Begin typing your search above and press return to search.

మిస్‌ వరల్డ్‌-2025 విజేతగా మిస్‌ థాయ్‌లాండ్

థాయ్‌లాండ్ ప్రతినిధిగా మిస్ వరల్డ్ వేదికపై అడుగుపెట్టిన సుచాతా చుయాంగ్స్రి, తన అందంతో పాటు తెలివితేటలు, ఆత్మవిశ్వాసంతో న్యాయనిర్ణేతలను, ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

By:  Tupaki Desk   |   31 May 2025 10:00 PM IST
మిస్‌ వరల్డ్‌-2025 విజేతగా మిస్‌ థాయ్‌లాండ్
X

ప్రపంచ అందాల పోటీల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన 72వ మిస్ వరల్డ్ 2025 కిరీటాన్ని థాయ్‌లాండ్‌కు చెందిన అందాలరాణి సుచాతా చుయాంగ్స్రి గెలుచుకున్నారు! హైదరాబాద్‌లోని అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ (HICC)లో అంగరంగ వైభవంగా జరిగిన ఈ గ్రాండ్ ఫినాలేలో, సుచాతా చుయాంగ్స్రి 107 దేశాల నుంచి వచ్చిన ఇతర పోటీదారులను అధిగమించి ఈ అద్భుతమైన టైటిల్‌ను సొంతం చేసుకున్నారు. "బ్యూటీ విత్ ఎ పర్సెస్" అనే మిస్ వరల్డ్ నినాదానికి ఆమె అసలైన ప్రతిరూపంగా నిలిచారు.

ఫుకెట్ నగరానికి చెందిన 22 ఏళ్ల ఓపల్ సుచాతా చుయాంగ్స్రి, తన ఆత్మవిశ్వాసం, కరుణ, మహిళల ఆరోగ్యంపై అవగాహన పట్ల ఆమెకున్న నిబద్ధతతో ప్రత్యేకంగా నిలిచారు. ప్రపంచవ్యాప్తంగా 100 మందికి పైగా పోటీదారులతో జరిగిన తీవ్రమైన పోటీ తర్వాత ఆమె కిరీటాన్ని అందుకున్నారు. థామసత్ విశ్వవిద్యాలయంలో పొలిటికల్ సైన్స్ చదువుతున్న ఓపల్.. థాయ్, ఇంగ్లీష్, చైనీస్ భాషల్లో అనర్గళంగా మాట్లాడగలదు. ఆమె ప్రజా సేవలో చురుకుగా పాల్గొంటుంది. ముఖ్యంగా ఆమె "ఓపల్ ఫర్ హెర్" అనే ప్రచారం, ఇది రొమ్ము ఆరోగ్యంపై అవగాహన కల్పించడం , మహిళల్లో రొటీన్ చెకప్‌లను ప్రోత్సహించడంపై దృష్టి సారించింది.

మిస్ వరల్డ్ 2025 విజేతగా సుచాతా చుయాంగ్స్రికి రూ.8.5 కోట్ల (సుమారు $1 మిలియన్) భారీ నగదు బహుమతిని మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్, స్పాన్సర్‌లు అందజేశారు. దీనితో పాటు దాదాపు రూ.6.21 కోట్ల విలువైన నీలం రంగు కిరీటాన్ని ఆమెకు ధరింపజేశారు. స్పాన్సర్‌ల నుంచి ప్రత్యేక బహుమతులు, తెలంగాణ ప్రభుత్వం నుంచి ప్రత్యేక సన్మానం కూడా లభించాయి. ఈ కిరీటం గెలుచుకోవడం ద్వారా సుచాతాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది. దీని ద్వారా ఆమెకు సినిమాలు, మోడలింగ్, బ్రాండ్ అంబాసిడర్‌గా మారడం వంటి అనేక అవకాశాలు లభిస్తాయి. గత విజేత, చెక్ రిపబ్లిక్‌కు చెందిన క్రిస్టినా పిస్జకోవా, సుచాతా చుయాంగ్స్రికి కిరీటధారణ చేశారు.

థాయ్‌లాండ్ ప్రతినిధిగా మిస్ వరల్డ్ వేదికపై అడుగుపెట్టిన సుచాతా చుయాంగ్స్రి, తన అందంతో పాటు తెలివితేటలు, ఆత్మవిశ్వాసంతో న్యాయనిర్ణేతలను, ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. వివిధ రౌండ్లలో అద్భుతమైన ప్రదర్శన కనబరిచి, ఆసియా-ఓషియానియా ఖండం నుంచి టాప్ ఫైనలిస్ట్‌గా నిలిచారు. చివరి రౌండ్‌లోనూ తన సమయస్ఫూర్తితో కూడిన సమాధానాలతో మెప్పించి, అత్యున్నత కిరీటాన్ని కైవసం చేసుకున్నారు.

రన్నరప్ విజేతలు వీరే

మిస్ వరల్డ్ 2025 పోటీలలో రన్నరప్‌లుగా నిలిచిన సుందరీమణులు వీరే:

మొదటి రన్నరప్: ఆఫ్రికా ప్రాంతం నుంచి ఇథియోపియాకు చెందిన హాసెట్ డెరెజె అడ్మాస్సు నిలిచారు.

రెండవ రన్నరప్: యూరప్ ఖండం నుంచి పోలాండ్‌కు చెందిన మాయా క్లజడా టైటిల్‌ను కైవసం చేసుకున్నారు.

మూడవ రన్నరప్: మార్టినిక్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆరేలీ జోచిమ్ తన ఖండం నుంచి అగ్రశ్రేణి ఫైనలిస్ట్‌గా నిలిచారు.

భారత్ ఆశలు గల్లంతు

ఈ పోటీల్లో భారత ప్రతినిధి నందినీ గుప్తా (కోటా, రాజస్థాన్) టాప్ 20 వరకు చేరుకోగలిగారు. అయితే, ఆమె తుది నాలుగు స్థానాలకు (ఫైనల్ ఫోర్) చేరుకోలేకపోయారు. దీంతో భారతీయ అభిమానులకు నిరాశ ఎదురైంది. నందిని తన ప్రయాణంలో అద్భుతమైన ప్రదర్శన కనబరిచినప్పటికీ, బలమైన అంతర్జాతీయ పోటీలో చివరి అడుగు వేయలేకపోయారు.

ప్రముఖుల సందడి

గ్రాండ్ ఫినాలే కార్యక్రమానికి సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు, మెగాస్టార్ చిరంజీవి దంపతులు వేడుకకు విచ్చేసి సందడి చేశారు. బాలీవుడ్ తారలు జాక్వెలిన్ ఫెర్నాండెజ్, ఇషాన్ ఖత్తర్ తమ అద్భుతమైన నృత్య ప్రదర్శనలతో వేదికపై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ కార్యక్రమానికి మాజీ మిస్ వరల్డ్ స్టెఫానీ డెల్ వల్లే, భారతీయ యాంకర్ సచిన్ కుంభార్ కో హోస్ట్‌లుగా వ్యవహరించారు.