మిస్ వరల్డ్ విజేతకు ప్రైజ్ మనీ ఎంత?
కొన్ని రోజులుగా హైదరాబాద్ వేదికగా సాగుతున్న మిస్ వరల్ట్ పోటీలకు సంబంధించిన గ్రాండ్ ఫైనల్ నేడు (శనివారం) జరగనుంది.
By: Tupaki Desk | 31 May 2025 10:06 AM ISTకొన్ని రోజులుగా హైదరాబాద్ వేదికగా సాగుతున్న మిస్ వరల్ట్ పోటీలకు సంబంధించిన గ్రాండ్ ఫైనల్ నేడు (శనివారం) జరగనుంది. 'హైదరాబాద్ జరూర్ ఆనా' అన్న నినాదంతో పాటు.. ‘బ్యూటీ విత్ పర్పస్’ పేరుతో జరుగుతున్న ఈ పోటీల ఆఖరి అంకమైన ఫైనల్ రౌండ్ కు హైటెక్స్ వేదిక కానుంది. ఈ రోజు సాయంత్రం 5.30 గంటలకు ఫైనల్ కు సంబంధించిన తుది ఘట్టం మొదలవుతుంది.
ప్రపంచ సుందరిగా విజేగా నిలిచిన సుందరాంగికి టైటిల్ తో పాటు.. మన రూపాయిల్లో చెప్పాలంటే రూ.8.5 కోట్ల భారీ నగదుతో పాటు 1770 వజ్రాలతో కూడిన శ్వేతపసిడి కిరీటం దక్కనుంది. అంతేకాదు.. విజేతకు మిస్ వరల్డ్ బ్రాండ్ అంబాసిడర్ హోదాలో ఏడాది పాటు ప్రపంచమంతా ఉచితంగా పర్యటించే వీలు ఉంటుంది.
అంతేకాదు.. అంతర్జాతీయ స్థాయిలో వాణిజ్య ప్రకటనలు.. సినిమాల్లో ఛాన్సులతో పాటు.. పలు నజరానాలు సొంతమవుతాయి. మొత్తం 108 దేశాలకు చెందిన మిస్ లు పోటీ పడగా.. గ్రాండ్ ఫినాలేకు 40 మంది నిలిచారు. అందులో నాలుగు విభాగాల్లో నిర్వహించిన పలు పోటీలకు సంబంధించిన ఒక్కో విభాగం నుంచి నలుగురు చొప్పున 16 మంది విజేతల పేర్లు ఇప్పటికే ప్రకటించారు.
తుది పోటీల్లో ఒక్కో విభాగం నుంచి పది మంది చొప్పున మొత్తం 40మంది ఫైనల్ కు చేరారు. ఇప్పటికే ప్రకటించిన 16 మంది కాకుండా మిగిలిన 24 మంది వివరాల్ని శనివారం పోటీలు ప్రారంభం కావటానికి ముందు ప్రకటిస్తారు. ఫ్యాషన్ షో.. ఇతర పోటీల్లో ప్రదర్శించిన ప్రతిభ ఆధారంగా మొత్తం 40 మందిలో 20 మందిని (నాలుగు విభాగాల్లో ఒక్కో విభాగం నుంచి ఐదుగురు చొప్పున) తుది రౌండ్ కు ఎంపిక చేస్తారు. వీరిలో నుంచి నాలుగు విభాగాల నుంచి ఇద్దరు చొప్పున కుదించి.. మళ్లీ టాప్ 8 కంటెస్టెంట్లను ఫైనల్ రౌండ్ కు ఎంపిక చేస్తారు.
ఈ సందర్భంగా జ్యూరీ సభ్యులు అడిగే ప్రశ్నలకు పోటీదారులు ఇచ్చే సమాధానాల ఆధారంగా నాలుగు విభాగాల నుంచి ఒక్కొక్కరిని ఎంపిక చేస్తారు. అంటే.. మిస్ వరల్డ్ కిరీటాన్ని అందుకునేది ఈ నలుగురిలో ఒక్కరన్నమాట. వీరిలో ఒకరిని మిస్ వరల్డ్ గా.. మిగిలిన ముగ్గురిని రన్నరప్ లుగా ప్రకటిస్తారు. గత ఏడాది మిస్ వరల్డ్ విజేతగా చెక్ రిపబ్లిక్ సుందరి క్రిస్టినా తాజా ప్రపంచ సుందరికి కిరీటాన్ని పెట్టటంతో ఈ కార్యక్రమం ముగుస్తుంది.
ఈ మిస్ వరల్డ్ పోటీలను ఈ నెల 10న గచ్చిబౌలిలో ప్రారంభించారు. ఈ వేడుకల్ని 120 దేశాల్లో ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఈ రోజు జరిగే గ్రాండ్ ఫినాలే పోటీలు 150 దేశాలకు పైగా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఈ పోటీల్ని ఓటీటీ ప్లాట్ ఫాంలో చూడాలనుకుంటే సోనిలివ్ ద్వారా చూడొచ్చు. ఫైనల్ పోటీల్ని చూసేందుకు హైటెక్స్ లో నాలుగు వేల మందికి సరిపడేలా ఏర్పాట్లు చేశారు. ఈ పోటీలకు ముఖ్యమంత్రి.. మంత్రుల కుటుంబ సభ్యులతో పాటు ఎంపీలు.. ఎమ్మెల్యేలు.. ఇతర ప్రజాప్రతినిధులు.. పారిశ్రామికవేత్తలు.. సినీ ప్రముఖులకు ప్రత్యేక ఆహ్వానాలు అందాయి.
