వైల్డ్‌లైఫ్‌లో బిగ్ అప్డేట్.. సిక్కింలో మిష్మి టాకిన్!
ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ఈ మిష్మి టాకిన్‌ను ‘అంతరించిపోయే ప్రమాదం ఉన్న జీవి’గా రెడ్ లిస్ట్‌లో చేర్చింది.
By: Madhu Reddy | 17 Jun 2026 6:00 PM ISTహిమాలయాల మంచు పర్వతాల్లో దాగుండే అత్యంత అరుదైన, అంతుచిక్కని వన్యప్రాణి ‘మిష్మి టాకిన్’ తాజాగా సిక్కింలోని బాకుచుంగ్ ప్రాంతంలో అటవీ శాఖ సిబ్బంది కంటికి కనిపించింది. ఒకేసారి వీటి మంద కనిపించడంతో వైల్డ్‌లైఫ్ ప్రేమికులు పండగ చేసుకుంటున్నారు. మేక, ఎద్దు కలిస్తే ఎలా ఉంటుందో అలా విచిత్రమైన రూపంతో ఉండే ఈ జీవులు కనిపించడం చాలా అరుదు. వన్యప్రాణుల సంరక్షణలో ఇదొక బిగ్ అప్‌డేట్ అని కేంద్ర మంత్రి కొనియాడారు. ఆ వివరాలు చూద్దాం..
మేక తల.. ఆవు శరీరం.. ఇదో వింత జీవి:
మిష్మి టాకిన్ తూర్పు హిమాలయాల్లో నివసించే అతిపెద్ద జంతువులలో ఒకటి. దీని బరువు దాదాపు 300 కిలోల వరకు ఉంటుంది. ఇక 15వ శతాబ్దానికి చెందిన ఒక బౌద్ధ సన్యాసి ఆవు శరీరాన్ని, మేక తలను కలిపి ఈ వింత జంతువును సృష్టించాడని భూటాన్ జానపద కథలు చెబుతుంటాయి. మంచు కొండల్లోని చల్లటి గాలి ఊపిరితిత్తుల్లోకి వెళ్లే ముందే వేడెక్కేలా దీని ముక్కు, సైనస్ నిర్మాణం ప్రకృతి సిద్ధంగా ఏర్పాటయ్యింది.
మనుషులతో విడదీయరాని బంధం:
అరుణాచల్ ప్రదేశ్‌లోని ‘ఇడు మిష్మి’ అనే గిరిజన తెగ ప్రజలతో ఈ టాకిన్‌లకు ప్రత్యేక అనుబంధం ఉంది. ఇక వీరు ఈ అడవి జీవులను తమతో పాటు ప్రకృతిని పంచుకునే తోటి ప్రాణులుగా భావిస్తారు. ఈ జంతువులను ఎప్పుడు వేటాడాలి, ఎప్పుడు వదిలేయాలి అనే విషయాలపై వారి సాంప్రదాయంలో కఠినమైన నియమాలు ఉన్నాయి. అయితే మారుతున్న కాలంతో పాటు ఈ బంధాలు కూడా ఇప్పుడు మారుతున్నాయి.
అంతరించిపోయే ప్రమాదంలో అరుదైన జాతి:
ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ఈ మిష్మి టాకిన్‌ను ‘అంతరించిపోయే ప్రమాదం ఉన్న జీవి’గా రెడ్ లిస్ట్‌లో చేర్చింది. దట్టమైన అడవుల నరికివేత, రోడ్ల నిర్మాణం, పర్యాటకం పెరిగిపోవడం వల్ల వీటి ఆవాసాలు దెబ్బతింటున్నాయి. ఇక వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా పరిశోధనల ప్రకారం, 2070 నాటికి వాతావరణ మార్పుల వల్ల వీటి నివాస స్థలాలు చాల వరకు తగ్గిపోయే ప్రమాదం ఉంది.
తొలిసారిగా మెగా సర్వే షురూ:
ఈ అరుదైన జీవుల జనాభాను, అవి ఎక్కడెక్కడ తిరుగుతున్నాయో తెలుసుకోవడానికి వైల్డ్‌లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా అరుణాచల్, సిక్కిం పరిసర ప్రాంతాల్లో ఒక భారీ సర్వేను ప్రారంభించింది. వీటి రహస్య ప్రవర్తన కారణంగా వీటిపై ఇప్పటివరకు పెద్దగా పరిశోధనలు జరగలేదు. ఇక ఇప్పుడు జరుగుతున్న సర్వే ద్వారా ఈ జీవులను ఎలా కాపాడుకోవాలో ఒక స్పష్టమైన ప్లాన్ దొరుకుతుందని శాస్త్రవేత్తలు ఆశిస్తున్నారు.
సిక్కిం కొండల్లో మిష్మి టాకిన్ గుంపు కనిపించడం అనేది కేవలం ఒక అరుదైన దృశ్యం మాత్రమే కాదు, పర్యావరణ సమతుల్యతకు ఇదొక శుభసూచకం. ఇక ప్రకృతి అందాలతో పాటు ఇలాంటి అపురూపమైన జీవులను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఇక అటవీ సంరక్షణ చర్యలు మరింత పటిష్టంగా సాగితేనే ఈ హిమాలయ వింత జీవులు భవిష్యత్ తరాలకూ సజీవంగా కనిపిస్తాయి.
