మసాలాల ఘాటు తగ్గిస్తూ అందాల భామలకు వంటకాలు
అయితే.. మిస్ వరల్డ్ పోటీల సందర్భంగా ఏర్పాటు చేసే విందు కార్యక్రమాల వేళ.. సిద్ధం చేసే మెనూ విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
By: Tupaki Desk | 12 May 2025 10:37 AM ISTభారతీయ వంటకాలు.. మరి ముఖ్యంగా దక్షిణాది వంటకాల్లో ఘాటైన మసాలాలు వినియోగించటం అలవాటు. అంతేకాదు.. స్పైసీగా ఉండటం.. కొన్ని వంటకాలు చాలా పుల్లగా ఉండటం తెలిసిందే. అయితే.. మిస్ వరల్డ్ పోటీల సందర్భంగా ఏర్పాటు చేసే విందు కార్యక్రమాల వేళ.. సిద్ధం చేసే మెనూ విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. విదేశీ వంటకాల్ని యధాతధంగా వండేసినప్పటికి.. మన వంటకాల విషయంలో మాత్రం పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
వీలైనంత తక్కువ మసాలాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందాల పోటీల్లో పాల్గ్గొనే సుందరీమణులు సున్నితంగా ఉండటం..వారి కంటూ ప్రత్యేకమైన ఆహార అలవాట్లను పరిగణలోకి తీసుకొని.. స్థానిక వంటకాలను పరిచయం చేస్తూనే.. వాటికి ఒరిజినాలిటీ తగ్గకుండా..అలా అని ఎక్కువ స్పైసీ.. ఎక్కువ మసాలాలతో కాకుండా పరిమిత మోతాదు మసాలాల్ని మాత్రమే వినియోగించాలన్న స్పెషల్ నోట్ ను చెఫ్ లకు ఇచ్చారు. హైదరాబాద్ మహానగరంలోని నాలుగైదు ప్రముఖ ఫైవ్ స్టార్ హోటళ్ల నుంచి పుడ్ శాంపిల్స్ ను తెప్పించి.. రెండు హోటళ్లకు వంటల్ని తయారు చేసే కాంటాక్టు ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
ఇదిలా ఉండగా.. మంగళవారం ఏర్పాటు చేసే విందు కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు సినీ.. క్రీడా రంగ ప్రముఖులు పాల్గొనే అవకాశం ఉంది. ఈ విందులో తెలంగాణకు సంబంధించిన హైదరాబాద్ ధమ్ కీ బిర్యానీ.. ఖుర్బానీ కా మీఠా.. బగారా బైంగన్.. పత్తర్ కీ ఘోష్.. పనీర్ టిక్కా.. పులావ్.. దహీ వడ.. పానీపురి.. బాదుషా.. గులాబ్ జామూన్ లాంటి వంటకాల్ని రుచి చూపిస్తారు. ధమ్ కీ బిర్యానీ లో ఉండే ఘాటు ను తగ్గించాలని.. వీలైనంత తక్కువ మసాలాలు వినియోగించాలని ఆదేశించారు. ఇంతటి ఘాటు వంటకాల్ని విదేశీయులకు ఇబ్బందిగా ఉంటుంది.
ఈ మెనూతో పాటు యూరోప్.. ఆఫ్రికా.. అమెరికా.. కరేబియన్.. ఆసియా ఓషియానా ప్రాంతాల నుంచి వచ్చిన సుందరీమణులకు వారి స్థానిక వంటకాల్ని కూడా అందుబాటులో ఉంచుతారు. పోటీల్లో పాల్గొనే సుందరీమణుల ఆరోగ్యాన్ని పరిగణలోకి తీసుకొని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఆసియా వంటకాల్లో జపాన్ కు చెందిన సుషీ.. చైనాకు చెందిన డిమ్ సమ్.. థాయ్ కు చెందిన థాయ్ గ్రీన్ కర్రీ లాంటివి అందుబాటులో ఉంటాయి.ఇవే కాకుండా యూరోపియన్ వంటకాలైన ఇటాలియన్ పాస్తా.. ఫ్రెంచ్ రాటటౌలీ.. స్పానిష్ పాయెల్లా.. అమెరికా ఖండానికి చెందిన మెక్సికన్ టాకోస్.. బ్రెజిలియన్ ఫెయిజోడా.. అమెరికన్ బార్బెక్యూ రిబ్స్ లాంటి వాటితో పాటు ఆఫ్రియాకు చెందిన ఇథియోపియన్ డోరో వాట్.. మొరాకన్ టాగిన్.. హమ్ముస్ తో పాటు మెడిటరేనియన్ ఫలాఫెల్.. క్వినోవా సలాడ్ లాంటివి కూడా వడ్డించేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు.
