మిస్ వరల్డ్: మిగిలిన అందాల భామలకు మిస్ కెనడాకు ఒక తేడా
ఇంత మంది అందాలభామలు ఉన్నప్పటికి.. కొందరి బ్యాక్ గ్రౌండ్ మాత్రం మిగిలిన వారికి పూర్తి భిన్నమైనది.
By: Tupaki Desk | 10 May 2025 10:07 AM ISTహైదరాబాద్ వేదికగా మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్న సంగతి తెలిసిందే. దాదాపు మూడు వారాల పాటు సాగే ఈ అంతర్జాతీయ పోటీలకు సంబంధించిన ప్రారంభ వేడుకలు ఈ రోజు నుంచి స్టార్ట్ కానున్నాయి. ఇప్పటికే ఈ పోటీల్లో పాల్గొనేందుకు దాదాపు వందకు పైగా దేశాల నుంచి అందాల భామలు హైదరాబాద్ కు వచ్చేశారు. మొత్తం 120 దేశాలకు చెందిన సుందరీమణులు ఈ పోటీలో పాల్గొననున్నారు.
ఇంత మంది అందాలభామలు ఉన్నప్పటికి.. కొందరి బ్యాక్ గ్రౌండ్ మాత్రం మిగిలిన వారికి పూర్తి భిన్నమైనది. ఆ కోవలోకే వస్తారు మిస్ కెనడాగా నిలిచిన ఎమ్మా మోరిసన్. ఆమె గురించిన వివరాలు తెలిస్తే.. ఆమె మీద గౌరవం పెరిగిపోవటం ఖాయం. ఎందుకంటే.. కెనడాలో మిస్ కెనడా టైటిల్ సొంతం చేసుకున్న తొలి ఆదివాసీ తెగ మహిళ కావటమే దీనికి కారణం. ఎందరో శ్వేతవర్ణ భామలు పోటీ పడినప్పటికీ.. ఈ ఆదివాసీ బిడ్డ మిస్ కెనడాగా విజయం సాధించటమే. మరో ఆసక్తికరమైన అంశం ఏమంటే.. మిస్ కెనడా పుట్టింది కేవలం 1900 మంది జనాభా ఉన్న గ్రామంలో. అందాల పోటీలోనూ ఒక అర్థం.. పరమార్థం ఉందన్న ఆలోచనతోనే ఈ కాంపిటీషన్ లో పాల్గొన్నట్లుగా ఆమె చెబుతారు.
కెనడా నుంచి హైదరాబాద్ రావటానికి తనకు 27 గంటల సమయం పట్టిందని.. కానీ.. ఇక్కడికి వచ్చిన తర్వాత సొంతూర్లో ఉన్నట్లుగా ఉందన్నారు. తన తండ్రితో కలిసి ఈ పోటీలో పాల్గొనటానికి వచ్చిన ఆమె.. ఇక్కడి వారి అతిధ్యం సొంతింటి అనుభూతిని కలుగజేసినట్లుగా పేర్కొన్నారు. తమది ఒక చిన్న గ్రామమని.. చిన్నప్పుడు స్కూల్ కు వెళ్లటం.. చుట్టుపక్కల ఉండే కొండలు.. గుట్టలు ఎక్కటం.. ఆటలు ఆడుకోవటం.. చేపలు పట్టటం.. సాయంత్రానికి మురికిగా తయారు కావటమే అన్నట్లుగా ఉండేదానిని అని చెప్పుకొచ్చారు.
2017లో ఒకరు తనను అందాల పోటీలో పాల్గొంటావా? అని అడగారని.. అప్పటివరకు తనకు బ్యూటీ కాంటెస్ట్ అంటే ఒకలాంటి అభిప్రాయం ఉండేదన్నారు. అందుకే నో చెప్పానని.. ఆ తర్వాత దాని గురించి తెలిసిన తర్వాత మనం ఎంచుకునే ప్రాజెక్టులకు నిధుల సేకరణ లాంటివి కూడా ఉంటాయని తెలిసిందన్నారు. దీంతో.. అందాల పోటీలపై ఆసక్తి కలిగిందని.. అలా మిస్ మిస్ ఒంటారియో.. మిస్ టీనేజ్ కెనడా.. మిస్ కెనడా వరల్డ్ పోటీల్లో గెలిచినట్లుగా చెప్పారు. మరి.. మీ ప్రాజెక్టు ఏమిటి? అన్న ప్రశ్నకు ఆసక్తికర సమాధానాన్ని ఇచ్చింది మిస్ కెనడా.
తమ సంప్రదాయంలో ‘రీ కనెక్టింగ్ విత్ రిబ్బన్ స్కర్ట్స్’ ఉంటుందని.. అది తమ జాతి కల్చర్ కు ఒక చిహ్నమని పేర్కొంది. అందులోని అల్లికలు తమ మధ్య ఐకమత్యానికి ప్రతీకగా పేర్కొన్నారు. స్కర్ట్ దారాల అల్లిక వెనుక అనేక కథలు.. మహిళల్ని సంఘటితం చేసే ప్రత్యేకతలు దీని సొంతమన్నారు. ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటివరకు తాను 10 వేల డాలర్ల నిధులు సేకరించినట్లు పేర్కొన్నారు.
మిస్ కెనడా వరల్డ్ పోటీల్లో పాల్గొన్నప్పుడు మిగిలిన కంటెస్ట్ లు.. వెకిలిగా మాట్లాడారన్నఆమె.. ‘ఆదిమ తెగ నుంచి వచ్చిందట. చారిటీ చెక్కులపై సంతకం కాలి బొటనవేలితో పెడుతుందా?’ ఇలా ఎన్నో మాటలతో వెక్కిరించారు. చాలా బాధ అనిపించేది. ఈ పోటీలకోసం కుటుంబం నుంచి దూరంగా ఉండటం ఇబ్బంది. అయినా.. ఒక పెద్ద లక్ష్యం వైపు వెళుతున్నప్పుడు ఇలాంటి ఇబ్బందులు మామూలేనని పేర్కొన్నారు. ఎలాంటి నేపథ్యం లేకుండానే మిస్ కెనడా వరల్డ్ టైటిల్ సొంతం చేసుకున్నానని.. ఓర్పు.. నేర్పు.. కష్టపడే తత్త్వం ఉండే కలలు నెరవేరుతాయని పేర్కొన్నారు.
కెనడాలోనూ భారత సంస్క్రతి ఉందని.. తమ ఊళ్లో హోలీ సంబరాల్లో పాల్గొన్నట్లు చెప్పారు. భారతీయులు ఎవరినైనా చూడగానే నవ్వుతూ పలుకరిస్తారన్న ఆమె.. హైదరాబాద్ చికెన్ బిర్యానీ తనకు బాగా నచ్చిందన్నారు. కెనడాలో ఇంతటి ఘాటైన ఫుడ్ ఉండదన్న ఆమె.. భోజనం తర్వాత ఇస్తున్న స్వీట్లు చాలా చాలా బాగున్నట్లు పేర్కొన్నారు. మొత్తంగా మన ఫుడ్ కు మిస్ కెనడా పిదా అయ్యారని చెప్పక తప్పదు.
