Begin typing your search above and press return to search.

ప్రియుడి కోసం తల్లిని చంపేసింది.. హైదరాబాద్ లో దారుణం

తనకు నచ్చిన యువకుడితో ప్రేమాయణాన్ని ఒప్పుకోని తల్లిని దారుణంగా చంపేసిన దుర్మార్గం తాజాగా హైదరాబాద్ మహానగరంలో వెలుగు చూసింది.

By:  Garuda Media   |   26 March 2026 12:42 PM IST
ప్రియుడి కోసం తల్లిని చంపేసింది.. హైదరాబాద్ లో దారుణం
X

తనకు నచ్చిన యువకుడితో ప్రేమాయణాన్ని ఒప్పుకోని తల్లిని దారుణంగా చంపేసిన దుర్మార్గం తాజాగా హైదరాబాద్ మహానగరంలో వెలుగు చూసింది. ఈ దారుణానికి పాల్పడిన కుమార్తె మైనర్ బాలిక కావటం గమనార్హం. తల్లిని చంపిన ఆమె దుర్మార్గం తాజాగా వెలుగు చూసింది. తల్లిని చంపేసి.. తాము ఉన్న ఇంట్లోనే ప్రియుడితోకలిసి పూడ్చేసింది. తల్లిని చంపిన ఏడాదికి ఆమె వాడే టూవీలర్ ను అమ్మిన క్రమంలో వారు చేసిన పాపం పండింది. మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లాలోని జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణ ఉదంతం చోటు చేసుకుంది. సంచలనంగా మారిన ఈ హత్యోదంతంలోకి వెళితే..

జార్ఖండ్ కు చెందిన ఈశ్వర్, అంజు దంపతులు ఉపాధి కోసం హైదరాబాద్ కు వచ్చి జవహర్ నగర్ లోని భరత్ నగర్ లో నివాసం ఉంటున్నారు. వీరికి 21 ఏళ్ల రోషిణి, ఇంటర్ చదివే బాలిక ఉన్నారు. ఐదేళ్ల క్రితం ఈశ్వర్ ఇంట్లో నుంచి వెళ్లిపోగా.. తల్లి ఒక్కతే కుటుంబాన్ని పోషిస్తోంది. స్థానికంగా ఉండే ఇళ్లల్లో పని చేస్తూ కుమార్తెలను సాకుతోంది. ఇదిలా ఉండగా రెండో కుమార్తెకు జీడిమెట్లలో వేరే కులానికి చెందిన డ్రైవర్ మోంటీ కుమార్ సింగ్ (22)తో పరిచయమైంది.

2023 డిసెంబరు నుంచి వీరి మధ్య ప్రేమాయాణం సాగుతోంది. అయితే..మోంటీతో చిన్న కుమార్తె చనువుగా ఉండటంతో అలా చేయొద్దని వారించింది. రెండుసార్లు మోంటీపై కేసులు పెట్టి జైలుకు పంపింది. అయినా వీరిద్దరూ మారలేదు. తమ ప్రేమకు తల్లి అడ్డుగా మారిందన్న ఆగ్రహంతో వీరిద్దరు ప్లాన్ చేసి గత ఏడాది మే 12న కత్తితో పదే పదే పొడిచి చంపేశారు. అప్పటికి బాలిక వయసు 17 ఏళ్లు మాత్రమే. శవాన్ని మంచం కింద దాచి ఉంచారు. ఆమె ఫోన్ ను పనికి రాకుండా చేశారు.

ఒక ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్న ఆమె సోదరి సాయంత్రం ఇంటికి వచ్చి తల్లి గురించి వాకబు చేయగా.. టూవీలర్ మీద బయటకు వెళ్లిందని.. ఫోన్ స్విచాఫ్ వస్తోందని చెప్పింది. అదే రోజు శవాన్ని దాచిన గదిలోనే ప్రేమికులు ఇద్దరు, సోదరి కలిసి ఉన్నారు. వీరు ప్రేమికులు అన్న విషయం తెలిసినా సోదరి రోషిణి ప్రశ్నించలేదు. తర్వాతి రోజు ఆమె జాబ్ కోసం వెళ్లిపోయిన తర్వాత అదే ఇంట్లో తల్లి అంజు శవాన్ని పాతిపెట్టేశారు. ఆమె వాడే టూవీలర్ ను దాచి ఉంచారు. సాయంత్రం జాబ్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఇంట్లో సిమెంట్ ఎందుకు వేశారని అడిగితే.. ఎలుకలు పదే పదేడ రంధ్రాలు చేస్తున్నాయని.. అందుకే సిమెంట్ తో కప్పేసినట్లుగా చెప్పారు.

కొంతకాలం గడిచిన తర్వాత తల్లికి చిట్టీ డబ్బులు రూ.83 వేలు రావాల్సి ఉందని బాలికకు తెలిసి, ఆ డబ్బులు తీసుకుందామని అక్కకు చెప్పి.. చిట్టీ నిర్వాహకుడి వద్దకు వెళ్లగా.. తల్లి గురించి ఆరా తీశారు.ఎక్కడికో వెళ్లిపోయిందని చెప్పటంతో.. ఎఫ్ఐఆర్ కాపీ చూపిస్తే డబ్బులు ఇస్తానని చెప్పటంతో తమ తల్లి టూవీలర్ మీద ఎక్కడికో వెళ్లిపోయిందని 2025 అక్టోబరు 12న జవహర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంటే.. తల్లిని చంపిన ఆర్నెల్లకు కంప్లైంట్ ఇచ్చారు. ఈ ఏడాది జనవరిలో సదరు బాలిక.. తాను ప్రేమిస్తున్న మోంటీని యాదాద్రిలో పెళ్లి చేసుకున్నారు.

వీరికి ఈ మధ్యన డబ్బులు అవసరమయ్యాయి. దీంతో ఆ ఆర్థిక ఇబ్బందిని అధిగమించేందుకు ఇంట్లో దాచి ఉంచిన టూవీలర్ ను ఒక వ్యక్తికి రూ.35 వేలకు అమ్మారు. రిజిస్ట్రేషన్ చేసే సమయంలో వాహనం అంజు పేరు మీద ఉండటం.. దానిపై ఎఫ్ఐఆర్ నమోదైన నేపథ్యంలో ఈ వాహనాన్ని కొనుగోలు చేసిన వ్యక్తి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో ఇన్ స్పెక్టర్ సైదులు వీరిని పిలిపించి విచారించగా.. వారిచ్చే సమాధానాలు పొంతన లేకుండా ఉండటంతో వీరిపై అనుమానం వచ్చింది. దీంతో గట్టిగా ప్రశ్నించగా.. అసలు విషయం బయటకు వచ్చింది. తల్లిని హత్య చేసిన విషయాన్ని అంగీకరించటంతో బాలికను అమీర్ పేటలోని స్టేట్ హోం కు తరలించారు. మోంటీని రిమాండ్ కు తరలించారు.