Begin typing your search above and press return to search.

మాకు రాముడైనా, కృష్ణుడైనా ఎన్టీఆరే అంటూ కేటీఆర్

తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు.. ఈ రోజు దివంగత నందమూరి తారక రామారావు మీద పొగడ్తల వర్షం కురిపించారు.

By:  Tupaki Desk   |   30 Sept 2023 2:30 PM IST
మాకు రాముడైనా, కృష్ణుడైనా ఎన్టీఆరే అంటూ కేటీఆర్
X

తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు.. ఈ రోజు దివంగత నందమూరి తారక రామారావు మీద పొగడ్తల వర్షం కురిపించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి ఎన్టీఆర్ ఆరాధ్య దైవమని ఆయనన్నారు. రాముడు ఎలా ఉంటాడో తెలియదు, కృష్ణుడు ఎలా ఉంటాడో తెలియదు.. మాకు రాముడైనా, కృష్ణుడైనా ఎన్టీఆరే అంటూ కేటీఆర్ ఒక రేంజిలో ఎన్టీఆర్‌నపు కొనియాడారు. ఖమ్మంలోని లకారం ట్యాంక్‌బండ్ మీద రూ.1.37 కోట్లతో కొత్తగా రూపొందించిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ను కేటీఆర్ మామూలుగా పొగడలేదు.

‘‘ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి ఎన్టీఆర్ ఎంతో ఆప్తుడు, ఆరాధ్య దైవం. మన దేశంలో తెలుగు వారంటూ ఉన్నారని అందరికీ తెలిసేలా చేసింది ఎన్టీఆర్. మహనీయులను చరిత్ర ఎప్పుడూ మరిచిపోదు. వారి స్థానం చిరస్మరణీయంగా ఉంటుంది. తెలుగు వాళ్లకు రాముడైనా, కృష్ణుడైనా ఎన్టీఆరే. ప్రజల మనసుల్లో ఆయన చెరగని ముద్ర వేశారు. నాకు తారక రామారావు అని పేరు ఉండటం పట్ల ఎంతో సంతోషంగా ఉంది. ఆ పేరులోనే ఒక పవర్ ఉంది. ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నా’’ అని కేటీఆర్ అన్నారు.

ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కేటీఆర్ వ్యూహాత్మకంగానే ఎన్టీఆర్ మీద ఇలా ప్రశంసలు కురిపించారని భావిస్తున్నారు. ఇటీవల చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో ఆందోళనలు చేయడం మీద ఆయన ప్రతికూల వ్యాఖ్యలు చేశారు. ఇలాంటివి హైదరాబాద్‌లో నడవవని.. ఐటీ ఉద్యోగులు వీటికి దూరంగా ఉండాలని హెచ్చరిక చేశారు. ఐతే ఈ వ్యాఖ్యలు సెటిలర్లలో బీఆర్ఎస్‌పై వ్యతిరేకతకు కారణమయ్యాయి. ఇక ఖమ్మంలో బీఆర్ఎస్ బలం తక్కువ అన్న సంగతి తెలిసిందే. అక్కడ తెలుగుదేశం పార్టీ, ఎన్టీఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలోనే ఉంటారు. సెటిలర్లలో వ్యతిరేకత తగ్గించడంతో పాటు ఖమ్మం వాసుల మనసు గెలిచే ఉద్దేశంతోనే తారక్ పనిగట్టకుని ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు హాజరు కావడమే కాక ఎన్టీఆర్‌ను ఒక రేంజిలో పొగిడారని భావిస్తున్నారు.