Begin typing your search above and press return to search.

షెడ్యూల్ ప్రకారమే మిస్ వరల్డ్.. ఈ రోజు ఏం జరుగుతుందంటే?

అయితే.. వీటికి చెక్ పెడుతూ శనివారం గచ్చిబౌలి స్టేడియంలో మిస్ వరల్డ్ కాంపిటీషన్ ప్రారంభోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా సాగుతోంది.

By:  Tupaki Desk   |   12 May 2025 10:36 AM IST
Miss World Festivities Light Up Hyderabad Amid Indo-Pak Tensions
X

భారత - పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులతో చాలానే కార్యక్రమాలు ఒక పక్కకు వెళ్లిపోయాయి. కొన్నింటిని క్యాన్సిల్ చేస్తే మరికొన్నింటిని తాత్కాలికంగా వాయిదా వేశారు. వీటన్నింటికి భిన్నంగా హైదరాబాద్ మహానగరంలో మాత్రం మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్నాయి. దాయాది దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త వాతావరణం ఏ దశలో అయినా యుద్ధంగా మారుతుందన్న సందేహాలు వ్యక్తమవుతున్న వేళ.. ఈ పోటీలు జరుగుతాయా? లేదా? అన్న దానిపై సందేహాలు నెలకొన్నాయి. అయితే.. వీటికి చెక్ పెడుతూ శనివారం గచ్చిబౌలి స్టేడియంలో మిస్ వరల్డ్ కాంపిటీషన్ ప్రారంభోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా సాగుతోంది.

అనంతరం ఉన్న షెడ్యూల్ లో మార్పుల దిశగా చర్చలు సాగాయి. అయితే.. తాజాగా నెలకొన్న పరిస్థితులకు అనుగుణంగా ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారమే పోటీలు సాగనున్నాయి. పోటీలో పాల్గొనేందుకు వచ్చిన వివిధ దేశాల సుందరీమణుల భద్రతపై నెలకొన్న సందేహాలతో బహిరంగ ప్రదేశాల్లో తిరిగే కార్యక్రమాల్ని నిలిపేయాలని భావించినా.. అలాంటి అవసరం లేదని భావిస్తున్నట్లు చెబుతున్నారు. అందుకే.. ఈ టోర్నీలో భాగంగా ముందుగా డిసైడ్ చేసిన షెడ్యూల్ ప్రకారమే సోమవారం కార్యక్రమం ఉంటుందని చెబుతున్నారు.

ఈ రోజు (సోమవారం) సాయంత్రం పోటీదారులు.. విదేశీ ప్రతినిధులు.. నాగార్జున సాగర్ సమీపంలోని బుద్ధవనం పర్యటనకు వెళ్లనున్నారు. బుద్ధ జయంతి సందర్భంగా అక్కడ జరిగే కార్యక్రమాన్ని వారు ప్రత్యక్షంగా చూస్తారు. అక్కడే విందు కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం అనంతరం వారంతా తిరిగి హైదరాబాద్ కు తిరిగి వస్తారు.

మంగళవారం షెడ్యూల్ చూస్తే.. ఈ రోజు సాయంత్రం మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే పోటీదారులంతా చార్మినార్ నుంచి లాడ్ బజార్ వరకు నడుస్తూ పరిసరాల్ని వీక్షిస్తారు. షాపింగ్ చేస్తారు. చార్మినార్ చరిత్రను తెలుసుకుంటారు. ఆ తర్వాత చౌమొహల్లా ప్యాలెస్ లో జరిగే స్వాగత విందులో పాల్గొంటారు. ఈ సందర్భంగా ప్రత్యేక సంప్రదాయ వాద్య కచేరీ జరుగుతుంది.