Begin typing your search above and press return to search.

ఈసారేంది.. అడ్డంగా దొరికిపోతున్న ఆ మంత్రి టీం?

పక్కా ప్లాన్ ప్రకారం సాగే నోట్ల పంపిణీని కాంగ్రెస్ వర్గీయులు అడుగడుగునా అడ్డుకోవటంతో సదరు మంత్రి ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లుగా చెబుతున్నారు.

By:  Tupaki Desk   |   29 Nov 2023 8:15 AM GMT
ఈసారేంది.. అడ్డంగా దొరికిపోతున్న ఆ మంత్రి టీం?
X

అన్ని అనుకున్నట్లే జరిగితే మనుషులు కాస్తా దేవుళ్లు అయిపోతారు. వందల కోట్లు సంపాదించినట్లుగా చెప్పుకునే ఆ మంత్రికి.. తాజాగా జరుగుతున్న ఎన్నికల్లో తీవ్రమైన ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. ఇప్పటివరకు పలు ఎన్నికల్లో పోటీ చేసినప్పటికి ఎదురుకాని ఇబ్బందులు.. తాజా ఎన్నికల్లో ఎదుర్కొంటున్న పరిస్థితి. పెద్దఎత్తున వ్యాపారాలతో పాటు.. ధనిక మంత్రిగా పేరున్న ఆయన.. తన మాటలతో అందరిని అలరిస్తుంటారు. అలాంటి ఆ మంత్రికి పోల్ మేనేజ్ మెంట్ లో ఎప్పుడూ ఎదురుకాని ఎదురుదెబ్బలు ఈసారి ఎదురైన పరిస్థితి.

తన మాటలతో.. చేష్టలతో యూత్ ను సైతం ఇట్టే అలరించే నేర్పు ఉన్న సదరు మంత్రి.. గతానికి భిన్నంగా ఈ ఏసారి గెలుపు విషయంలో ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. తన దగ్గర పని చేసే వందలాది మంది ఉద్యోగులకు స్లిప్పులు.. డబ్బులు ఇచ్చి మరీ తన నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రాంతాలకు పంపటం.. వారిలో పలువురిని కాంగ్రెస్ వర్గీయులు అడ్డుకొన్న వీడియోలు వాట్సాప్ ల్లో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.

పక్కా ప్లాన్ ప్రకారం సాగే నోట్ల పంపిణీని కాంగ్రెస్ వర్గీయులు అడుగడుగునా అడ్డుకోవటంతో సదరు మంత్రి ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లుగా చెబుతున్నారు. ఓట్లకు నోట్ల పంపిణీకి సంబంధించి.. భారీ ఎత్తున ప్లానింగ్ చేసే సదరు మంత్రి.. ఇందుకోసం ఒక వ్యవస్థనే తయారు చేశారని చెబుతున్నారు. ఇన్నాళ్లు డబ్బు పంచే కార్యక్రమాన్ని మూడో కంటికి తెలీకుండా నిర్వహించే ఆ మంత్రి స్టైల్ మిగిలిన వారికి భిన్నమన్న మాట వినిపిస్తూ ఉంటుంది. అందుకే.. ఈసారి సదరు మంత్రి నోట్ల పంపిణీకి సంబంధించి ప్రత్యేకంగా ఫోకస్ చేసిన విపక్ష పార్టీ దెబ్బకు ఆయన విలవిలలాడుతున్నట్లుగా తెలుస్తోంది.

ఓటర్లను ప్రసన్నం చేసుకోవటానికి అవసరమైన పనుల కోసం రెండు నెలల క్రితం కొందరిని ప్రత్యేకంగా రిక్రూట్ చేసుకోవటం.. మరికొందరిని తమ వ్యాపారాలు.. విద్యా సంస్థల్లో చురుకుగా ఉండే వారిని ఎంపిక చేసుకోవటం లాంటివి చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే ఇద్దరు.. ముగ్గురు డబ్బులతో సహా పట్టుబడిన వైనంతో ఆయనకు భారీ డ్యామేజ్ జరిగినట్లుగా చెబుతున్నారు. గతంలో గుట్టుచప్పుడు కాకుండా జరిగి పోయిన కార్యక్రమాలు.. ఈసారి అందుకు భిన్నంగా ఎదురుదెబ్బలు తగలటానికి కారణం ఏమిటన్న దానిపై మంత్రి టీం తాజాగా ప్రత్యేక ఫోకస్ పెట్టినట్లుగా చెబుతున్నారు. గతానికి భిన్నంగా ఈసారి కొందరిని నమ్ముకోవటంతో అంతర్గత పేచీలు ఒక కారణమైతే.. ప్రత్యర్థులు ఆయన డబ్బు పంపిణీని ఎదుర్కోవటం ద్వారా ఆత్మరక్షణలో పడేయాలన్న ఎత్తుగడను ప్రదర్శించినట్లుగా చెబుతున్నారు. ఎప్పుడూ లేని రీతిలో ఎదురీత ఎదుర్కొంటున్న ఆ మంత్రి భవిష్యత్తు ఏ రీతిలో ఉంటుందన్నది హాట్ టాపిక్ గా మారింది.