Begin typing your search above and press return to search.

అమెరికాతో డీల్.. లోపల అట్టుడుకుతున్న ఇరాన్‌, ఇజ్రాయెల్‌.. రోడ్డెక్కిన ప్రజలు

మధ్యప్రాచ్య ప్రాంతంలో మరోసారి రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. అమెరికా ప్రతిపాదించిన శాంతి ఒప్పందం కు ఇరాన్ అంగీకరించిందన్న వార్తలు వెలువడడంతో ఆ దేశంలో భారీ స్థాయిలో నిరసనలు చెలరేగాయి.

By:  A.N.Kumar   |   14 Jun 2026 5:08 PM IST
అమెరికాతో డీల్.. లోపల అట్టుడుకుతున్న ఇరాన్‌, ఇజ్రాయెల్‌.. రోడ్డెక్కిన ప్రజలు
X

మధ్యప్రాచ్య ప్రాంతంలో మరోసారి రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. అమెరికా ప్రతిపాదించిన శాంతి ఒప్పందం కు ఇరాన్ అంగీకరించిందన్న వార్తలు వెలువడడంతో ఆ దేశంలో భారీ స్థాయిలో నిరసనలు చెలరేగాయి. వేలాది మంది ప్రజలు రాజధాని టెహ్రాన్‌తో పాటు పలు ప్రధాన నగరాల్లో రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు. ఈ ఒప్పందం ఇరాన్ జాతీయ ప్రయోజనాలకు విరుద్ధమని, అమెరికా ఒత్తిడికి ప్రభుత్వం తలొగ్గిందని నిరసనకారులు ఆరోపిస్తున్నారు.

ప్రత్యేకంగా ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీపై ప్రజల ఆగ్రహం వ్యక్తమవుతోంది. అమెరికాతో జరిగిన చర్చల్లో ఆయన ఇరాన్ ప్రయోజనాలను కాపాడలేకపోయారని వెంటనే రాజీనామా చేయాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. పలు ప్రాంతాల్లో "అమెరికాకు తలొగ్గిన నాయకత్వం వద్దు", "జాతీయ గౌరవాన్ని అమ్మొద్దు" వంటి నినాదాలు మార్మోగుతున్నాయి. సోషల్ మీడియాలో కూడా ప్రభుత్వ వ్యతిరేక పోస్టులు, హ్యాష్‌ట్యాగ్‌లు వైరల్ అవుతున్నాయి.

ఇక ప్రతిపాదిత డ్రాఫ్ట్ అగ్రిమెంట్‌లో ఉన్న కొన్ని నిబంధనలు ఇరాన్ అణు కార్యక్రమం, భద్రతా విధానాలపై ప్రభావం చూపే అవకాశం ఉందనే ఆందోళన ప్రజల్లో వ్యక్తమవుతోంది. ప్రభుత్వం ఈ ఒప్పందంపై పూర్తిస్థాయి వివరాలు వెల్లడించకపోవడంతో అనుమానాలు మరింత పెరిగాయి. డ్రాఫ్ట్ ఒప్పందానికి అధికారికంగా అంగీకరిస్తే దేశవ్యాప్తంగా మరింత పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని నిరసనకారులు హెచ్చరిస్తున్నారు.

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ పీస్ డీల్‌ను వ్యతిరేకిస్తూ ఇజ్రాయెల్‌లోనూ నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇరాన్‌తో ఎలాంటి ఒప్పందమైనా తమ దేశ భద్రతకు ముప్పు కలిగించే అవకాశముందని ఇజ్రాయెల్‌లోని పలు రాజకీయ, సామాజిక వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అమెరికా ఇరాన్‌కు ఎక్కువ రాయితీలు ఇస్తోందని, ఇది ప్రాంతీయ భద్రతా సమీకరణాలను దెబ్బతీసే ప్రమాదం ఉందని వారు అంటున్నారు.

ఇరాన్, ఇజ్రాయెల్ వంటి పరస్పర విరోధ దేశాల్లో ఒకే ఒప్పందంపై నిరసనలు చెలరేగడం అంతర్జాతీయ రాజకీయాల్లో అరుదైన పరిణామంగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఒకవైపు అమెరికా మధ్యప్రాచ్యంలో శాంతి స్థాపనకు ప్రయత్నిస్తుండగా మరోవైపు ఈ ఒప్పందం రెండు దేశాల్లోనూ వ్యతిరేకతను ఎదుర్కొనడం పరిస్థితిని మరింత సంక్లిష్టంగా మార్చింది.

ప్రస్తుతం ఈ పీస్ డీల్‌పై అధికారిక ప్రకటనలు, చర్చలు కొనసాగుతుండగా మధ్యప్రాచ్య దేశాలు, ప్రపంచ శక్తులు పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఈ ఒప్పందం అమలుకు వస్తుందా? లేక ప్రజా వ్యతిరేకత కారణంగా నిలిచిపోతుందా? అన్నది అంతర్జాతీయ వేదికపై ఆసక్తికర చర్చగా మారింది. మధ్యప్రాచ్య రాజకీయాల్లో ఈ పరిణామం కీలక మలుపు తిప్పే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.