Begin typing your search above and press return to search.

మంత్రిపై అస‌మ్మ‌తి.. ప్ర‌జ‌ల్లోనేకాదు.. పార్టీలోనూ.. టికెట్ క‌ష్ట‌మేనా..!

ఎన్నిక‌ల‌కు మూడు మాసాల ముందు నాయ‌కులు ఎవ‌రైనా ప్ర‌జ‌ల అభిమానం పొందేందుకు ప్ర‌య‌త్ని స్తారు.

By:  Tupaki Desk   |   22 Dec 2023 12:30 PM GMT
మంత్రిపై అస‌మ్మ‌తి.. ప్ర‌జ‌ల్లోనేకాదు.. పార్టీలోనూ.. టికెట్ క‌ష్ట‌మేనా..!
X

ఎన్నిక‌ల‌కు మూడు మాసాల ముందు నాయ‌కులు ఎవ‌రైనా ప్ర‌జ‌ల అభిమానం పొందేందుకు ప్ర‌య‌త్ని స్తారు. ఇక‌, పార్టీలోనూ త‌మ‌కు ఎదురు లేకుండా చేసుకుంటారు. కానీ, అనూహ్యంగా అనంత‌పురం జిల్లా, క‌ళ్యాణ‌దుర్గం ఎమ్మెల్యే క‌మ్ మంత్రి ఉష శ్రీచ‌ర‌ణ్‌కు మాత్రం రెండు ప‌క్క‌లా సెగ త‌గులుతోంది. వచ్చే ఎన్నికల్లో ఆమెకు టికెట్‌ ఇవ్వవద్దంటూ వైసీపీ నేతలే డిమాండ్‌ చేస్తున్నారు. మరోవైపు ప్ర‌జలు కూడా ఆమెను తిర‌స్క‌రిస్తున్నారు.

త‌మ‌ను కాద‌ని సీటు కేటాయిస్తే ఎన్నికల్లో సహకరించబోమని నాయ‌కులు తేల్చి చెబుతున్నారు. ఉషశ్రీ చరణ్‌ ఎమ్మెల్యే అయిన తర్వాత నాయకులు, కార్యకర్తలను పూర్తిగా పక్కనపెట్టేశారని అధిష్ఠానానికి పలువురు ఫిర్యాదు చేశారు. అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో ఇటీవ‌ల‌ మొర పెట్టుకున్నారు. నియోజకవర్గంలో వైసీపీ నాయకులు... మంత్రి, అనంతపురం ఎంపీ రంగయ్య వర్గాలుగా విడిపోయారు.

ముందు నుంచీ స్థానిక వాల్మీకి నాయకులు ఎంపీ నాయకత్వంలో పనిచేస్తూ వస్తున్నారు. 2014లో వైసీపీ నుంచి పోటీచేసి ఓడిపోయిన తిప్పేస్వామి మంత్రి నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఆయన సొంత వర్గం ఏర్పాటు చేసుకుని కార్యక్రమాలు చేస్తున్నారు. ఇటీవల సీనియర్‌ నాయకులు తిప్పేస్వామి వర్గంలో చేరారు. వాల్మీకి సామాజికవర్గం ఓట్లు అత్యధికంగా ఉండటంతో వచ్చే ఎన్నికల్లో తిప్పేస్వామికి అవకాశం కల్పించాలనే డిమాండ్‌ పెరుగుతోంది. ఇందుకు ఎంపీ మద్దతు ఇస్తున్నట్లు సమాచారం.

మ‌రో వైపు.. గ్రంథాలయ సంస్థ మాజీఛైర్మన్‌ ఎల్‌ఎం మోహన్‌రెడ్డి టికెట్‌ ఆశిస్తున్నారు. పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేశామని వచ్చే ఎన్నికల్లో తమకు అవకాశం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. మోహన్‌రెడ్డి గతంలో వైఎస్‌ కుటుంబంతో సన్నిహితంగా ఉండేవారు. ఇప్పటికీ పులివెందులతో సంబంధాలు మెరుగ్గా ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే లేదా ఎంపీ టికెట్‌ కేటాయించాలని ఆయన కోరుతున్నారు.

ఇక‌, మంత్రి ఉష సామాజికవర్గానికి చెందిన దొణస్వామి ఎమ్మెల్యే టికెట్‌ ఆశిస్తున్నారు. పలుమార్లు మంత్రి పెద్దిరెడ్డిని కలిసి అవకాశం ఇవ్వాలని కోరారు. మంత్రిపై అవినీతి ఆరోపణలు చేస్తూ అధిష్ఠానానికి ఫిర్యాదులు చేశారు. దీంతో ఆయనపై అక్రమ కేసులు పెట్టారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఈ నేప‌థ్యంలో మంత్రిని ఎదుర్కొనేందుకు ఇదొక్క‌టే మార్గ‌మ‌ని నాయ‌కులు భావిస్తున్నారు. మ‌రి టికెట్ రాకుండా అడ్డుకోగ‌ల‌రేమో చూడాలి.