1963 - 2025... భారత వైమానిక దళంలో 'మిగ్-21' సేవలు ఇవే!
అవును... 1963 నుంచి భారత వాయుసేనకు వెన్నెముకగా నిలిచిన 'మిగ్-21' విమానాలకు సెలవు ప్రకటించనున్నారు.
By: Tupaki Desk | 23 July 2025 3:00 AM IST1971 యుద్ధంలో భారత్ కు అద్భుత విజయం చేకూరడం వెనక.. ఆ సమయంలో పాక్ ఎయిర్ బేస్ లపై సుమారు 500 కిలోల బాంబులు జారవిరచడం వెనుక.. 2019లో బాలాకోట్ దాడుల అనంతరం పాక్ విమానాలు జమ్మూకశ్మీర్ లో చొరబడినప్పుడు వాటిని తరమడం వెనుక ఉన్నది... 'మిగ్-21' ఫైటర్ జెట్ లే. అలాంటి జెట్ లు ఇకపై భారత వైమానిక దళంలో కనిపించవు! వీటి సేవలకు ఇక సెలవు అని ఐఏఎఫ్ ప్రకటించింది.
అవును... 1963 నుంచి భారత వాయుసేనకు వెన్నెముకగా నిలిచిన 'మిగ్-21' విమానాలకు సెలవు ప్రకటించనున్నారు. ఈ విషయాన్ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్) వెల్లడించింది. ఇందులో భాగంగా... సెప్టెంబర్ 19వ తేదీన చండీగఢ్ వైమానిక స్థావరంలో వీటికి వీడ్కోలు వేడుకను నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఇది అధికారికంగా రిటైర్ కానుంది. వీటిని తేజస్ 'ఎంకే1ఏ'తో భర్తీ చేయనున్నారు.
1963లో తొలిసారి వాయుసేనలో చేరాయి మిగ్-21 విమానాలు. దీంతో... భారత వాయుసేనలో చేరిన తొలి సూపర్ సోనిక్ ఫైటర్ జెట్ లుగా ఇవి నిలిచాయి. ఈ క్రమంలో సుమారు 850కు పైగా మిగ్ లు వాయుసేనలో వివిధ దశల్లో సేవలు అందించాయి. వీటిల్లో 600 దేశీయంగా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ లో తయారు చేశారు. ప్రస్తుతం వాయుసేనలో 31 మిగ్-21లు సేవలు అందిస్తున్నాయి.
అయితే గతంలో ఎంతో ఘనమైన చరిత్ర కలిగిన ఈ జెట్ లు... ఇటీవల కాలంలో తరచుగా ప్రమాదాలకు గురయ్యాయి. ఇందులో భాగంగా... సుమారు 482 కూలిపోయినట్లు 2012లోనే నాటి రక్షణమంత్రి ఏకే ఆంటోని రాజ్యసభలో వెల్లడించారు. నాటి లెక్కల ప్రకారం ఈ ప్రమాదాల్లో 171 మంది పైలట్లు, 39 మంది పౌరులు మృతి చెందారు.
వాస్తవానికి 1985లోనే సోవియట్ యూనియన్ ఈ 'మిగ్-21'లను తమ దళం నుంచి తొలగించింది. అయితే... మన దగ్గర సుఖోయ్, రఫేల్, తేజస్ వంటి యుద్ధ విమానాలున్నప్పటికీ.. వాటి సంఖ్య చాలా పరిమితం కావడంతో.. తప్పనిసరి పరిస్థితుల్లో సోవియట్ యూనియన్ కాలంలో రూపొందించిన ఈ మిగ్-21లను ఇంకా వినియోగించాల్సిన పరిస్థితి నెలకొంది.
1960 - 70ల్లో భారత్ కు గగనతల యుద్ధంలో అదనపు బలంగా మారిన ఈ మిగ్-21లు అప్పట్లో సాంకేతికంగా పశ్చిమదేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేశాయి. ఈ టెక్నాలజీని సొంతం చేసుకోవడం కొసం.. ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొస్సాద్ దీనిని దొంగిలించిందంటే ఈ జెట్ సత్తా ఏంటో అర్థం చేసుకోవచ్చని చెబుతారు.
గాలిలో చురుగ్గా కదలడం, అతి తక్కువ సమయంలోనే అత్యధిక వేగాన్ని అందుకోవడం దీని ప్రత్యేకతలు కాగా... ప్రస్తుతం విమానాలు ఫ్లై బైవైర్ వ్యవస్థతో వేగాన్ని నియంత్రిస్తుండగా.. మిగ్ లు మాత్రం గేర్ సిస్టమ్ తో పనిచేస్తాయి. ఫలితంగా ఇవి గంటకు 2000 కిలోమీటర్లకు పైగా వేగాన్ని అందుకోగలవు. అయితే... అంత వేగాన్ని నియంత్రించలేకపోవడం లోపంగా మారి ప్రమాదాలు పెరుగుతున్నాయి!
ఈ నేపథ్యంలోనే వీటికి రిటైర్మెంట్ ఇచ్చి.. ఈ ఫైటర్ విమానాల స్థానాన్ని దేశీయంగా తయారుచేసిన తేలికపాటి యుద్ధ విమానం తేజస్ ఎంకే1ఏ తో భర్తీ చేయనున్నారు.
