వైరల్ వీడియో.. 11 వేల లీటర్లు నది‘పాలు’.. ఆలోచింప చేస్తున్న దృశ్యాలు..!
ఆర్థిక పరంగా దేశం ప్రపంచంలో 4 స్థానంలో ఉండి.. 3వ స్థానానికి ఎగబాకుతున్నా కూడా ఇప్పటికీ దేశంలో ఏదో ఒక మూల ఆకలి చావులు వినిపిస్తూనే ఉంటాయి.
By: Tupaki Political Desk | 10 April 2026 1:11 PM ISTఆర్థిక పరంగా దేశం ప్రపంచంలో 4 స్థానంలో ఉండి.. 3వ స్థానానికి ఎగబాకుతున్నా కూడా ఇప్పటికీ దేశంలో ఏదో ఒక మూల ఆకలి చావులు వినిపిస్తూనే ఉంటాయి. భారత్ కర్మ భూమి ఇక్కడ ఎప్పుడూ ఆధ్యాత్మికతకు పెద్ద పీట వేస్తుంటారు. అయితే ఒక వర్గం వారు నిర్వహించుకునే ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఎప్పుడూ విమర్శలు వస్తూనే ఉంటాయి. ఇటీవల ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంకు సంబంధించి వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది. వేలాది లీటర్ల పాలను నదిలో కలపడంపై విమర్శలు వస్తున్నాయి. ఒకవైపు నదుల ‘పాలు’.. మరోవైపు ఆకలితో అల్లాడే చిన్నారి కడుపులు.. ఈ దృశ్యాలు చూస్తుంటే మతం పేరిట మనం ఎటు వెళ్తున్నామో అన్న ఆందోళన కలుగుతోంది. భక్తి అనేది మనసును శుద్ధి చేయాలి కానీ, విచక్షణను హరించకూడదు. మహోబాలోని పాఠశాల విద్యార్థులకు నీళ్ల పాలు ఇస్తూ, నర్మదా నదిలో వేల లీటర్ల పాలను కలపడం భక్తి కాదు అని కొందరు వాదిస్తున్నారు.
11,000 లీటర్ల పాలు వృధా!
ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అన్నది పెద్దల మాట. కానీ, నేటి కాలంలో ఆచారాల పేరిట చేస్తున్న వృథా చూస్తుంటే ఆ మాట మరుగున పడిపోతోందనిపిస్తోంది. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రెండు వీడియోలు మన సమాజంలోని రెండు భిన్నమైన ముఖాలను బయటపెట్టాయి. ఒకచోట మతపరమైన వేడుక అంటూ 11,000 లీటర్ల పాలను ఏకంగా నదిలో పారబోశారు. సరిగ్గా అదే సమయంలో, మరో ప్రభుత్వ పాఠశాలలో చిన్నారులకు ఇచ్చే మధ్యాహ్న భోజనంలో పాలు తక్కువ, నీళ్లు ఎక్కువ కలిపి ఇస్తున్న దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ఈ వైరుధ్యం చూస్తుంటే దేవుడు నిజంగా ఇలాంటి నైవేద్యాలనే కోరుకుంటున్నాడా అన్న ప్రశ్న తలెత్తక మానదు.
ఆచారాల పేరిట..
నర్మదా నది తీరాన జరిగిన ఒక ఉత్సవంలో వేల లీటర్ల పాలను నదిలోకి వదలడం చర్చనీయాంశమైంది. మతపరమైన సెంటిమెంట్లను ఎవరూ ప్రశ్నించకూడదు కానీ, ఆ పాలు ఒక ఆకలితో ఉన్న చిన్నారి కడుపు నింపితే కలిగే పుణ్యం అంతకంటే గొప్పది కాదా..? పాలను పవిత్రంగా భావించే దేశంలో, వాటిని ఇలా వృథా చేయడం భక్తి అనిపించుకోదు. ప్రకృతిని ఆరాధించడం అంటే ప్రకృతిని కలుషితం చేయడం లేదా వనరులను నాశనం చేయడం కాదని మనం గుర్తించాలి.
చిన్నారుల ఆకలి కేకలు
మహోబాలోని ఒక పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా విద్యార్థులకు పాలు ఇస్తున్నారు. కానీ అవి పాలు కావు.., కేవలం పాల రంగులో ఉన్న నీళ్లు మాత్రమే! ఒక బకెట్ నీళ్లలో కొద్దిగా పాలు కలిపి వందలాది మంది విద్యార్థులకు పంపిణీ చేస్తున్నారు. దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే చిన్నారులకు కనీసం సరైన పోషకాహారం అందించలేని స్థితిలో మనం ఉన్నప్పుడు, వేల లీటర్ల పాలను నదిలో కలపడం అనేది అత్యంత బాధాకరమైన విషయం.
మానవత్వమే పరమార్థం
మనం సమర్పించే చాదర్ (దుప్పటి) దర్గాలో వేయడం కంటే, రోడ్డు పక్కన చలికి వణుకుతున్న అనాథకు ఇస్తే అది భగవంతుడికి నేరుగా చేరుతుంది. ఆలయంలో వెలిగించే కొవ్వొత్తి కంటే, చీకటిలో ఉన్న పేదవాని ఇంట్లో వెలిగించే దీపం మిన్న. అలాగే, విగ్రహాలకు అభిషేకం చేసే పాల కంటే, తల్లి పాలు లేని పసిబిడ్డ కడుపు నింపే పాలే పరమార్థం.
విశ్వాసం అనేది వ్యక్తిగతమైంది, కానీ ఆ విశ్వాసం ఇతరులకు హాని కలిగించకూడదు లేదా సమాజానికి ఉపయోగపడకుండా ఉండకూడదు. ఆచారాల పేరిట జరుగుతున్న ఈ వృథాపై ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. మన ఆచారాలు మారుతున్న కాలంతో పాటు మరింత అర్థవంతంగా, మానవత్వంతో కూడి ఉండాలి. అప్పుడే మనం ఒక అభివృద్ధి చెందిన, ఆలోచించే సమాజాన్ని నిర్మించగలం.
