టార్గెట్ గుడివాడ అమరనాథ్.. మహిళా కమిషన్ చేతికి 'మేకప్' వ్యాఖ్యల ఫైలు!
హోంమంత్రి అనిత కట్టుబొట్టుపై మాజీ మంత్రి గుడివాడ అమరనాథ్ చేసిన విమర్శలపై సుమోటాగా కేసు నమోదు చేయాలని మహిళా కమిషన్ నిర్ణయించినట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
By: Tupaki Desk | 16 Jun 2026 8:40 PM ISTమాజీ మంత్రి, వైసీపీ నేత గుడివాడ అమరనాథ్ కు ఉచ్చు బిగించేలా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రెండు రోజుల క్రితం హోంమంత్రి అనితను ఉద్దేశించి మాజీ మంత్రి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ విషయమై కూటమి నేతలు ఒక్కొక్కరుగా మీడియా ముందుకు వస్తుండటమే కాకుండా, వైసీపీని కార్నర్ చేసేలా ఎదురుదాడి చేస్తున్నారు. అనితపై చేసిన విమర్శలను కేవలం మహిళలను అవమానించడమే కాకుండా, ఒక దళిత మహిళా మంత్రిపై జరిగిన దాడిగా ప్రభుత్వ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఇక ఈ విషయమై వైసీపీని, మాజీ మంత్రి అమరనాథ్ ను మరింత ఇరుకున పెట్టేలా మహిళా కమిషన్ ను రంగంలోకి దింపాలని ఆలోచన చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
హోంమంత్రి అనిత కట్టుబొట్టుపై మాజీ మంత్రి గుడివాడ అమరనాథ్ చేసిన విమర్శలపై సుమోటాగా కేసు నమోదు చేయాలని మహిళా కమిషన్ నిర్ణయించినట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. రెండు రోజులుగా మాజీ మంత్రి గుడివాడ అమరనాథ్ వ్యాఖ్యలపై మండిపడుతున్న కూటమి ప్రభుత్వ నేతలు.. ఈ విషయాన్ని మహిళా కమిషన్ కు అప్పగించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు. పోలీసు కేసు పెడితే రాజకీయ కక్షసాధింపు అనే ముద్ర పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీంతో మహిళా కమిషన్‌ను రంగంలోకి దించడం ద్వారా మహిళా గౌరవం అనే సెంటిమెంట్‌ను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లవచ్చనేది కూటమి వ్యూహంగా కనిపిస్తోందని అంటున్నారు.
మహిళా కమిషన్‌కు స్వయంప్రతిపత్తి, చట్టబద్ధమైన అధికారాలు (సివిల్ కోర్టుకు ఉండేలాంటి అధికారాలు) ఉండటంతో సుమోటోగా కేసు నమోదు చేసే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అంతేకాకుండా మహిళా కమిషన్ నోటీసులకు తప్పకుండా సమాధానం చెప్పాల్సివుంటుందని అంటున్నారు. దీంతో మాజీ మంత్రికి నోటీసులు జారీ చేయడం వల్ల రాజకీయంగా కూడా పైచేయి సాధించినట్లు అవుతుందని కూటమి ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నట్లు చెబుతున్నారు. హోంమంత్రిపై రాజకీయ విమర్శలను ఉపేక్షించి వదిలేసినా, ఆమె వ్యక్తిత్వంపై చేసిన వ్యాఖ్యల విషయంలో ఏమాత్రం ఉదాశీనత చూపకూడదని కూటమి నేతలు నిర్ణయించినట్లు చెబుతున్నారు.
దీంతో మాజీ మంత్రి గుడివాడకు మహిళా కమిషన్ ద్వారా నోటీసులు పంపేందుకు రంగం సిద్ధం అవుతున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం మహిళా కమిషన్ చైర్ పర్సన్ రాయపాటి శైలజ అందుబాటులో లేరని, ఆమె బుధవారం రాజధాని అమరావతికి వస్తారని అంటున్నారు. ఇక ఆమె వచ్చీరాగానే మాజీ మంత్రి గుడివాడకు సమన్లు పంపే విషయమై నిర్ణయం తీసుకుంటారని ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. హోంమంత్రి అనిత కూడా ఇదే ఆలోచనతో తనపై చేసిన విమర్శలకు ఇంతవరకు ప్రత్యారోపణలు చేయలేదని అంటున్నారు. ఒక వ్యూహంతోనే కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని, మహిళా కమిషన్ ను రంగంలోకి దింపడం ద్వారా వైసీపీ నేతలు తమ వ్యాఖ్యలకు కచ్చితంగా వివరణ ఇచ్చుకోవాల్సివస్తుందని అంటున్నారు. దీనివల్ల రాజకీయంగా వైసీపీని ఆత్మరక్షణలోకి నెట్టే పరిస్థితి కూడా వస్తుందని కూటమి నేతలు భావిస్తున్నట్లు చెబుతున్నారు.
