న్యూయార్క్ లో కాల్పుల కలకలం.. పోలీసు అధికారితో సహా ఐదుగురు హతం
పలు కార్పొరేట్ సంస్థలకు కేరాఫ్ అడ్రస్ అయిన ఈ ప్రాంతంలో ప్రముఖ కంపెనీలకు చెందిన ప్రధాన కార్యాలయాలు ఇక్కడే ఉన్నాయి.
By: Tupaki Desk | 29 July 2025 10:41 AM ISTఅగ్రరాజ్యం అమెరికాలో షాకింగ్ ఉదంతం చోటు చేసుకుంది. యూఎస్ వాణిజ్య రాజధానిగా పేర్కొనే న్యూయార్క్ మహానగరం ఇటీవల కాలంలో కాల్పుల ఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. ఎప్పుడు ఏ వైపు నుంచి కాల్పులు జరుగుతాయో? అన్న భయాందోళనలు ఎక్కువ అవుతున్న మాట వినిపిస్తోంది. ఇలాంటి భయాలకు బలం చేకూరే మరో దారుణ ఉదంతం చోటు చేసుకుంది. అమెరికా కాలమానం ప్రకారం సోమవారం న్యూయార్క్ లోని మన్ హట్టన్ లో కాల్పుల దారుణం చోటు చేసుకుంది. గుర్తు తెలియని ఆగంతకుడు ఒకరు విచక్షణరహితంగా జరిపిన కాల్పుల్లో ఒక పోలీసు అధికారితో సహా మొత్తం ఐదుగురు మరణించారు. ఆగంతకుడ్ని కాల్చేశారు.
పలు కార్పొరేట్ సంస్థలకు కేరాఫ్ అడ్రస్ అయిన ఈ ప్రాంతంలో ప్రముఖ కంపెనీలకు చెందిన ప్రధాన కార్యాలయాలు ఇక్కడే ఉన్నాయి. నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలోనే గ్రాండ్ సెంట్రల్ స్టేషన్.. రాక్ ఫెల్లర్ సెంటర్.. మ్యూజియం ఆఫ్ మోెడర్ ఆర్ట్ల కు సమీపంలోనే మిడ్ టౌన్ మాన్ హట్టన్ ఉంటుంది. ఇక్కడ పలు ఫైవ్ స్టార్ హోటళ్లు.. కోల్గేట్ పామోలివ్.. ప్రముఖ ఆడిటింగ్ సంస్థ కేపీఎంజీ.. ఎన్ఎఫ్ఎల్ ప్రధాన కార్యాలయం.. హెడజ ఫండ్ దిగ్గజం బ్లాక్ స్టోన్ తో పాటు పలు కార్పొరేట్ సంస్థల ప్రధాన కార్యాలయాలు ఇక్కడే ఉన్నాయి.
బుల్లెట్ ఫ్రూవ్ దుస్తులు ధరించిన ఆగంతకుడు సాయుధుడై.. ఒక భారీ భవంతిలోకి ప్రవేశించి విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడు. కాల్పుల మోతతో అక్కడి వారు భయాందోళనలతో పరుగులు తీశారు. ఈ ఉదంతం గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. హెలికాఫ్టర్ ను కూడా రంగంలోకి దించారు. పోలీసు అధికారితో సహా ఐదుగురు దుర్మరణం పాలు కాగా.. పోలీసులు జరిపిన కాల్పుల్లో ఆగంతుకుడు సైతం హతమయ్యాడు. ఈ షాకింగ్ ఉదంతంలో పలువురికి గాయాలు అయినట్లుగా అధికారులు చెబుతున్నారు.
కాల్పుల నేపథ్యంలో ఈ ప్రాంతంలో లాక్ డౌన్ ప్రకటించారు.
కాల్పుల ఉదంతంపై న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ సోషల్ మీడియాలో స్పందించారు. మరణించిన వారికి.. కాల్పుల్లో హతమైన అధికారి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. కాల్పులు జరిపిన వ్యక్తిని లాస్ వెగాస్ కు చెందిన 27 ఏళ్ల షేన్ తమురాగా గుర్తించారు. అతడికి సంబంధించిన మరిన్ని వివరాలు బయటకు రావాల్సి ఉంది. కాల్పులు జరిగిన ప్రదేశాన్ని పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. ఈ కాల్పుల ఉదంతంలో మరో అధికారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతుననారు. దుండగుడి వద్ద ఉన్న రైఫిల్ కు లైసెన్సు ఉందని.. ఇటీవల దాని గడువు ముగిసినట్లుగా అధికారులు గుర్తించారు. ఈ ఉదంతం అమెరికాలో సంచలనంగా మారింది.
