Begin typing your search above and press return to search.

మైక్రోసాఫ్ట్‌ సంచలన నిర్ణయం.. ఇక అది కనుమరుగు!

మనం కంప్యూటర్‌ సిస్టమ్‌ లో లేదా ల్యాప్‌ ట్యాప్‌ లో ఏవైనా రాసుకోవడానికి, నోట్‌ చేసుకోవడానికి ఉపయోగించే ‘‘వర్డ్‌ ప్యాడ్‌’’ తెలుసు కదా.

By:  Tupaki Desk   |   4 Sep 2023 7:12 AM GMT
మైక్రోసాఫ్ట్‌ సంచలన నిర్ణయం.. ఇక అది కనుమరుగు!
X

మనం కంప్యూటర్‌ సిస్టమ్‌ లో లేదా ల్యాప్‌ ట్యాప్‌ లో ఏవైనా రాసుకోవడానికి, నోట్‌ చేసుకోవడానికి ఉపయోగించే ‘‘వర్డ్‌ ప్యాడ్‌’’ తెలుసు కదా. టెక్నాలజీ పెరిగి ఎన్నో అందుబాటులోకి వచ్చినా.. ఇప్పటికీ చాలామంది ఏవైనా ముఖ్యాంశాలను టైప్‌ చేసుకోవాలంటే వర్డ్‌ ప్యాడ్‌ లోనే టైప్‌ చేస్తుంటారు. వర్డ్‌ ప్యాడ్‌ లో ఉన్న ప్రయోజనాలు అలాంటివి.

వర్డ్‌ ప్యాడ్‌ ను ఐటీ దిగ్గజ సంస్థ.. మైక్రోసాఫ్ట్‌ ప్రవేశపెట్టింది. విండోస్‌ 95 సాఫ్ట్‌వేర్‌ తో వర్డ్‌ ప్యాడ్‌ రంగప్రవేశం చేసింది. గత మూడు దశాబ్దాలుగా ఇది కొన్ని కోట్ల మందికి సేవలందించింది. అయితే ఇక ఇప్పుడు వర్డ్‌ ప్యాడ్‌ కనుమరుగు కానుంది. దీన్ని మనం వినియోగించుకోలేం. ఈ మేరకు ‘వర్డ్‌ ప్యాడ్‌’ కు ముగింపు పలకబోతున్నట్టు మైక్రోసాఫ్ట్‌ సంచలన ప్రకటన చేసింది.

30 ఏళ్లపాటు డాక్యుమెంట్‌ రైటింగ్‌ లో అందరికీ ఎంతో ఉపయోగపడ్డ వర్డ్‌ ప్యాడ్‌.. మైక్రోసాఫ్ట్‌ నిర్ణయంతో అదృశ్యం కాబోతుంది. అయితే ఇప్పటికే వినియోగంలో ఉన్న విండోస్‌ వెర్షన్లలో ‘వర్డ్‌ ప్యాడ్‌’ అందుబాటులో ఉంటుందని మైక్రోసాఫ్ట్‌ స్పష్టత ఇచ్చింది. భవిష్యత్‌లో రాబోయే వర్షన్లలో మాత్రం వర్డ్‌ ప్యాడ్‌ ఉండదని వెల్లడించింది.

ఇప్పుడు అప్లికేషన్స్, సాఫ్ట్‌వేర్‌ ఇలా అన్ని అప్‌ డేట్‌ చేసుకున్నట్టే వర్డ్‌ ప్యాడ్‌ కూడా అప్‌ డేట్‌ చేసుకోవడం కుదరదు. ఇక ఇది కాలగర్భంలో కలసిపోనుంది. వర్డ్‌ ప్యాడ్‌ స్థానంలో ‘మైక్రోసాఫ్ట్‌ వర్డ్‌’ను ఉపయోగించుకోవాలని ఆ సంస్థ ఓ ప్రకటనను వెలువరించింది.

మరోవైపు ఇటీవలే సరికొత్త ఆప్షన్లతో ‘‘నోట్‌ ప్యాడ్‌’’ ను మైక్రోసాఫ్ట్‌ విడుదల చేసింది. దీనికి అప్‌ గ్రేడ్‌ వెర్షన్‌ వదిలింది. నోట్‌ ప్యాడ్‌ ను అలాగే ఉంచిన మైక్రోసాఫ్ట్‌ వర్డ్‌ ప్యాడ్‌ ను మాత్రం తొలగించడానికి నిర్ణయించింది. దీంతో వర్డ్‌ ప్యాడ్‌ ను వాడుతున్న వినియోగదారులు ఖంగుతిన్నారు.

కాగా మైక్రోసాఫ్ట్‌ ఆటోసేవ్, ట్యాబ్‌ ఉపసంహరణ వంటి ఫీచర్లతో నోట్‌ ప్యాడ్‌ ను అప్‌ గ్రేడ్‌ చేసినట్టు ఆ సంస్థ ప్రకటించింది. ఇంతలో ఒక్క రోజులోనే వర్డ్‌ ప్యాడ్‌ ను తొలగిస్తున్నట్టు ప్రకటించి షాక్‌ ఇచ్చింది.

విండోస్‌ 11లోని విండోస్‌ నోట్‌ ప్యాడ్‌ యాప్‌ ను మొదటిసారిగా 2018లో మైక్రోసాఫ్ట్‌ అప్‌ డేట్‌ చేసింది. గత నెలలో ఐవోఎస్, ఆండ్రాయిడ్‌ తర్వాత.. ఇప్పుడు విండోస్‌ 11లో దాని డిజిటల్‌ అసిస్టెంట్‌ కోర్టానా యాప్‌ సేవలను కూడా నిలిపివేస్తున్నట్టు మైక్రోసాఫ్ట్‌ వెల్లడించింది.

ఈ మార్పులనే కాకుండా మైక్రోసాప్ట్‌ ఎక్స్‌ప్లోరర్‌ సెట్టింగ్‌ల సంఖ్యను తగ్గించే ప్రయత్నంలో మైక్రోసాఫ్ట్‌ ఫైల్‌ ఎక్స్‌ప్లోరర్‌ లోని ఫోల్డర్‌ ఎంపికల కింద కొన్ని పాత సెట్టింగ్‌ ల్లో కూడా మార్పులు చేసింది. వాటిని తొలగించింది.