ట్రంప్ 'గోల్డ్ కార్డ్'కు షాక్.. పన్నుల్లేవ్.. నేరాల్లేవ్.. మిడిల్ ఈస్ట్‌కు క్యూ కడుతున్న కోటీశ్వరులు!
ప్రపంచంలోని కుబేరులకు మిడిల్ ఈస్ట్ ఇప్పుడు హాట్ ఫేవరెట్ డెస్టినేషన్‌గా మారుతోంది.
By: Tupaki Desk | 20 May 2025 1:00 PM ISTప్రపంచంలోని కుబేరులకు మిడిల్ ఈస్ట్ ఇప్పుడు హాట్ ఫేవరెట్ డెస్టినేషన్‌గా మారుతోంది. ఒకప్పుడు సంపన్నులు అమెరికా, యూరప్ వంటి దేశాల వైపు చూసేవారు. కానీ ఇప్పుడు సీన్ మొత్తం మారిపోయింది. పన్నులు దాదాపు లేకపోవడం, అత్యాధునికమైన సౌకర్యాలు, తక్కువ నేరాలు వంటి కారణాలతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోటీశ్వరులు మిడిల్ ఈస్ట్‌ను తమ సెకండ్ హోమ్‌గా సెలక్ట్ చేసుకునంటున్నారు. ఒక్క 2024లోనే యూఏఈ ఏకంగా 7,200 మంది కొత్త మిలియనీర్‌లను ఆహ్వానించింది. దీంతో అక్కడ నివసిస్తున్న సంపన్నుల సంఖ్య 1,34,000కు చేరింది. ఇక దుబాయ్ అయితే రికార్డు స్థాయిలో 2024లో 10 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ విలువైన 435 లగ్జరీ ప్రాపర్టీ అమ్మకాలను నమోదు చేసింది. 2025 మొదటి మూడు నెలల్లోనే మరో 111 అమ్మకాలు జరిగాయి.
వివిధ దేశాలకు చెందిన సంపన్నులు మిడిల్ ఈస్ట్‌ను తమ సెకండ్ హోమ్ గా ఎంచుకోవడానికి ప్రధాన కారణం అక్కడ దాదాపు పన్నులు లేకపోవడం. అలాగే, అక్కడ ఉన్న అత్యాధునికమైన మౌలిక సదుపాయాలు, క్రమశిక్షణతో కూడిన జీవన విధానం, చాలా తక్కువ నేరాలు ఉండటం వారిని విశేషంగా ఆకర్షిస్తున్నాయి. యూఏఈ, ముఖ్యంగా దుబాయ్ మొదటి ఆప్షన్ గా కొనసాగుతుండగా, సౌదీ అరేబియా కూడా ఇప్పుడు సంపన్నుల దృష్టిని ఆకర్షిస్తోంది. ముఖ్యంగా ముస్లిం సంపన్నులు తమ మతపరమైన ప్రదేశాలకు దగ్గరగా పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఖతార్, బహ్రెయిన్, ఒమన్ వంటి దేశాలు కూడా ఇదే బాటలో దూసుకుపోతున్నాయి.
యూఏఈ లగ్జరీ రెసిడెన్షియల్ సెక్టార్‌లో పెట్టుబడులు 2024లో ఏకంగా 76శాతం పెరిగి 4.4 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. రాబోయే రెండు దశాబ్దాల్లో ప్రపంచవ్యాప్తంగా 84 ట్రిలియన్ డాలర్ల సంపద వారసత్వంగా బదిలీ అయ్యే అవకాశం ఉండటంతో, ఈ ప్రాంతంలో ఫ్యామిలీ ఆఫీస్‌ల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. గల్ఫ్ దేశాలు అందిస్తున్న గోల్డెన్ వీసాలు, అలాంటి ఇతర ప్రోత్సాహకాలు ఈ ట్రెండ్‌ను మరింత పెంచుతున్నాయి. దీంతో మిడిల్ ఈస్ట్ సంపన్నుల కోసం ఒక గ్లోబల్ హబ్‌గా మారుతోంది. ఇక్కడ వారు దీర్ఘకాలిక నివాసం, అత్యుత్తమ పెట్టుబడి అవకాశాలను పొందుతున్నారు.
ఒకవేళ డొనాల్డ్ ట్రంప్ అమెరికా కోసం ప్రతిపాదించిన 'గోల్డ్ కార్డ్' ప్రోగ్రామ్‌కు నిజమైన పోటీ ఎదురైతే, అది ఖచ్చితంగా మిడిల్ ఈస్ట్ నుండే వస్తుంది. అమెరికన్ గోల్డెన్ వీసా కోసం దాదాపు 5 మిలియన్ డాలర్లు ఖర్చు చేయాల్సి ఉండగా, మిడిల్ ఈస్ట్ దేశాలు సంపన్నులకు అందిస్తున్న ఆకర్షణీయమైన ఆఫర్లతో అది పోటీ పడాల్సి ఉంటుంది.
