కక్ష సాధింపు వైఖరి..మిస్ వరల్డ్ నిర్వాహకులపై మిస్ ఇంగ్లాండ్ తీవ్ర ఆరోపణలు
అందాల పోటీలు కేవలం నవ్వులు, మెరుపులు, కిరీటాలకే పరిమితం కావు. కొన్నిసార్లు వాటి వెనుక తీవ్రమైన ఆరోపణలు, వివాదాలు కూడా దాగి ఉంటాయని నిరూపితమైంది.
By: Tupaki Desk | 3 Jun 2025 12:20 PM ISTఅందాల పోటీలు కేవలం నవ్వులు, మెరుపులు, కిరీటాలకే పరిమితం కావు. కొన్నిసార్లు వాటి వెనుక తీవ్రమైన ఆరోపణలు, వివాదాలు కూడా దాగి ఉంటాయని నిరూపితమైంది. తాజాగా ముగిసిన మిస్ వరల్డ్ (Miss World) పోటీలు ముగిసినప్పటికీ.. మిస్ ఇంగ్లాండ్ (Miss England) మిలా మాగీ (Milla Magee) లేవనెత్తిన వివాదం రగులుతూనే ఉంది. తనను మరో చూస్తున్నారని ఆరోపిస్తూ పోటీ నుంచి మధ్యలోనే వెళ్లిపోయిన మాగీ ఇప్పుడు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసి చర్చకు తెరలేపింది.
మిస్ ఇంగ్లాండ్ మిలా మాగీ, తాను పోటీ నుంచి మధ్యలోనే వెళ్లిపోయినందుకు మిస్ వరల్డ్ నిర్వాహకులు (Miss World Organisers) తన మీద కక్ష సాధింపు ధోరణిని అవలంబిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేసింది. కిరీటం గెలిచే అవకాశం లేకనే మాగీ తిరిగి వెళ్లిపోయిందని, ఆమె కుటుంబ సభ్యులకు ఆరోగ్యం బాగోలేదని అందుకే తిరిగి వెళ్ళిందని మిస్ వరల్డ్ నిర్వాహకులు చెప్పిన విషయం తెలిసిందే. అయితే, మాగీ మాత్రం గతంలో చేసిన ఆరోపణల మీదే నిలబడినట్లు తెలుస్తోంది.
మిలా మాగీ చేసిన ఆరోపణలు కేవలం నిర్వాహకుల వైఖరిపైనే కాకుండా, వ్యక్తిగత వేధింపులపైనా ఉన్నాయి. ఒక అపరిచిత వ్యక్తి తన వద్దకు వచ్చి, తాను లండన్‌లో ఉన్నప్పుడు తనను వ్యక్తిగతంగా కలవమని ఒత్తిడి చేశాడని మాగీ వెల్లడించింది. ఇది పోటీల వాతావరణంలో భద్రత లేదన్న ఆమె వాదనకు బలం చేకూర్చుతోంది.
'ది గార్డియన్' (The Guardian, UK) పత్రికతో మాట్లాడుతూ.. మిలా మాగీ, నిర్వాహకులు చేసిన వ్యాఖ్యలు పరువు నష్టం కలిగించేవిగా, బాధ కలిగించేవిగా ఉన్నాయని పేర్కొంది. పోటీదారుల చిరునవ్వుల వెనుక చాలా కన్నీళ్లు ఉన్నాయని ఆమె తెలిపింది. నవ్వినా సరే, తాము సంతోషంగా లేమంటూ ఆమె స్పష్టం చేసినట్లు ఆ పత్రిక పేర్కొంది.
తాను అబద్ధాన్ని ప్రోత్సహించడానికి సిద్ధంగా లేనని మాగీ తేల్చి చెప్పినట్లు పత్రిక రాసుకొచ్చింది. మిస్ వరల్డ్ పోటీ "బ్యూటీ విత్ పర్పస్" కాదని ఆమె విమర్శించింది. పోటీలోని చాలా అంశాలు కాలం చెల్లినవిగా (outdated) ఉన్నాయని ఆరోపించింది. ఈ ఈవెంట్ నిర్వాహకులు తన ఆరోపణలను నిరాధారమైనవి అని కొట్టిపారేస్తున్నారు.
మిస్ ఇంగ్లాండ్ మిలా మాగీ చేసిన ఆరోపణలు తెలంగాణలో జరిగిన మిస్ వరల్డ్ పోటీల నిర్వహణపై తీవ్ర ప్రభావం చూపాయి. తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ ఈ ఆరోపణలపై అంతర్గత విచారణ జరిపారు. సీసీటీవీ ఫుటేజీలు, ఇతర పోటీదారులతో సంభాషణల ఆధారంగా మాగీ ఆరోపణలు నిరాధారమైనవని ఆయన ఖండించారు.
