హైదరాబాద్ లో మిస్ వరల్డ్ పోటీలు.. పాకిస్థాన్ అమ్మాయికి నో ఎంట్రీ?
మిస్ వరల్డ్ అంటే మామూలు మాటలు కాదు.. ఈ పోటీల్లో గెలుపొందిన అందమైన యువతుల జీవితమే మారిపోతుంది.
By: Tupaki Desk | 24 April 2025 2:03 PM ISTమిస్ వరల్డ్ అంటే మామూలు మాటలు కాదు.. ఈ పోటీల్లో గెలుపొందిన అందమైన యువతుల జీవితమే మారిపోతుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులతో పాటు సినీ రంగంలో అవకాశాలు వెల్లువెత్తుతాయి. ఇక వారు ఎక్కడికి వెళ్లినా రాజభోగమే.. కొన్నాళ్ల పాటు అంటే కనీసం ఓ ఏడాది పాటు మిస్ వరల్డ్ అంటే ప్రపంచానికే యువరాణి.
అలాంటి మిస్ వరల్డ్ పోటీలకు ఈసారి మన హైదరాబాద్ నగరం ఆతిథ్యం ఇవ్వనుంది. మిస్ట వరల్డ్ పోటీల్లో ఇది 72వది. 1951లో మొదలైన మిస్ వరల్డ్ పోటీలు 2020 వరకు నిరాటంకంగా సాగాయి. ఆ ఏడాది కొవిడ్ కారణంగా వాయిదా పడిన పోటీలను 2021లో నిర్వహించారు. 2021లో ఆలస్యంగా నిర్వహించడంతో 2022లో పోటీలు లేవు. 2023లో నిర్వహించినా 2024లో ఏర్పాటు చేయలేదు.
మొత్తానికి ఈసారి పోటీలకు హైదరాబాద్ వేదిక అవుతోంది. దీనికోసం తెలంగాణ ప్రభుత్వం పెద్దఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. కాగా, 1996లో బెంగళూరు, 2023లో ముంబై తర్వాత మిస్ వరల్డ్ పోటీలకు వేదిక కానున్న మూడో భారత నగరం హైదరాబాద్.
ఇక భారత సుందరీ మణులు 1966, 1994, 1997, 1999, 2000, 2017లలో మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకున్నారు.
ఈసారి హైదరాబాద్ లో మిస్ వరల్డ్ పోటీలు మే 7 నుంచి 31వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ అంతర్జాతీయ 140 దేశాలకు చెందిన అందాల భామలు పాల్గొంటారని నిర్వాహకులు చెబుతున్నారు.
పహెల్గాంలో పర్యటకులపై ఉగ్రవాదుల దాడుల అనంతరం దేశంలో పరిస్థితులు చాలా వేగంగా మారిన సంగతి తెలిసిందే. అంతేకాదు.. ఉగ్రవాదానికి ఊతం ఇస్తున్న పాకిస్థాన్ పట్ల భారత్ తీవ్ర ఆగ్రహంతో ఉంది. సింధూ నది జలాల ఒప్పందం సహా అనేక చర్యలు తీసుకుంది. పాకిస్థానీలను దేశం విడిచి వెళ్లిపోవాలని కోరింది.
తాజా చర్యల నేపథ్యంలో పాకిస్థాన్ యువతి హైదరాబాద్ లో జరిగే మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొంటుందా? అనే సందేహం నెలకొంది. తాజా పరిణామాల రీత్యా అయితే, పాకిస్థాన్ యువతికి భారత్ లో ఎంట్రీ లేనట్లే. అందులోనూ హైదరాబాద్ వంటి నగరంలో జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీలకు పాకిస్థాన్ యువతిని అనుమతిస్తే అనవసర ఉద్రికత్తలు నెలకొంటాయి.
కళలు, క్రీడలు అన్నింటికీ అతీతం అనుకంటే పాక్ యువతికి భారత్ లోకి ఎంట్రీ దక్కుతుంది. మిస్ వరల్డ్ నిబంధనలు ఎలా ఉన్నాయో కూడా చూడాలి.
బహుశా ఇప్పటికే పాక్ యువతికి భారత వీసా జారీ అయి ఉంటుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
