Begin typing your search above and press return to search.

మైక్రోసాఫ్ట్‌ కీలక నిర్ణయం... వర్క్ ఫ్రం హోమ్‌ పూర్తిగా ఎత్తేయబోతున్నదా?

ప్రస్తుతానికి కంపెనీ పూర్తిస్థాయి రిమోట్ విధానాన్ని ముగించి “హైబ్రిడ్ వర్క్ మోడల్”ను అమలు చేయనుంది. అంటే, ఉద్యోగులు వారంలో కొంత భాగం ఆఫీసులో, మిగతా సమయం ఇంటి నుంచే పనిచేయవచ్చు.

By:  Tupaki Desk   |   10 Sept 2025 7:00 PM IST
మైక్రోసాఫ్ట్‌  కీలక నిర్ణయం...  వర్క్ ఫ్రం హోమ్‌ పూర్తిగా ఎత్తేయబోతున్నదా?
X

కరోనా మహమ్మారి అనంతరం ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగ విధానంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి. ఆ సమయంలో ఉద్యోగుల భద్రతను దృష్టిలో ఉంచుకుని, అనేక సంస్థలు “వర్క్ ఫ్రం హోమ్” విధానాన్ని ప్రవేశపెట్టాయి. వాటిలో ప్రపంచంలోనే అగ్రశ్రేణి సంస్థ మైక్రోసాఫ్ట్ కూడా 2020లో అత్యంత సౌలభ్యాన్ని కలిగించే రిమోట్ వర్క్ విధానాన్ని అవలంబించింది. అయితే, ఐదేళ్ల తర్వాత ఈ విధానంలో మార్పులు చేయాలనే నిర్ణయానికి వచ్చింది.

కొత్త విధానం ప్రారంభం

మైక్రోసాఫ్ట్ తాజాగా ప్రకటించిన వివరాల ప్రకారం, 2026 ఫిబ్రవరి నుంచి అమెరికాలోని రెడ్‌మండ్ ప్రధాన కార్యాలయం పరిధిలో 50 మైళ్ల దూరంలో నివసించే ఉద్యోగులు తప్పనిసరిగా వారానికి కనీసం మూడు రోజులు ఆఫీసుకి హాజరుకావాలి. మొదట ఇది అమెరికాలో అమలు చేసి, తర్వాత ఇతర రాష్ట్రాలు, అంతర్జాతీయ కేంద్రాలకు విస్తరించనున్నది. ఇందులో భారతదేశంలోని బెంగళూరు, హైదరాబాద్, గురుగ్రామ్ వంటి కేంద్రాలు కూడా ఉన్నాయి.

హైబ్రిడ్ వర్క్ మోడల్ వైపు

ప్రస్తుతానికి కంపెనీ పూర్తిస్థాయి రిమోట్ విధానాన్ని ముగించి “హైబ్రిడ్ వర్క్ మోడల్”ను అమలు చేయనుంది. అంటే, ఉద్యోగులు వారంలో కొంత భాగం ఆఫీసులో, మిగతా సమయం ఇంటి నుంచే పనిచేయవచ్చు. క్రమక్రమంగా ఈ విధానంలో మార్పులు చేస్తూ ఉద్యోగులు పూర్తిస్థాయిలో ఆఫీసు నుంచే పని చేసే విధానాన్ని అమలు చేయవచ్చని టెక్ నిపుణులు భావిస్తున్నారు.

ఒక్క మైక్రోసాఫ్ట్ నిర్ణయమే కాదు..

అయితే ఈ నిర్ణయం ఒక్క మైక్రోసాఫ్ట్ సంస్థ తీసుకున్నది కాదు. ఇప్పటికే అమెజాన్ ఉద్యోగులకు వారానికి ఐదు రోజులు ఆఫీసు హాజరు తప్పనిసరి చేసింది. గూగుల్, మెటా, జేపీ మోర్గాన్, విప్రో, ఫ్లిప్‌కార్ట్ వంటి అనేక కంపెనీలు కూడా వర్క్ ఫ్రం హోమ్ సౌలభ్యాన్ని క్రమక్రమంగా తగ్గిస్తూ వస్తున్నాయి రాను రాను ప్రపంచవ్యాప్తంగా తిరిగి ఆఫీసు నుంచి పని చేసే విధానాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసే దిశగా ఎంఎన్ సీ కంపెనీలు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.

భారత ఉద్యోగులపై ప్రభావం

భారత ఐటీ రంగంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులు కరోనా తర్వాత స్వగ్రామాలకు వెళ్లి అక్కడి నుంచే తమ విధులు నిర్వర్తిస్తున్నారు. ఇప్పుడు ఆఫీసు హాజరు తప్పనిసరి అయితే, వారు మళ్లీ ఉద్యోగాల కోసం నగరాలకు తప్పకపోవచ్చు. ఇది వారి జీవనశైలిలో గణనీయమైన మార్పులకు దారితీస్తుంది. ప్రయాణాలు, అద్దెలు, కుటుంబ ఖర్చులు గణనీయంగా పెరిగే అవకాశముంది. అయితే మరోవైపు, ఆఫీస్ వాతావరణం వల్ల సహచర ఉద్యోగులతో సమన్వయం మెరుగవుతుందని కంపెనీలు భావిస్తున్నాయి.

మైక్రోసాఫ్ట్ నిర్ణయం కీలకంగా మారబోతున్నది. ఇది కేవలం ఉద్యోగ విధాన మార్పు మాత్రమే కాకుండా, భవిష్యత్ పని సంస్కృతి ఏ దిశగా పయనించబోతోందో చూపించే సంకేతం కూడా. రాబోయే సంవత్సరాల్లో హైబ్రిడ్ మోడల్ గ్లోబల్ స్టాండర్డ్‌గా మారే అవకాశం ఉంది.