అమెరికాలో కాల్పులు.. చట్టసభ సభ్యులే టార్గెట్
అగ్రరాజ్యం అమెరికాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అమెరికా చట్టసభ సభ్యులే టార్గెట్ గా చేసుకొని కాల్పులు జరిగాయి.
By: Tupaki Desk | 15 Jun 2025 11:11 AM ISTఅగ్రరాజ్యం అమెరికాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అమెరికా చట్టసభ సభ్యులే టార్గెట్ గా చేసుకొని కాల్పులు జరిగాయి. పోలీసు వేషంలో వచ్చిన ఆగంతకుడు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు మిన్నెసోటా రాష్ట్ర చట్టసభల సభ్యులపై కాల్పులకు తెగబడ్డాడు. డెమొక్రటిక్ పార్టీకి చెందిన రాష్ట్ర ప్రతినిదుల సభ సభ్యురాలు.. మాజీ స్పీకర్ మెలిసా హర్ట్ మెన్.. ఆమె భర్త మార్క్ కాల్పులకు బలి కాగా.. రాష్ట్ర సెనేట్ సభ్యుడు, డెమొక్రటిక్ ఫార్మర్ లేబర్ పార్టీ నేత జాన్ హాఫ్ మన్ దంపతులు తీవ్రంగా గాయపడ్డారు.
ఈ దారుణ ఉదంతాలు మిన్నెసోటా రాష్ట్రంలోని బ్రూక్లిన్ పార్కు, ఛాంప్లిన్ పట్టణాల్లోని వారి నివాసాల వద్ద చోటు చేసుకోవటం గమనార్హం. వీటిని రాజకీయ హత్యలుగా పరిగణిస్తున్నారు. అమెరికా కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున ఛాంప్లిన్ పట్టణంలోని సెనేటర్ జాన్ ఇంటికి వెళ్లిన ఆగంతకుడ్ని ఎవరూ అడ్డుకోలేదు. దీనికి కారణం.. సదరు ఆగంతకుడు పోలీసు వాహనం.. పోలీసు అధికారి యూనిఫాంలో ఉండటమే.
దీంతో.. అతడ్ని చూసిన వెంటనే జాన్ తలుపు తీశారు. వెంటనే ఇంట్లోకి చొరబడ్డ దుండగుడు జాన్ దంపతులపై పలుమార్లు కాల్పులు జరిపి పారిపోవటం సంచలనంగా మారింది. రక్తమోడుతున్న వారిని పోలీసులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. పలు సర్జరీలు చేసిన తర్వాత కోలుకున్నప్పటికి వారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు.
ఇదిలా ఉండగా.. అదే రోజు తెల్లవారుజామున 3.55 గంటల ప్రాంతంలో సదరు దుండగుడు బ్రూక్లిన్ పార్క్ పట్టణంలోని హార్ట్ మన్ ఇంటికి వెళ్లారు. అక్కడ కూడా అతడ్ని పోలీసు అధికారిగా భావించిన హార్ట్ మన్ అతన్ని ఇంటి లోపలకు రానిచ్చాడు. ఇంటి లోపలకు వెళ్లినంతనే విచక్షణరహితంగా హర్ట్ మన్ ఆయన సతీమణిపై కాల్పులు జరిపారు. దాంతో వారిద్దరు అక్కడికక్కడే మరణించారు.
ఈ ఘటన జరిగిన కాసేపటికి సాధారణ తనిఖీల్లో భాగంగా వచ్చిన పోలీసులు కాల్పులకు గురై మరణించిన హార్ట్ మన్ ను గుర్తించారు. కాల్పులు జరిపిన అనంతరం దుండగుడు ఇంటి వెనుక నుంచి పారిపోయినట్లుగా తేల్చారు. ఇంటి ముందు నిలిపి ఉంచిన పోలీసు వాహనంలో పలువురుచట్టసభ సభ్యులతో కూడిన పేర్లు ఉన్న జాబితా లభించింది. అందులో అబార్షన్ చేసే వైద్యులతో పాటు.. వాటిని సమర్థించే న్యాయవాదులు.. పలు రాష్ట్రాల చట్టసభ సభ్యులు ఉండటం గమనార్హం. మొత్తం 70 మంది పేర్లతో కూడిన జాబితా లభించింది. అదే కారులో బుల్లెట్లు ఉన్న బ్యాగ్ లభించింది.
దుండగుడి కారులో ‘నో కింగ్స్’ కరపత్రాలు లభించాయి. ఇవన్నీ రాజకీయ ప్రేరేపిత హత్యలేనంటూ మిన్నెసోటా గవర్నర్ వ్యాఖ్యానించారు. ఈ ఘటనల్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా ఖండించారు. ‘‘ఇవి భయంకరమైన కాల్పులు. ఈ ఘటనపై ఎఫ్ బీఐ దర్యాప్తు చేస్తుంది’అని వ్యాఖ్యానించారు. డెమోక్రటిక్ నేత మెలిస్సా హర్ట్ మన్ గతంలో స్పీకర్ గా పని చేశారు. తొలిసారి ఆమె 2004లో చట్టసభలో అడుగు పెట్టారు. హర్ట్ మన్ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ఈ ఘాతుకానికి పాల్పడిన దుండగుడ్ని ప్రిటోరియన్ గార్డు సెక్యూరిటీ పెట్రోల్స్ విభాగ డైరెక్టర్ 57 ఏళ్ల వాన్స్ బోల్టర్ గా అనుమానిస్తున్నారు. అతడ్ని అదుపులోకి తీసుకునేందుకు పోలీసు బలగాలు రంగంలోకి దిగాయి. అక్రమ వలసదారుల అరెస్టులను నిరసిస్తూ మొదలైన ఉద్యమంలో భాగంగా అమెరికాలోని పలు రాష్ట్రాల్లో నో కింగ్ పేరుతో ర్యాలీలు జరుగుతున్నాయి. తాజా షాకింగ్ ఉదంతాలతో మిన్నెసోటాలో ర్యాలీల్ని విరమిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
