Begin typing your search above and press return to search.

కేసీఆర్ రుణం తీర్చుకోవాల‌ని.. పాద‌ర‌క్ష‌లు లేకుండా మంత్రి ప‌ర్య‌ట‌న‌.. ఎక్క‌డ? ఎవ‌రు?

ఇదిలావుంటే.. కేసీఆర్ చ‌ల‌వ‌తో మంత్రి ప‌ద‌వులు ద‌క్కించుకున్న కొంద‌రు.. ఆయ‌న‌ను మ‌రోసారి ముఖ్య‌మంత్రిగా చూడాల‌ని క‌ల‌లు కంటున్నారు.

By:  Tupaki Desk   |   27 Nov 2023 8:07 AM GMT
కేసీఆర్ రుణం తీర్చుకోవాల‌ని..  పాద‌ర‌క్ష‌లు లేకుండా మంత్రి ప‌ర్య‌ట‌న‌.. ఎక్క‌డ?  ఎవ‌రు?
X

ప్ర‌స్తుత ఎన్నిక‌ల్లో బీఆర్ ఎస్ గెలుపు కోసం.. ఆ పార్టీ నాయ‌కులు అలుపెరుగ‌ని శ్ర‌మ చేస్తున్నారు. ముఖ్యంగా సీఎం కేసీఆర్‌.. హ్యాట్రిక్ కొట్టేందుకు అనేక ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. సెంటిమెంటు నుంచి.. అనేక అస్త్రాలు ప్ర‌యోగిస్తున్నారు. ఇదిలావుంటే.. కేసీఆర్ చ‌ల‌వ‌తో మంత్రి ప‌ద‌వులు ద‌క్కించుకున్న కొంద‌రు.. ఆయ‌న‌ను మ‌రోసారి ముఖ్య‌మంత్రిగా చూడాల‌ని క‌ల‌లు కంటున్నారు. మ‌ళ్లీ ఆయ‌న ముఖ్య‌మంత్రి అయితే.. త‌మ‌కు మ‌రోసారి ప‌ద‌వీ యోగం ఉంటుంద‌ని లెక్క‌లు వేసుకుంటున్నారు.


ఇలాంటి వారిలో గిరిజ‌న నాయ‌కురాలు.. స‌త్య‌వ‌తి రాథోడ్ ప్ర‌ముఖంగా క‌నిపిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి బీఆర్ ఎస్‌లోకి వెళ్లిన ఫైర్‌బ్రాండ్ సత్య‌వ‌తి రాథోడ్‌.. ఎమ్మెల్సీ అయ్యి క్యాబినెట్‌ మంత్రి పదవిని ద‌క్కించుకున్నారు. కేసీఆర్ ద‌గ్గ‌ర మంచి మార్కులు కూడా వేయించుకున్నారు. అయితే.. ఈ ద‌ఫా కేసీఆర్‌ను మూడోసారి ముఖ్య‌మంత్రిగా చూడాల‌నే త‌లంపుతో ఆమె.. ‘సంకల్ప దీక్ష’ చేపట్టారు. అందులో భాగంగా.. గత పద్నాలుగు నెలలుగా కాళ్లకు చెప్పులు వేసుకోకుండా ప్రభుత్వ, ప్రైవేటు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

గత‌ వేసవిలోనూ 46 డిగ్రీల మేర ఎండలు మండి పోతున్నప్పటికి.. దీక్షకు భంగం వాటిల్లకుండా తన పర్యటనలు కొనసాగించారు. ప్రస్తుత ఎన్నికల ప్రచారంలోనూ ఆమె చెప్పులు లేకుండానే పాల్గొంటూ తన దీక్షను అప్రతిహతంగా కొనసాగిస్తున్నారు. మహబూబాబాద్‌ జిల్లా కురవి మండలం గుండ్రాతిమడుగు పెద్దతండాకు చెందిన సత్యవతిరాథోడ్‌.. 1989లో టీడీపీలో చేరారు. 2009లో డోర్నకల్‌ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో అప్పటి టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ సమక్షంలో బీఆర్ ఎస్ తీర్తం పుచ్చుకున్నారు. 2014లో జరిగిన ఎన్నికల్లో డోర్నకల్‌ నుంచి పోటీచేసి ఓడిపోయారు. టీఆర్‌ఎస్‌ రెండోసారి అధికారంలోకి వచ్చాక.. కేసీఆర్‌ ఆమె విధేయతకు పట్టం కట్టి ఎమ్మెల్సీగా అవకాశమిచ్చారు. ఆ తర్వాత గిరిజన శాఖ మంత్రిగా అవ‌కాశం క‌ల్పించారు. ఈ నేప‌థ్యంలో కేసీఆర్ రుణం తీర్చుకునేందుకు ఆమె చెప్పులు లేకుండానే యాత్ర‌లు చేస్తుండ‌డం గ‌మ‌నార్హం.