Begin typing your search above and press return to search.

బాబు లోకేష్ మంత్రులు ....వేట వేరే లెవెల్ !

ఏపీలోనే కాదు దేశంలోనూ ఈ రకమైన పరిస్థితి ఉంటుందని ఎవరూ అనుకోరు. ఎందుకంటే ఇంతటి కసి కృషి ఒక ప్రభుత్వం పెడుతుందని కూడా ఊహించలేరు.

By:  Satya P   |   3 Nov 2025 1:36 PM IST
బాబు లోకేష్ మంత్రులు ....వేట వేరే లెవెల్ !
X

ఏపీలోనే కాదు దేశంలోనూ ఈ రకమైన పరిస్థితి ఉంటుందని ఎవరూ అనుకోరు. ఎందుకంటే ఇంతటి కసి కృషి ఒక ప్రభుత్వం పెడుతుందని కూడా ఊహించలేరు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తోంది అంటే ఏపీ ప్రభుత్వం పెట్టుబడుల వేట గురించి. ఈ మధ్యనే లోకేష్ ఆస్ట్రేలియా టూర్ లో పెట్టుబడుల కోసం నిర్వహించిన సదస్సులో మాట్లాడుతూ ఏపీ మంచి ఆకలి మీద ఉంది అని అన్నారు. ఏపీలో పెట్టుబడులను తేవడం కోసం వేట చేస్తోంది కూటమి ప్రభుత్వం. ఆ దేశం ఈ దేశం అని లేదు, మంత్రులు అంతా అదే పనిలో ఉన్నారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు ఐటీ మంత్రి నారా లోకేష్ అయితే వేరేగా చెప్పాల్సింది కూడా లేదు.

నారాయణ అటూ దుర్గేష్ ఇటు :

పెట్టుబడులని ఏపీకి తెచ్చే విషయంలో మంత్రులు కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆ మధ్యన నారాయణ ఒక విదేశీ పర్యటన చేశారు. ఇపుడు ఆయన అరబ్ దేశాలలో పర్యటిస్తున్నారు. ఏపీకి పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా ఈ సీనియర్ మంత్రి పర్యటన సాగుతోంది. ఈ నెల 14,15 తేదీల్లో విశాఖలో జరిగే భాగస్వామ్య సదస్సుకు పారిశ్రామికవేత్తలను స్వయంగా నారాయణ ఆహ్వానించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రముఖ రియాలిటీ సంస్థ శోభా గ్రూప్ డైరెక్టర్ జ్యోత్స్న హెగ్డే,హెల్త్ కేర్ సంస్థ ఆస్టర్ గ్రూప్ ప్రతినిధులతో మంత్రి నారాయణ భేటీ కానున్నారు. అలాగే కే ఈ ఎఫ్ హోల్డింగ్స్ చైర్మన్ ఫైజల్ ,బుర్జిల్ హోల్డింగ్స్ ప్రతినిధులతో సమావేశాలు ఉన్నాయి. ఇక దుబాయ్ ఇండియన్ కాన్సులేట్ జెనరల్ సతీష్ శివన్ తో సైతం మంత్రి నారాయణ ఆయన వెంట ఉన్న బృందం సమావేశం కానుంది అని చెబుతున్నారు. ఏపీలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలు, ప్రభుత్వ పాలసీలను ఈ పర్యటనలో మంత్రి వివరిస్తారని అంటున్నారు.

టూరిజంలోనూ :

అదే విధంగా మరో మంత్రి పర్యాటక శాఖ చూస్తున్న కందుల దుర్గేష్ కూడా లండన్ పర్యటన చేపట్టారు. ఆయన టూరిజం విభాగంలో పెట్టుబడులు పెద్ద ఎత్తున ఆకర్షించేందుకు ఈ పర్యటనను ఎంచుకున్నారు. నాలుగు రోజుల పాటు దుర్గేష్ పర్యటన సాగనుంది. ఏపీలో పర్యాటక రంగాలలో భారీ పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా ఏపీని టూరిజం డెస్టినీ గా మార్చేందుకు మంత్రి కృషి చేస్తున్నారు. విశాఖలో జరిగే పెట్టుబడుల సదస్సులో టూరిజానికి సంబంధించిన కీలక ఒప్పందాలు కుదుర్చుకోవాలని పర్యాటక శాఖ చూస్తోంది. అలాగే భారీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ కూడా పెట్టుబడుల వేటలో ఉన్నారు. ఆయన సైతం పర్యటనలు చేస్తున్నారు.

చంద్రబాబు బిజీ :

ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే పెట్టుబడులను ఆకర్షించే విషయంలో ఇప్పటికే అరబ్ ఎమిరేట్స్ కి వెళ్ళి వచ్చారు. ప్రస్తుతం లండన్ టూర్ సాగుతోంది. ఈ పర్యటనలో భాగంగా సీఎం కీలక పారిశ్రామికవేత్తలను కలుస్తారు అని అంటున్నారు. అంతే కాకుండా విశాఖ సదస్సుకు వారిని స్వయంగా ఆహ్వానిస్తారు అని చెబుతున్నారు. ఇక ఐటీ మంత్రి నారా లోకేష్ మరో విడత విదేశీ పర్యటన ఈ నెల రెండవ వారంలో ఉండొచ్చు అని అంటున్నారు. ఆయన కూడా పెట్టుబడుల వేటలో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈసారి విశాఖలో జరిగే సదస్సు దావోస్ కి ఏ మాత్రం తీసిపోని విధంగా ఉండాలని పెద్ద ఎత్తుల ఏపీకి పెట్టుబడులు తీసుకుని రావాలని చూస్తునారు. మొత్తం మీద చూస్తే విశాఖ సమ్మిట్ మీదనే అందరి దృష్టి ఉంది.