మిస్ వరల్డ్: నిమిషాల్లో చీరకట్టులో మారి.. అచ్చ తెలుగు అమ్మాయిలుగా!
అందాల పోటీలు అంటే.. అందాల ఆరబోత.. అవయువాల షోకేస్ చేయటమే తప్పించి ఇంకేమీ లేదన్న స్టీరియో టైప్ ఆలోచనలకు చెక్ చెప్పాల్సిందే.
By: Tupaki Desk | 15 May 2025 8:45 AM ISTఅందాల పోటీలు అంటే.. అందాల ఆరబోత.. అవయువాల షోకేస్ చేయటమే తప్పించి ఇంకేమీ లేదన్న స్టీరియో టైప్ ఆలోచనలకు చెక్ చెప్పాల్సిందే. అందం అంటే.. కనిపించే రూపమే కాదు.. అంతకు మించిన టాలెంట్.. మహిళల సత్తా చాటే పోటీలుగా చూడాల్సిన అవసరం ఉంది. మనకు సదూరాన జరిగే అందాల పోటీల గురించి వినటం.. ఈ పోటీలకు వ్యతిరేకించే వాదనలని ఇంతకాలం విన్నాం. కానీ.. గడిచిన కొద్దిరోజులుగా తెలంగాణలో జరుగుతున్న అందాల పోటీల (మిస్ వరల్డ్) నిర్వహణ చూస్తున్న వేళలో.. ఇప్పటివరకు ఉన్న భావనలకు చెక్ చెప్పేలా ఉందని చెప్పాలి.
108 దేశాలకు చెందిన అందాల భామలు (ఆయా దేశాల్లో అందగత్తెలుగా మిస్ కిరీటాన్ని సొంతం చేసుకున్న వారు) తుది పోటీలకు తెలంగాణకు వచ్చారు. వారు వచ్చింది మొదలు నిత్యం అంతర్గతంగా జరిగే పోటీల్లో తమ సత్తా చాటటంతో పాటు.. ఇక్కడి కల్చర్ ను.. ప్రజల జీవన విధానాన్ని.. ఇక్కడ పర్యాటకానికి సంబంధించిన విశేషాల్ని తెలుసుకునేందుకు వారు చూపిస్తున్న ఆసక్తి.. ఆ సందర్భంగా వారి నుంచి వస్తున్న సానుకూలత చూసినప్పుడు అందాల పోటీల్ని చూడాల్సిన కోణాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉందన్న భావన కలుగుతుంది.
బుధవారం ఉమ్మడి వరంగల్ లోని పలు దర్శనీయస్థలాల్ని చూసేందుకు వెళ్లిన 30 దేశాలకు పైనే అందాల భామలు.. ఆయా ప్రాంతాల్లోని విశేషాల గురించి విని విస్మయానికి గురయ్యారు. అన్నింటికి మించి రామప్ప దేవాలయంలోని కళా సంపదకు అచ్చెరువు పొందారు. రామప్ప ఆలయానికి వెళ్లే వేళలో.. వారి ప్రాశ్చాత్య వస్త్రాల్ని వదిలేసి.. సంప్రదాయ చీరకట్టులోకి మారిపోయారు. కొన్ని నిమిషాల వ్యవధిలోనే వీరంతా చీరకట్టులోకి మారిపోవటం.. నుదిటిన బొట్టు పెట్టుకొని.. జడలు వేసుకొని.. పూలు అలంకరించుకోవటంతో పాటు.. చేతులకు గాజులు వేసుకొన్న వైనం చూసినప్పుడు ప్రపంచ అందాలన్ని తెలుగు అందాలుగా మారిపోయిన వైనం కనిపిస్తుంది.
ప్రపంచ సుందరీమణులు చీరలు కట్టుకోవటానికి వీలుగా.. వారికి సాయం చేసేందుకు 11 మంది కాస్ట్యూమ్ డిజైనర్లను సిద్ధం చేసి ఉంచారు. వారంతా అతిథులకు తగ్గట్లు చీరకట్టు అలంకారాన్ని సిద్ధం చేశారు. ఇందుకోసం మొత్తం టీం 30 నిమిషాల వ్యవధిలోనే చీరలు కట్టుకొని.. పూర్తి అలంకరణతో అచ్చ తెలుగు అమ్మాయిలుగా మారిన వైనం ఆసక్తికరంగానే కాదు.. అందరిని అకట్టుకునేలా చేసిందని చెప్పక తప్పదు.
