మిస్ వరల్డ్ ఫైనల్ లో నందిని గెలిస్తే భారత్ కు కొత్త రికార్డు!
హైదరాబాద్ మహానగరం వేదికగా చేసుకొని మూడు వారాలకు పైనే సాగుతున్న మిస్ వరల్డ్ 2025 పోటీలు చివరి అంకానికి చేరుకున్నాయి. ఈ రోజు (శనివారం) సాయంత్రం 5.30 గంటలకు మొదలై రాత్రి 9.30గంటలకు ముగుస్తాయి.
By: Tupaki Desk | 31 May 2025 10:21 AM ISTహైదరాబాద్ మహానగరం వేదికగా చేసుకొని మూడు వారాలకు పైనే సాగుతున్న మిస్ వరల్డ్ 2025 పోటీలు చివరి అంకానికి చేరుకున్నాయి. ఈ రోజు (శనివారం) సాయంత్రం 5.30 గంటలకు మొదలై రాత్రి 9.30గంటలకు ముగుస్తాయి. తుది పోటీలకు మిస్ వరల్డ్ 2016 విజేత స్టిఫానీ డెల్ వ్యాలీ.. సచిన్ కుంభర్ లు వ్యాఖ్యాతలుగా వ్యవహరిస్తారు. బాలీవుడ్ నటీనటులు జాక్వెలిన్ ఫెర్నాండెజ్.. ఇషాన్ ఖట్టర్ తమ నృత్యాలతో అలరించనున్నారు. ఇదిలా ఉండగా.. ఈ పోటీలకు సంబంధించి ఒక ఆసక్తికర వాదన వినిపిస్తోంది. అదేమంటే..
ఈ ఫైనల్ పోటీల్లో మిస్ ఇండియాగా బరిలోకి దిగిన నందిని గుప్తా కానీ టైటిల్ విన్నర్ అయితే..భారత్ ఒక అరుదైన రికార్డును సొంతం చేసుకుంటుందని చెబుతున్నారు. నందిని గుప్తా టైటిల్ విన్నర్ గా ప్రకటిస్తే.. ప్రపంచ సుందరి టైటిళ్లను ఎక్కువసార్లు గెలుసుకున్న దేశంగా భారత్ నిలుస్తుంది. అదో రికార్డుగా మారతనుంది. 1951 నుంచి ప్రపంచ సుందరి పోటీల్ని ప్రతి ఏటా నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు భారత్.. వెనెజువెలా ఆరుసార్లు చొప్పున కిరీటాన్ని సొంతం చేసుకున్నాయి.
మన దేశం నుంచి తొలిసారి 1966లో రీటా ఫారియా ప్రపంచ సుందరి కిరీటాన్ని సొంతం చేసుకోగా.. 1994లో ఐశ్వర్యారాయ్.. 1997లో డయానా హెడెన్.. 1999లో యుక్తాముఖి.. 2000లో ప్రియాంక చోప్రా.. 2017లో మానుషి చిల్లర్ లు విజేతలుగా నిలిచారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ప్రపంచ సుందరి పోటీలు ప్రారంభమైన 15 ఏళ్లకు తొలిసారి భారత్ టైటిల్ సొంతం చేసుకుంటే.. ఆ తర్వాత 28 ఏళ్ల తర్వాత ఐశ్వర్యరాయ్ టైటిల్ ను సొంతం చేసుకుంది. ఆమె విజేతగా నిలిచిన తర్వాత గడిచిన 34 ఏళ్లలో 4 సార్లు భారత్ కు ఈ టైటిల్ దక్కింది. 1994 నుంచి 2000 మధ్యన ఆరేళ్ల వ్యవధిలో నాలుగుసార్లు ప్రపంచ సుందరి టైటిల్ ను భారత్ సొంతం చేసుకుంది. ఇంత స్వల్ప వ్యవధిలో మరే దేశానికి ఇన్ని టైటిళ్లు లభించలేదని చెబుతారు.
2000 తర్వాత మళ్లీ 17 ఏళ్లకు అంటే 2017లో మానుషి చిల్లర్ విజేతగా నిలిచారు. ఇప్పటికి మిస్ వరల్డ్ టైటిల్ భారత్ కు వచ్చి ఎనిమిదేళ్లు అవుతుంది. మరి.. ఈసారి అయినా టైటిల్ భారత్ సొంతం అవుతుందా? లేదా? అన్నది మరికొద్ది గంటల్లో తేలనుంది. ఈ ఫైనల్ పోటీలకు మొత్తం నలుగురు న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తారు. వీరిలో నటుడు సోనూ సూద్.. మేఘా ఇంజనీరింగ్ డైరెక్టర్ సుధారెడ్డి.. మిస్ ఇంగ్లండ్ 2014 విజేత కెరీనా టురెల్.. మిస్ వరల్డ్ సంస్థ చైర్ పర్సన్ జూలియా మోర్లీలు ఉంటారు. విజేత పేరును జూలియా మోర్లీ ప్రకటిస్తారు. దీంతో.. ఈ కార్యక్రమం ముగుస్తుంది.
