Begin typing your search above and press return to search.

ఎమ్మెల్యేలకు లోకేశ్ భయం..? ఒక్క రోజులో ఎంత మార్పు!

పార్టీ ఆదేశాలను గాలికొదిలేసి గత కొంతకాలంగా ప్రజాదర్బార్ నిర్వహణను నిలిపేసిన ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్చార్జిల తీరుపై యువనేత, ఐటీ మంత్రి లోకేశ్ సీరియస్ కావడంతో శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమం కొనసాగింది

By:  Tupaki Desk   |   8 Nov 2025 8:33 PM IST
ఎమ్మెల్యేలకు లోకేశ్ భయం..? ఒక్క రోజులో ఎంత మార్పు!
X

ప్రజాదర్బార్ పై మంత్రి లోకేశ్ క్లాసు పీకడంతో టీడీపీ ఎమ్మెల్యేలు దారికొచ్చారు. పార్టీ ఆదేశాలను గాలికొదిలేసి గత కొంతకాలంగా ప్రజాదర్బార్ నిర్వహణను నిలిపేసిన ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్చార్జిల తీరుపై యువనేత, ఐటీ మంత్రి లోకేశ్ సీరియస్ కావడంతో శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమం కొనసాగింది. రెండు నియోజకవర్గాలు మినహా మిగిలిన 173 చోట్ల టీడీపీ ఎమ్మెల్యేలు, ఇన్చార్జిల ఆధ్వర్యంలో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు.

ఎమ్మెల్యేలుగా గెలిచాం.. ఇక తమ పని ఏమీ లేదని భావిస్తున్న నేతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు, యువనేత లోకేశ్ షాక్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఎమ్మెల్యేల పనితీరుపై నిఘా వేసి ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. నడవడికలో తేడా వచ్చిన ఎమ్మెల్యేలకు సూటిగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయితే ఇటీవల అధికార విధి నిర్వహణలో బిజీ అయిపోవడం వల్ల ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ మంత్రి లోకేశ్ పార్టీ వ్యవహారాలను కాస్త వెనక్కి పెట్టారు.

దీంతో ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు కూడా ఇతర వ్యవహారాలకు ప్రాధాన్యం ఇవ్వడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో ప్రభుత్వ సేవలు, ఇతర సమస్యలపై మంత్రి లోకేశ్ కు ఫిర్యాదులు ఎక్కువయ్యాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాదర్బార్ ను ప్రారంభించిన లోకేశ్.. ప్రజల సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేశారు. అయితే ఆయన కూడా ప్రభుత్వ వ్యవహారాలలో బిజీగా మారడంతో ప్రజలు కార్యకర్తల సమస్యలు పరిష్కారం కావడంలేదు. దీనిపై పార్టీ అంతర్గత సర్వేలో అసంతృప్తి వ్యక్తమైందని చెబుతున్నారు.

ఈ పరిస్థితుల్లో ఇటీవల ఒక రోజు ప్రజాదర్బార్ నిర్వహణకు మంత్రి లోకేశ్ సమయం కేటాయించారు. మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో అందుబాటులో ఉంటానని ముందుగా సమాచారం ఇచ్చిమరీ కార్యకర్తలను కలిశారు. దీంతో సుమారు ఐదు వేల మంది రాష్ట్రం నలుమూల నుంచి మంగళగిరి పార్టీ ఆఫీసుకు తరలివచ్చారు. ఆ జనాన్ని చూసి ఆశ్చర్యపోయిన మంత్రి లోకేశ్.. అంతమంది రావడానికి కారణాలుపై ఆరా తీశారు.

ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరూ నియోజకవర్గాల్లో అందుబాటులో లేకపోవడం, కేంద్ర కార్యాలయంలో కూడా ప్రజాదర్బార్ నిర్వహించకపోవడం వల్ల సమస్యలు పేరుకుపోయాయని, ప్రజలను పట్టించుకునేవారు లేకుండా పోయారని మంత్రి దృష్టికి వెళ్లింది. పార్టీ నుంచి ప్రజాదర్బార్ నిర్వహణపై స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ ఎవరూ పట్టించుకోకపోవడంపై మంత్రి సీరియస్ అయ్యారు. ఇప్పటివరకు ఏ నియోజకవర్గంలో ఎన్నిసార్లు ప్రజాదర్బార్ నిర్వహించింది? ఎన్ని దరఖాస్తులు వచ్చింది? వాటిపై తీసుకున్న చర్యలు వివరిస్తూ తనకు సమగ్ర నివేదిక ఇవ్వాల్సిందిగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ను మంత్రి లోకేశ్ ఆదేశించారు.

దీంతో ఆయన ఎమ్మెల్యేలను అప్రమత్తం చేయడంతో ఒక్కరోజులోనే మార్పు కనిపించింది. మంత్రి ఆగ్రహాన్ని గమనించిన ఎమ్మెల్యేలు శుక్రవారం తమ నియోజకవర్గాల్లో ప్రజాదర్బార్ నిర్వహించినట్లు ఫొటోలతో సహా పార్టీకి సమాచారం పంపారు. రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు ఉండగా, 173 చోట్ల ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. పి.గన్నవరం, అవనిగడ్డలో పార్టీ ఇన్చార్జిలు అందుబాటులో లేకపోవడంతో నిర్వహించలేకపోయామని సమాచారమిచ్చారు. ఎమ్మెల్యేలు అందుబాటులో లేనిచోట వారి ప్రతినిధులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ పరిణామాన్ని పరిశీలించిన వారు మంత్రి లోకేశ్ ఇచ్చిన డోస్ బాగా పనిచేసిందని వ్యాఖ్యానిస్తున్నారు.