ప్రపంచ సంపన్నులు ఎందుకు ఈ ముస్లిం దేశానికే తరలిపోతున్నారు?
ప్రపంచ సంపన్నులు తరలిపోతున్నారు. ఈ ముస్లిం దేశానికే వెళ్లి సెటిల్ అయిపోతున్నారు.
By: Tupaki Desk | 27 Jun 2025 6:00 AM ISTప్రపంచ సంపన్నులు తరలిపోతున్నారు. ఈ ముస్లిం దేశానికే వెళ్లి సెటిల్ అయిపోతున్నారు. 2025 సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ధనవంతులు ముఖ్యంగా హై-నెట్-వర్త్ వ్యక్తులు ఇలా వలస వెళుతున్నారు. రూ. 8 కోట్ల కంటే ఎక్కువ విలువైన లిక్విడ్ ఆస్తులు కలిగినవారు ఈ ఏడాది దాదాపు 1.42 లక్షల మంది మిలియనీర్లు తమ నివాస దేశాలను విడిచి కొత్త దేశాల్లో పునరావాసం పొందుతున్నారు. ఈ సంఖ్య 2026 నాటికి 1.65 లక్షలకుపైగా చేరే అవకాశం ఉంది.
- అంచనాలను బద్దలుకొట్టిన అరబ్ దేశం యూఏఈ
సౌదీ అరేబియా, ఖతార్, కువైట్ వంటి ముస్లిం దేశాలు ధనికులకు ఆహ్వానం పలుకుతాయని భావించినా, ఈ వలసల్లో అత్యధిక మంది సంపన్నులు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)ను ఎంచుకోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. హెన్లీ ప్రైవేట్ వెల్త్ రిపోర్ట్ 2025 ప్రకారం, ఈ ఏడాది 9,800 మిలియనీర్లు యూఏఈకి వలస వెళ్లనున్నారు. ఇది 2024తో పోలిస్తే 5.8% పెరుగుదల. ప్రపంచవ్యాప్తంగా సంపన్న వలసదారుల్లో ఇది అత్యధిక సంఖ్య కావడం గమనార్హం.. యూఏఈ తర్వాత అమెరికా (7,500), ఇటలీ (2,200), స్విట్జర్లాండ్ (1,500), సౌదీ అరేబియా (2,400) స్థానం పొందాయి. ఆస్ట్రేలియా, సింగపూర్, పోర్చుగల్ వంటి దేశాలు కూడా వారి సుసంపన్నమైన ఇన్వెస్ట్‌మెంట్ మైగ్రేషన్ పాలసీల ద్వారా సంపన్నులను ఆకర్షిస్తున్నాయి.
- భారత్ నుంచి భారీగా వలస
ఇటీవల కాలంలో భారత్ నుంచి ధనికుల వలస కొనసాగుతోంది. 2025లో 3,500 మిలియనీర్లు భారత్‌ను వదిలి విదేశాలకు వెళ్లే అవకాశముంది. అయితే టాక్స్ పాలసీలలో మార్పులు, తిరిగి దేశానికి వచ్చే ధనికుల సంఖ్య వంటి అంశాలు ఈ ధోరణిని ప్రభావితం చేయవచ్చు.
- యూఏఈ ఎందుకు ధనికులకు ప్రియమైన గమ్యంగా మారింది?
మధ్యప్రాచ్యంలో ఇరాన్-ఇజ్రాయెల్ ముడిపడిన ఉద్రిక్తతల నేపథ్యంలోనూ యూఏఈపై ధనికుల ఆకర్షణ తగ్గడం లేదు. దీనికి ప్రధాన కారణాలున్నాయి. ప్రధానంగా యూఏఈలో వ్యక్తిగత ఆదాయంపై పన్ను లేకపోవడం సంపన్నులకు పెద్ద ఆకర్షణగా నిలుస్తోంది. వ్యాపారం, పెట్టుబడులకు అనుకూలమైన సులభతరమైన వలస విధానాలు ఉన్నాయి. రాజకీయ సుస్థిరత , సురక్షితమైన వాతావరణం ఉంది. ప్రపంచ స్థాయి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉంది. అత్యున్నత స్థాయి రోడ్లు, విమానాశ్రయాలు, రేవులు, కమ్యూనికేషన్ వ్యవస్థ ఉంది. అత్యంత సురక్షితమైన వాతావరణం, విలాసవంతమైన జీవన శైలికి అవకాశం గల దేశంగా ఉంది ఈ విధంగా యూఏఈ ఆర్థిక భద్రత , ఆధునిక జీవన శైలిని కలిపిన అరుదైన మిశ్రమంగా నిలుస్తోంది.
- ఈబీ-5 ప్రోగ్రాంతో అమెరికా ఆకర్షణ..
అమెరికా రెండవ స్థానంలో ఉన్నప్పటికీ అక్కడి ఈబీ-5 ఇమ్మిగ్రెంట్ ఇన్వెస్టర్ ప్రోగ్రాం దశాబ్దాలుగా $50 బిలియన్లకు పైగా విదేశీ పెట్టుబడులు సమీకరించింది. ఇది వేలాది ఉద్యోగాలను సృష్టించి, పెట్టుబడిదారులకు అమెరికాలో నివాసం పొందే అవకాశం కల్పిస్తుంది.
ప్రపంచ సంపన్నులు అన్ని విధాల ఆమోదయోగ్యమైన ప్రాంతాలకు వలస వెళుతున్నారు. డిజిటల్ ప్రపంచం, నూతన వలస విధానాలు, గ్లోబల్ ట్రావెల్ సదుపాయాలు... ఇవన్నీ కలగలిసి యూఏఈను ప్రపంచంలోని ధనవంతులకే కాక, భారతీయ మిలియనీర్లకూ "ధనికుల స్వర్గధామంగా" మార్చేశాయి. 2025 తరువాత ఈ ధోరణి ఎలా మారుతుంది అనేది ఆసక్తికర అంశం కానుంది.
