Begin typing your search above and press return to search.

ముగిసిన 22ఏళ్ల ప్రస్థానం.. మరో రెండ్రోజుల్లో స్కైప్‌ శాశ్వతంగా మూత!

ఒకప్పుడు వీడియో కాలింగ్ అనగానే ఠక్కున గుర్తుకు వచ్చే పేరు స్కైప్. కానీ, మరో రెండు రోజుల్లో ఈ ఉచిత వీడియో కాల్ వేదిక చరిత్ర పుటల్లో కలిసిపోనుంది.

By:  Tupaki Desk   |   3 May 2025 5:00 PM IST
Microsoft to Shut Down Skype on May 5 2025
X

ఒకప్పుడు వీడియో కాలింగ్ అనగానే ఠక్కున గుర్తుకు వచ్చే పేరు స్కైప్. కానీ, మరో రెండు రోజుల్లో ఈ ఉచిత వీడియో కాల్ వేదిక చరిత్ర పుటల్లో కలిసిపోనుంది. కరోనా సమయంలో బాగా ఉపయోగపడినా ఆ తర్వాత జూమ్, గూగుల్ మీటింగ్స్, వాట్సాప్ వంటి పోటీదారుల రాకతో స్కైప్ క్రమంగా వినియోగదారులను కోల్పోయింది. దీంతో మైక్రోసాఫ్ట్ ఈ వేదికను పూర్తిగా మూసివేయాలంటూ నిర్ణయించుకుంది. మే 5, 2025 నుంచి స్కైప్ సేవలు నిలిచిపోనున్నాయి.

22 ఏళ్ల ప్రస్థానం ముగిసినట్టే

స్కైప్ గత 22 ఏళ్లుగా మార్కెట్‌లో ఉన్నప్పటికీ ఇప్పుడు తగినంత మంది వినియోగదారుల ఆదరణ లేకపోవడంతో స్కైప్ మూతపడే స్థితికి చేరుకుంది. మెసేజింగ్ , వీడియో కాల్స్‌తో సహా అన్ని కమ్యూనికేషన్ వేదికలను ఒకే చోటకి చేర్చాలనే లక్ష్యంతో మైక్రోసాఫ్ట్ తమ వినియోగదారులను టీమ్స్‌కు మారాలని విజ్ఞప్తి చేసింది.

టీమ్స్‌లోకి మారడం సులభం

మైక్రోసాఫ్ట్ స్కైప్ వినియోగదారులు టీమ్స్‌కు మారడానికి చాలా నెలల సమయం ఇచ్చింది. అంతేకాదు, స్కైప్ ఐడీతోనే టీమ్స్‌లోకి లాగిన్ కావచ్చని చెప్పి.. మారే ప్రక్రియను సులభతరం చేసింది. స్కైప్‌లోని చాట్ హిస్టరీ, కాంటాక్ట్‌లను కూడా టీమ్స్‌లోకి బదిలీ చేస్తామని హామీ ఇచ్చింది.

పెయిడ్ సర్వీసులు బంద్

స్కైప్ క్రెడిట్, స్కైప్ కాలింగ్ వంటి వివిధ ప్రోగ్రామ్‌ల కింద ఉన్న అన్ని పెయిడ్ సబ్‌స్క్రిప్షన్‌లను మైక్రోసాఫ్ట్ నిలిపివేసింది. వినియోగదారులు తమ సబ్‌స్క్రిప్షన్ గడువును పూర్తి చేసుకోవాలని, ఆ తర్వాత అన్ని పెయిడ్ సర్వీసులను నిలిపేస్తున్నట్లు తెలియజేసింది.

టీమ్స్ మరింత అడ్వాన్స్‌డ్

స్కైప్ కంటే మెరుగ్గా పనిచేస్తున్న అనేక ఇతర వేదికలు ఉన్నప్పటికీ టీమ్స్ స్కైప్‌తో పోలిస్తే చాలా అధునాతనమైనదని మైక్రోసాఫ్ట్ స్పష్టం చేసింది.