Begin typing your search above and press return to search.

అంబటికి పెద్దరెడ్డి మార్కు పంచ్.. మామూలుగా లేదుగా?

టార్గెట్ చేసి అన్నారని చెప్పలం. సీనియర్ నేతగా.. మిగిలిన మంత్రులతో పోలిస్తే.. ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాస్తంత స్వేచ్ఛగా వ్యవహరిస్తారు.

By:  Tupaki Desk   |   8 Oct 2023 5:08 AM GMT
అంబటికి పెద్దరెడ్డి మార్కు పంచ్.. మామూలుగా లేదుగా?
X

టార్గెట్ చేసి అన్నారని చెప్పలం. సీనియర్ నేతగా.. మిగిలిన మంత్రులతో పోలిస్తే.. ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాస్తంత స్వేచ్ఛగా వ్యవహరిస్తారు. ప్రత్యర్థుల విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరించే ఆయన.. కొన్ని సందర్బాల్లో మాత్రం తన మనసులోని మాట చెప్పేందుకు వెనుకాడరు. తన నోటి మాట పార్టీకి చెందిన వారికి కష్టం కలిగించేలా ఉన్నా.. వారి తప్పుల్ని మోసేందుకు ఆయన ఇష్టపడరు. పెద్దాయనగా తనకున్న ఇమేజ్ కు తగ్గట్లే.. స్వేచ్ఛగా.. స్వతంత్ర్యంగా వ్యవహరించేందుకు ఇష్టపడతారు.

ఏపీ అధికార పార్టీలో ఫైర్ బ్రాండ్ నేతగా.. నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేసేందుకు అస్సలు వెనుకాడని మంత్రిగా పేరున్న అంబటి రాంబాబు మీద షాకింగ్ వ్యాఖ్యలు చేశారు మరో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఏపీ విపక్ష నేత చంద్రబాబును స్కిల్ స్కాం ఆరోపణలతో అరెస్టు చేసిన నేపథ్యంలో మీడియా భేటీని నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక విలేకరులు పలు ప్రశ్నలు అడిగారు.

వాటికి సమాధానాలు ఇచ్చిన మంత్రి పెద్దిరెడ్డి.. తనకు ఎదురైన ఒక ప్రశ్నకు ఇచ్చిన సమాధానానికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు వాట్సాప్ గ్రూపుల్లోనూ.. సోషల్ మీడియాలోనూ వైరల్ గా మారింది. రాజకీయ నేతలు.. వారి వ్యాఖ్యలు.. విలువలు ఇలాంటి అంశంపై ఎదురైన ప్రశ్నకు బదులిచ్చిన ఆయన.. ఒక రాజకీయ నాయకుడిగా కొందరు కొన్ని విలువలు పాటిస్తారని.. తాను సైతం అదే రీతిలో వ్యవహరిస్తానని చెప్పారు.

ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి నోటి నుంచి అనూహ్య రీతిలో వచ్చిన వ్యాఖ్య ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ‘మా అంబటి రాంబాబు మాదిరి మాట్లాడను’ అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఏపీ విపక్ష నేతచంద్రబాబు.. ఆయన కుమారుడు లోకేశ్ తో పాటు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి ఎంత తీవ్రంగా రియాక్టు అవుతారో తెలిసిందే. మిగిలిన వారి సంగతి ఎలా ఉన్నా.. పవన్ మీద ఆయన చేసే వ్యాఖ్యలు తరచూ హాట్ టాపిక్ గా మారుతుంటాయి. సోషల్ మీడియాలోనూ అంబటి రాంబాబు వ్యాఖ్యలపై తరచూ వాదోపవాదాలు జరుగుతుంటాయి. ఆయన మాటలపై సీనియర్ మంత్రి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అందరిని ఆకర్షిస్తున్నాయి.