Begin typing your search above and press return to search.

తెలంగాణలో సర్కారును డిసైడ్ చేయనున్న మైనార్టీలు!

మజ్లిస్ కు కంచుకోటగా చెప్పే ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నాంపల్లి.. బహుదూర్ పుర స్థానాల్లో సంచలనాలకు అవకాశం ఉందని.. మజ్లిస్ కు మొదటిసారి ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది.

By:  Tupaki Desk   |   26 Nov 2023 5:31 AM GMT
తెలంగాణలో సర్కారును డిసైడ్ చేయనున్న మైనార్టీలు!
X

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన రెండు అసెంబ్లీ ఎన్నికల లెక్క ఒకటైతే.. ఈసారి జరుగుతున్న ఎన్నికలు మరో లెక్క అని చెప్పాలి. ఎందుకంటే.. ఈసారి ఎన్నికల సందర్భంగా పలు విచిత్రమైన కాంబినేషన్లు.. అంశాలు చర్చకు వస్తున్నాయి. గతంలో జరిగిన రెండు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చర్చకు రాని అంశాలే ఇప్పుడు రావటం.. లెక్కల్లో కీలకభూమిక పోషించటమే దీనికి కారణం.

తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో హైదరాబాద్ పాతబస్తీ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 50 శాతానికి పైగా ఉన్న ముస్లింల ఓటు కచ్ఛితంగా మజ్లిస్ కు తప్పించి మరొకరికి పడుతుందన్న అంచనా కానీ.. అభిప్రాయం కానీ కనిపించదు. అలాంటిది ఈసారి ఎన్నికల్లో మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తుండటం విశేషం. మజ్లిస్ కు కంచుకోటగా చెప్పే ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నాంపల్లి.. బహుదూర్ పుర స్థానాల్లో సంచలనాలకు అవకాశం ఉందని.. మజ్లిస్ కు మొదటిసారి ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది.

ఒకవేళ ఈ వాదనే నిజమైతే.. ఇంతకాలం మజ్లిస్ మాటను జవదాటని మైనార్టీలు మొదటిసారి అందుకు భిన్నంగా ఆలోచిస్తున్నట్లే అవుతుంది. అసలు ఇలా ఆలోచిస్తున్నారన్న దానికి ప్రాతిపదిక ఏంటి? అన్న ప్రశ్నకు సమాధానం వెతికితే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలుగా చెప్పాలి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటులో మైనార్టీలు కీలక భూమిక పోషించాన్నది మర్చిపోకూడదు. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వాలకు చెక్ పెట్టేందుకు మైనార్టీ ఓటర్లంతా ఒకే మాట మీద నిలిచి.. కాషాయ పార్టీకి కరెంట్ షాక్ కొట్టేలా చేయాలన్న పట్టుదలతో ఓట్ చేసినట్లుగా చెబుతారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీకి కట్ట కట్టుకొని ఓట్లు వేశారని.. ఈకారణంగానే కర్ణాటకలో కాంగ్రెస్ విజయం ఖరారైందని చెబుతారు.

కర్ణాటక లెక్క సరే. తెలంగాణలో ఆ లెక్కకు ప్రాతిపదిక ఏమిటి? అన్న ప్రశ్నను సంధిస్తే వచ్చే ఆన్సర్.. బీఆర్ఎస్ కు బీ టీం బీజేపీనే అన్న వాదన. ఏది ఏమైనా తెలంగాణలో తాము గెలవకున్నా ఫర్లేదు.. కాంగ్రెస్ గెలిచేందుకు సుతారం ఇష్టపడని బీజేపీ.. అందుకు తగ్గట్లు అధికార బీఆర్ఎస్ కు మేలు జరిగినా ఫర్లేదనుకుంటుందన్న లెక్కలే దీనికి కారణం. దీనికి తోడు బీఆర్ఎస్ కు బీజేపీకి మధ్యన రహస్య ఒప్పందం ఉందని.. కాంగ్రెస్ సర్కారు ఏర్పాటు కాకుండా తెర వెనుక బలంగా ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం బలంగా పెరగటం కూడా మైనార్టీ ఓటర్లను ప్రభావితం చేసే అంశంగా చెబుతున్నారు.

బీఆర్ఎస్ కు ఓపెన్ గా మద్దతు ఇచ్చే మజ్లిస్ మాట వింటే.. గులాబీపార్టీకే ఓటు వేయాలి. అదే జరిగితే.. పరోక్షంగా బీజేపీ అనుకున్న దానికి తాము వత్తాసు పలికినట్లు అవుతుందన్న అభిప్రాయమే మైనార్టీ ఓటు కాంగ్రెస్ కు మళ్లుతుందన్న వాదనకు బలాన్ని చేకూరుస్తుంది. ఇందులో ఒక రాజీ ఫార్ములాకు అవకాశం ఉందంటున్నారు. పాతబస్తీలో తిరుగులేని అధిక్యతను ప్రదర్శించే మజ్లిస్ వరకు ఓట్లు వేసి.. మిగిలిన స్థానాల్లో మాత్రం కాంగ్రెస్ వైపు ఓటు వేయాలన్న ప్రచారం అంతర్లీనంగా సాగుతుందన్న మాట వినిపిస్తోంది.

ఈ వాదనను ఇప్పటివరకు ఏ మీడియా సంస్థా ప్రస్తావించకపోవటం కనిపిస్తుంది. తెలంగాణలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో హైదరాబాద్ పాతబస్తీలోని ఏడు స్థానాల్ని కలుపుకొని రాష్ట్రం మొత్తంలో 48 స్థానాల్లో మైనార్టీ ఓట్లే గెలుపును డిసైడ్ చేస్తాయి. వారిలో ఓటేసే వారిలో అత్యధికంగా ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారో.. వారే విజేతగా నిలుస్తారని చెప్పక తప్పదు. గతానికి భిన్నంగా ప్రస్తుత పరిస్థితులు ఉన్న నేపథ్యంలో.. మైనార్టీలు తెలంగాణ తీర్పును డిసైడ్ చేయటమే కాదు.. ప్రభుత్వ పగ్గాలు ఎవరి చేతిలో ఉండాలో నిర్ణయిస్తారని చెబుతున్నారు. మరి.. ఈ వాదనలో నిజం ఎంతన్నది తేలాలంటే మరో వారం వెయిట్ చేయక తప్పదు.