మిస్ వరల్డ్ హోదాకు రాజీనామా చేసిన ఏకైక సుందరి ఆమే
మిస్ వరల్డ్ పోటీల నిర్వాహణ చాలా కట్టుదిట్టంగా సాగుతుంది. కఠినమైన నిబంధనలు ఉంటాయి. ఏ చిన్న పొరపాటు జరిగినా.. సదరు సంస్థకు జరిగే డ్యామేజ్ అంతా ఇంతా కాదు
By: Tupaki Desk | 31 May 2025 4:36 AMమిస్ వరల్డ్ పోటీల నిర్వాహణ చాలా కట్టుదిట్టంగా సాగుతుంది. కఠినమైన నిబంధనలు ఉంటాయి. ఏ చిన్న పొరపాటు జరిగినా.. సదరు సంస్థకు జరిగే డ్యామేజ్ అంతా ఇంతా కాదు. ఈ కారణంతోనే.. మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే వారికి పలు నియంత్రణలు ఉంటాయి. ఫైనల్ పోటీలు జరిగే మూడు వారాలు తన కుటుంబ సభ్యులు మొదలు ఎవరితోనూ ఆమె టచ్ లో ఉండకూడదు. ఆ మాటకు వస్తే.. ఒకే హోటల్లో ఉన్నప్పటికి అనుమతి లేకుండా వారిని కలిసే వీలు ఉండదు.
మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే వారికి మాత్రమే మిస్ వరల్డ్ సంస్థ ఖర్చులు భరిస్తుంది. వారి కుటుంబ సభ్యుల్లో ఏ ఒక్కరికి కూడా ఖర్చుల బాధ్యతను తీసుకోదు. ఆ మాటకు వస్తే.. మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే వారు.. వారి మేకప్ ను వారే చేసుకోవాల్సి ఉంటుంది. వారి క్యాస్టూమ్స్ ను వారే సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. అందుకే.. పోటీలకు వచ్చే వారు భారీ లగేజీలతో వస్తుంటారు. పోటీదారులు పలు సందర్భాల్లో ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఉంటారు.
ఈ పోటీల్లో పాల్గొనే వారు కచ్ఛితంగా 17 ఏళ్ల నుంచి 27 ఏళ్ల వరకు మాత్రమే అర్హులు. పెళ్లి చేసుకొని ఉండకూడదు. అవివాహితులకు మాత్రమే ఈ పోటీల్లో పాల్గొనే అర్హత ఉంటుంది. అయితే.. ఈ పోటీల్ని ప్రారంభించిన నాటి నుంచి ఒకే ఒక్క సందర్భంలోనే విజేత.. తన ఏడాది టర్మ్ పూర్తి కాక ముందే తన హోదాకు రాజీనామా చేయాల్సిన ప్రత్యేక సందర్భం ఒకటి చోటు చేసుకుంది. దీనికో ఆసక్తికర సంఘటన ఉంది.
తన టర్మ్ పూర్తి కాక ముందే రాజీనామా చేసిన తొలి మిస్ వరల్డ్ గా 1974 విజేత హెలెన్ మోర్గన్ గా చెప్పాలి. ఆమె టైటిల్ సొంతం చేసుకున్న నాలుగు రోజులకే ఆమెకు ఏడాదిన్నర బిడ్డ ఉన్న విషయం బయటకు వచ్చింది. దీంతో ఆమె తన హోదాకు రాజీనామా చేయాల్సి వచ్చింది. మిస్ వరల్డ్ సంస్థ నిబంధనల్ని ఉల్లంఘించటంతో ఆమె రాజీనామా చేయాల్సి వచ్చింది.
మిస్ వరల్డ్ విజేతల్లో మోస్ట్ బ్యూటీఫుల్.. మోస్ట్ సక్సెస్ ఫుల్ మిస్ వరల్డ్ గా ఐశ్వర్యా రాయ్ ను చెబుతారు. ఫెయిర్ నెస్ క్రీమ్ ప్రకటనలకు నో చెప్పిన తొలి మిస్ వరల్డ్ గా డయానా హెడెన్ ను చెప్పాలి. 1997లో విజేతగా నిలిచిన ఆమె.. తన ఒంటి రంగు పట్ల తనకు ఎలాంటి బాధ లేదని.. రంగు తక్కువగా ఉండటానని తాను ఆత్మన్యూనతగా భావించలేదని చెప్పారు.
తన స్కిన్ టోన్ తోనే మిస్ వరల్డ్ గా గెలిచానని.. తన దృష్టిలో ఆత్మవిశ్వాసమే అసలైన అందంగా ఆమె పేర్కొంటారు. అందుకే.. తాను నమ్మిన దాన్నే ప్రమోట్ చేస్తాను కానీ ఫెయిర్ నెస్ క్రీమ్స్ ను కాదంటూ తేల్చేసింది. ఇక.. అందాల పోటీల్లో చమత్కారం.. సునిశిత దృష్టితో అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పటంతో ప్రియాంక చోప్రాకు మంచి పేరుంది.