Begin typing your search above and press return to search.

హలాల్ పై కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు

ఆహార పదార్థాలను తీసుకోవడం వారి వారి వ్యక్తి గతమైన అంశం అని దానిపై ఎలాంటి కామెంట్లు చేయవద్దంటూ రాజ్యాంగం చెప్తున్నది

By:  Tupaki Desk   |   18 Dec 2023 1:14 PM GMT
హలాల్ పై కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు
X

ఆహార పదార్థాలను తీసుకోవడం వారి వారి వ్యక్తి గతమైన అంశం అని దానిపై ఎలాంటి కామెంట్లు చేయవద్దంటూ రాజ్యాంగం చెప్తున్నది. ప్రతీ వ్యక్తి జీవితంలో వారి వారి అలవాట్లు, ఆలోచనలకు అనుగుణంగా (ఇతరులకు ఇబ్బంది కలగకుండా) బతికే హక్కు ఉందని రాజ్యాంగం సూచిస్తుంది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారం రేపుతున్నారు. ఆయన ఒక వర్గం వారిని గౌరవిస్తూనే మన వర్గం వారు ఎందుకు ఆచారాలను పాటించడం లేదని ప్రశ్నించారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సంచలనాలుగా మారాయి. ఆయన ఏమన్నారంటే..

బిహార్ లోని తన సొంత పార్లమెంట్ నియోజకవర్గం బెగుసరాయ్ లో ఆయన ఈ రోజు (డిసెంబర్ 18) పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన హిందూ, ముస్లింల ఆహారపు అలవాట్లపై వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఆయన మాట్లాడుతూ 'హిందువులు హలాల్ ను తినడం మానేయాలి. నేను ముస్లింలను గౌరవిస్తాను. ముస్లింలు వారి మత ఆచారం ప్రకారం హలాల్ చేసిన మాంసం మాత్రమే తింటారు. ఈ విషయంలో వారిని అభినందించాలి. కానీ హిందువులు ఎందుకు ఈ మాంసాన్ని తినాలి.'

'సనాతన ధర్మంలో జంతుబలి ఉంది. అంటే జట్కా (ఒక్క వేటుతో జంతువు మెడ నరకడం) మాంసాన్ని మాత్రమే తినాలి. వెంటనే హలాల్ తినడం మానేయాలి. ముస్లింలు వారి ఆహార వ్యవహారానికి కట్టుబడినట్లు హిందువులు ఎందుకు కట్టుబడరు? హలాల్ మాంసం తినం అని ప్రతిజ్ఞ చేయండి. హిందువులు హలాల్ తిని తమను తాము భ్రష్టు పట్టించుకోవద్దు. జట్కా మాంసానికే కట్టుబడి ఉండాలి. కేవలం జట్కా మాంసం మాత్రమే దొరికేలా రిటైల్ ఔట్ లెట్లను ఏర్పాలు చేసి ఆ వ్యాపారాన్ని పెంచాలి.' అని గిరిరాజ్ సింగ్ అన్నారు.

రిటైల్ మార్కెట్ల ఏర్పాటు ఈ విషయంపై కొన్ని వారాల క్రితం బిహార్ సీఎం నితీష్ కుమార్ కు లేఖ రాశినట్లు వెల్లడించారు. ఉత్తర ప్రదేశ్ లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం లాగా హలాల్ అని లేబుల్ ఉన్న ఆహార ఉత్పత్తుల అమ్మకాలపై నిషేధం విధించాలని కోరినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. దీంతో పాటు హిందువులు దేవాలయాలకు విరివిగా వెళ్లాలని ఆయన కోరారు. ఉదయంతో పాటు సాయంత్రం కూడా ఆలయాలకు వెళ్తే మానసిక ప్రశాంతత కలుగుతుందన్నారు.

పార్లమెంట్ లో చొరబాటు దారులపై స్పందిస్తూ ఈ కుట్ర వెనుక దాగున్నది ఎవరో త్వరలోనే తేలుతుందన్నారు. ఈ దాడిని ఢిల్లీలో గతంలో చేసిన రైతు ఉద్యమాన్ని పోలుస్తూ మాట్లాడారు కేంద్ర మంత్రి. రైతు ఉద్యమ సమయంలో టూల్ కిట్ గ్యాంగ్ ఎలా బయటపడిందో పార్లమెంట్ ఘటన వెనుక ఉన్నదెవరో త్వరలోనే తేలుతుందని మంత్రి గిరిరాజ్ సింగ్ స్పష్టం చేశారు.