Begin typing your search above and press return to search.

గల్ఫ్ దేశాల్లో విమాన రాకపోకలకు బ్రేక్.. యుద్ధ ఉద్రిక్తతలతో ఎయిర్‌స్పేస్ ల మూసివేత

యూఏఈ జనరల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ (జీసీఏఏ) తాత్కాలికంగా ఎయిర్‌స్పేస్‌ను మూసివేసింది. భద్రతా కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

By:  A.N.Kumar   |   1 March 2026 10:18 AM IST
గల్ఫ్ దేశాల్లో విమాన రాకపోకలకు బ్రేక్.. యుద్ధ ఉద్రిక్తతలతో ఎయిర్‌స్పేస్ ల మూసివేత
X

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు మరింత ముదురుతున్నాయి. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన వైమానిక దాడుల తరువాత గల్ఫ్ ప్రాంతంలో భద్రతా పరిస్థితులు తీవ్రంగా మారాయి. ఈ నేపథ్యంలో యూఏఈ, ఖతార్, కువైట్, బహ్రెయిన్ వంటి దేశాలు తమ ఎయిర్‌స్పేస్‌ను పూర్తిగా లేదా పాక్షికంగా మూసివేశాయి. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు సంబంధిత దేశాల అధికారులు తెలిపారు.

–యూఏఈలో పాక్షికంగా ఎయిర్‌స్పేస్ మూసివేత

యూఏఈ జనరల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ (జీసీఏఏ) తాత్కాలికంగా ఎయిర్‌స్పేస్‌ను మూసివేసింది. భద్రతా కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.విమానయాన భద్రత, దేశ గగనతలం రక్షణ అత్యంత ప్రాధాన్యమని అధికారులు స్పష్టం చేశారు. ప్రయాణికులు తమ ఫ్లైట్ వివరాల కోసం నేరుగా ఎయిర్‌లైన్స్‌ను సంప్రదించాలని సూచించారు. అవసరమైతే వసతి, సహాయం అందించేందుకు ఎయిర్‌లైన్స్‌కు ఆదేశాలు జారీ చేశారు.

– ఖతార్‌లో పూర్తిగా విమాన రాకపోకల నిలిపివేత

ఖతార్ సివిల్ ఏవియేషన్ అథారిటీ దేశంలో అన్ని విమాన సేవలను తాత్కాలికంగా నిలిపివేసింది.

దేశంపై జరిగిన క్షిపణి దాడులను తమ రక్షణ దళాలు అడ్డుకున్నట్లు ఖతార్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. పరిస్థితి ప్రస్తుతం నియంత్రణలో ఉందని వెల్లడించింది.ప్రజలు అధికారిక సమాచారం మాత్రమే నమ్మాలని, వదంతులను వ్యాప్తి చేయవద్దని హెచ్చరించారు.

– కువైట్‌లో పూర్తి ఎయిర్‌స్పేస్ మూసివేత

ప్రాంతీయ భద్రతా పరిస్థితుల కారణంగా కువైట్ కూడా తన ఎయిర్‌స్పేస్‌ను పూర్తిగా మూసివేసింది. ఎప్పుడు తిరిగి ప్రారంభమవుతుందన్నది ఇంకా వెల్లడించలేదు.

– ఇరాన్‌లో పేలుళ్ల తర్వాత పూర్తి మూసివేత

టెహ్రాన్‌లో వరుస పేలుళ్ల నేపథ్యంలో ఇరాన్ తన గగనతలాన్ని పూర్తిగా మూసివేసింది. కనీసం ఆరు గంటల పాటు అన్ని విమాన సేవలను నిలిపివేసినట్లు ప్రకటించింది.ఇజ్రాయెల్ దాడులు జరిగాయని ఇరాన్ మీడియా నివేదించగా ఇజ్రాయెల్ కూడా ఆపరేషన్‌ను ధృవీకరించింది.

– ఇరాక్‌లో విమాన సేవలు నిలిపివేత

ఇరాన్‌పై దాడుల నేపథ్యంలో ఇరాక్ కూడా ఎయిర్‌స్పేస్‌ను మూసివేసింది. ఎర్బిల్ అంతర్జాతీయ విమానాశ్రయం సహా అన్ని విమానాల రాకపోకలను నిలిపివేశారు.

– బహ్రెయిన్‌పై క్షిపణి దాడి

బహ్రెయిన్‌లో కూడా బయట నుంచి క్షిపణి దాడులు జరిగినట్లు అధికారికంగా వెల్లడించారు.

అమెరికా ఐదవ నౌకాదళానికి సంబంధించిన సదుపాయాలపై దాడి జరిగినట్లు తెలిపారు. అత్యవసర చర్యలు చేపట్టినట్లు చెప్పారు.

– ప్రయాణికులపై భారీ ప్రభావం

ఈ పరిణామాల వల్ల ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే విమాన మార్గాల్లో ఒకటి తీవ్రంగా ప్రభావితమైంది.

యూరప్, ఆసియా, ఆస్ట్రేలియా మధ్య ప్రయాణాలు పెద్ద ఎత్తున మార్పులకు లోనవుతున్నాయి. ప్రధాన ఎయిర్‌లైన్స్ అయిన ఎమిరేట్స్, ఎతిహాద్ ఎయిర్వేస్, ఖతార్ ఎయిర్వేస్ లు తమ విమాన మార్గాలను మార్చుకుంటున్నాయి. దీంతో ప్రయాణ సమయం పెరుగుతోంది.

– విమానాశ్రయాల్లో గందరగోళం

దుబాయ్, అబుదాబి వంటి ప్రధాన విమానాశ్రయాల్లో వేలాది మంది భారతీయులు, విదేశీ ప్రయాణికులు ఇరుక్కుపోయారు. ఫ్లైట్ క్యాన్సిలేషన్లు, డిలేలు కారణంగా టెర్మినల్స్‌లో భారీ రద్దీ నెలకొంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్లో ప్రయాణికులు నేలపై కూర్చుని వేచి చూస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.

– భారతీయులకు సూచనలు

అబుదాబి భారత రాయబార కార్యాలయం కీలక సూచనలు జారీ చేసింది. అవసరం లేని ప్రయాణాలు నివారించాలని.. అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అధికారిక సూచనలను మాత్రమే అనుసరించాలని పేర్కొంది.

ప్రయాణికులకు సూచనలు

ప్రస్తుత పరిస్థితుల్లో ప్రయాణికులు తమ ఎయిర్‌లైన్‌ను నేరుగా సంప్రదించాలి. ఫ్లైట్ స్టేటస్‌ను నిరంతరం చెక్ చేయాలి. రీషెడ్యూల్, రీఫండ్ వివరాలు తెలుసుకోవాలి. ట్రావెల్ ఇన్సూరెన్స్ కలిగి ఉండాలి

– ప్రస్తుతం ఎయిర్‌స్పేస్ పరిస్థితి

యూఏఈలో పాక్షికంగా ఎయిర్ స్పేస్ మూసివేశారు.ఇరాన్, ఇరాక్, జోర్డాన్, ఇజ్రాయెల్ లో పూర్తిగా మూసివేశారు. ఖతార్, బహ్రెయిన్ ప్రమాద పరిస్థితుల్లో ఆపరేషన్లు నిలిపివేశారు.

– పరిస్థితి ఉద్రిక్తం..

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతున్నాయి. పరిస్థితి వేగంగా మారుతోంది. మరిన్ని దేశాలు కూడా భద్రతా చర్యల భాగంగా విమాన సేవలను నిలిపివేసే అవకాశం ఉంది.ప్రయాణికులు తాజా సమాచారం కోసం అధికారిక వనరులను మాత్రమే అనుసరించాలని నిపుణులు సూచిస్తున్నారు.