సమాజం ఏమనుకున్నా పర్లేదు.. నో మ్యారేజ్ బిఫోర్ 30!
ఏంటి నువ్వు ఇంకా పెళ్లి చేసుకోలేదా.. ?.. 30 ఏళ్లు దాటిన చాలా మంది యువతీయువకులు తరచూ ఎదుర్కొనే ప్రశ్న ఇది.
By: Tupaki Desk | 6 May 2025 10:55 AM ISTఏంటి నువ్వు ఇంకా పెళ్లి చేసుకోలేదా.. ?.. 30 ఏళ్లు దాటిన చాలా మంది యువతీయువకులు తరచూ ఎదుర్కొనే ప్రశ్న ఇది. ఒకప్పుడు 20ల్లోనే పెళ్లిళ్లు కామన్ గా జరిగేవి. కానీ, నేటి తరం ఆలోచనల్లో చాలా మార్పులు సంభవించాయి. పోటీ ప్రపంచంలో తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని, ఆర్థికంగా స్థిరపడి ఉన్నత జీవితం గడపాలని నేటి యువత బలంగా కోరుకుంటుంది. ఈ క్రమంలో వారు కొన్ని నిర్దిష్ట లక్ష్యాలను ఏర్పరచుకుంటున్నారు. ఉన్నత విద్యను పూర్తి చేయడం, ఆ తర్వాత మంచి ఉద్యోగాన్ని సాధించడం వారి ప్రాధాన్యతల్లో ముఖ్యమైనవి. ఈ ప్రయాణంలో చాలా మందికి 30ఏళ్లు దాటిపోతున్నాయి.
అంతేకాకుండా సరైన లైఫ్ పార్టనర్ దొరక్కపోవడం, పెళ్లి తర్వాత వచ్చే బాధ్యతలు, ముఖ్యంగా భాగస్వామితో గొడవలకు భయపడడం వంటి కారణాల వల్ల కూడా కొందరు పెళ్లిని వాయిదా వేస్తున్నారట. మారిన సామాజిక పరిస్థితులు, వ్యక్తిగత స్వేచ్ఛకు ప్రాధాన్యత ఇవ్వడం వంటి అంశాలు కూడా పెళ్లి వయస్సును పెంచేస్తున్నాయి.
నేటి యువత తమ కెరీర్ ను చాలా సీరియస్ గా తీసుకుంటుంది. మంచి చదువులు చదువుకుని, ఐదంకెల జీతం వచ్చే ఉద్యోగాన్ని సాధించడం వారి మొదటి లక్ష్యం. ఆర్థికంగా నిలదొక్కుకున్న తర్వాతే పెళ్లి గురించి ఆలోచించాలని చాలా మంది భావిస్తున్నారు. తమ కాళ్లపై తాము నిలబడాలనే తపన, సమాజంలో ఒక మంచి గుర్తింపు సంపాదించాలనే కోరిక వారిని పెళ్లిని ఆలస్యం చేసేలా చేస్తున్నాయి. ఒక మంచి కెరీర్ ఉంటేనే జీవితం సుఖంగా ఉంటుందని వారు నమ్ముతున్నారు.
పెళ్లి అనేది జీవితంలో ఒక కీలక నిర్ణయం. అందుకే చాలా మంది యువతీయువకులు తమకు సరిపోయే లైఫ్ పార్టనర్ కోసం ఎక్కువ సమయం తీసుకుంటున్నారు. అంతేకాకుండా లవ్ మ్యారేజీల సంఖ్య పెరుగుతుండటంతో, ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్న తర్వాతే పెళ్లి బంధంలోకి అడుగు పెట్టాలని వారు భావిస్తున్నారు. తొందరపడి పెళ్లి చేసుకుని తర్వాత భాదపడే కంటే అర్థం చేసుకునే లైఫ్ పార్టనర్ కోసం వేచి ఉండడమే బెటర్ అనుకుంటున్నారు.
కొంతమంది యువత పెళ్లి తర్వాత ఉండే బాధ్యతలకు భయపడుతున్నారు. ప్రస్తుతం ఇద్దరూ జాబ్ చేయాల్సిన పరిస్థితులు రావడంతో తమ కాళ్ల మీద తాము నిలబడ్డామనే సెల్స్ కాన్ఫిడెన్సులో మాట పడని నైజం పెరుగుతోంది. దీంతో చిన్న వివాదాలు కాస్త విడాకుల వరకు వెళ్తున్నాయి. కుటుంబ కలహాల గురించి వినడం వంటి కారణాల వల్ల పెళ్లి అంటేనే ఒక రకమైన భయం వారిలో నెలకొంటోంది. తమ ఫ్రీడమ్ కు భంగం కలుగుతుందనే భావన కూడా కొందరిలో ఉంటుంది. అందుకే, పెళ్లి చేసుకోవడానికి వారు వెనుకాడుతున్నారు.
30 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోకపోతే సమాజం నుంచి వచ్చే ఒత్తిడి కూడా కొంతమందిపై ఉంటుంది. బంధువులు, స్నేహితులు "ఇంకెప్పుడు పెళ్లి?" అని అడుగుతూ ఉంటారు. ఇరుగుపొరుగు వాళ్ల ఒత్తిడిని తట్టుకోలేక కొందరు అయిష్టంగానే పెళ్లికి ఒప్పుకుంటారు. అయితే, చాలా మంది మాత్రం తమ వ్యక్తిగత నిర్ణయాలకు కట్టుబడి ఉంటున్నారు.
