హెం మంత్రి అనిత ఇలాకాలో రగడ...!
రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి విశాఖ జిల్లా పాయకరావు పేట లో మళ్లీ అదే రగడ చోటు చేసుకుంది.
By: Tupaki Desk | 21 April 2025 10:22 AM ISTరాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి విశాఖ జిల్లా పాయకరావు పేట లో మళ్లీ అదే రగడ చోటు చేసుకుంది. గతంలో ఏ విధంగా అయితే.. ఇక్కడ అనితను వ్యతిరేకించే రాజకీయాలు తెరమీదికి వచ్చాయో.. ఇప్పుడు కూడా అలానే ఉన్నాయని.. టీడీపీ నాయకులు చెబుతున్నారు. నియోజకవర్గానికి దూరంగా ఉండడం.. నాయకులను పట్టించుకోకపోవడం.. వంటివి 2014-19 మధ్య అనితకు సెగపెట్టాయి. దీంతో ఆమె నియోజకవర్గాన్ని మార్చుకునే పరిస్థితి వచ్చింది.
2019 ఎన్నికల్లో కోవూరు నుంచి పోటీ చేసినప్పటికీ.. అనితకు ఫలితం దక్కలేదు. ఇదిలావుంటే.. 2024లో పాయకరావుపేటకు వెళ్లి.. అక్కడే పోటీ చేసి విజయం దక్కించుకున్నారు. అయితే.. స్వల్ప కాలంలోనే అనేక ఆరోపణలు వస్తున్నాయి. ఇక్కడ గెలిచి 10 మాసాలే అయింది. అయితే.. ఓఎస్‌డీ రూపంలో అనిత చుట్టూ వివాదాలు ముసురుకున్నాయి. ఓఎస్‌డీ చేతివాటం కారణంగా విమర్శలు వచ్చాయి. దీంతో ఆయనను తప్పించారు. అయినప్పటికీ.. ఆరోపణలు మాత్రం ఆగడం లేదు.
ఇదిలావుంటే.. నాయకులకు కూడా మంత్రి అందుబాటులో ఉండడంలేదని కొన్నాళ్లుగా ఆరోపణలు వస్తున్నాయి. నియోజకవర్గంలో నాయకులపై పట్టు లేకపోవడం.. సొంత నియోజకవర్గంలోనే శాంతి భద్రతల కు ఇబ్బందులు రావడం.. వంటివి కూడా మంత్రి సెగపెంచుతున్నాయి. ఇటీవల విశాఖ కార్పొరేషన్ విషయంలో తనకు సంబంధమే లేదన్నట్టుగా మంత్రి వ్యవహరించారన్న ఆరోపణలు కూడా వచ్చాయి. నాయకులు అంతా ఒక్కటి.. ఆమె మాత్రం సెపరేటు అన్నట్టుగా ఇక్కడ రాజకీయాలు మారుతున్నాయి.
గత ఎన్నికల సమయంలో అందరినీ కలుపుకొని పోతానని హామీ ఇచ్చినా.. ఇప్పుడు ఆ తరహా రాజకీయా లు చేయలేకపోతున్నారు. గ్రూపు రాజకీయాలకు పెట్టింది పేరైన పాయకరావుపేటలో అనితకు వ్యతిరేకం గా గ్రూపులు పెరుగుతున్నాయన్న వాదన బలంగా వినిపిస్తోంది. అయితే.. ఇది ఆమెకు మేలు చేయడం కన్నా.. ఇబ్బందిగానే మారుతుందని అంచనా వేస్తున్నారు. ఇక, మరోవైపు.. వైసీపీ కూడా.. ఇక్కడ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుండడం గమనార్హం.
