రచారం చేసే వారికి చెక్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
