Begin typing your search above and press return to search.

ఊచకోతను గుర్తుకు తెచ్చేలా మైక్రోసాఫ్ట్ లేఆఫ్ లు?

సాంకేతికత పెరిగే కొద్దీ.. మానవ వనరుల్ని తక్కువగా వినియోగించి మెషిన్లతో పని చేయించటం ఎక్కువ చేయటం చూస్తున్నదే.

By:  Tupaki Desk   |   14 May 2025 4:33 AM
Microsoft Plans Another Round of Layoffs in 2025
X

సాంకేతికత పెరిగే కొద్దీ.. మానవ వనరుల్ని తక్కువగా వినియోగించి మెషిన్లతో పని చేయించటం ఎక్కువ చేయటం చూస్తున్నదే. ఇందులో భాగంగా ఉద్యోగుల్లో కోత పెట్టే దిశగా కంపెనీలు అడుగులు వేస్తుంటాయి. తాజాగా దిగ్గజ టెక్ సంస్థ మైక్రోసాఫ్ట్ మరోసారి ఉద్యోగుల లేఆఫ్ ఊచకోతకు సిద్ధమవుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సిబ్బందిలో కొందరిపై వేటు వేసేందుకు ప్లాన్ చేసింది. తాజా నిర్ణయం వేలాది మంది ఉద్యోగులపై ప్రభావాన్ని చూపుతుందని చెబుతున్నారు.

ఈ లేఆఫ్ ల సందర్భంగా రెండేళ్ల క్రితం అంటే.. 2023లో భారీగా లేఆఫ్ లను ప్రకటించటం.. దాదాపు పది వేల మంది ఉద్యోుగుల్ని తొలగించటం తెలిసిందే. మైక్రోసాఫ్ట్ లో అతి పెద్ద లేఆఫ్ అదే అన్న విషయం అప్పట్లో పెద్ద ఎత్తున చర్చ నడిచింది. తాజా లేఆఫ్ లు.. 2023 తర్వాత చేపట్టే రెండో అతి పెద్ద లేఆఫ్ గా అభివర్ణిస్తున్నారు.

సంస్థ వర్గాల నుంచి అందుతున్న అనధికార సమాచారం ప్రకారం ఈసారి లేఆఫ్ లు 3 శాతం వరకు ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ ఉద్యోగులు 2.28 లక్షల మంది ఉంటారని అంచనా. ఇందులో కనిష్ఠంగా మూడు శాతం ఉద్యోగాల మీద కోత పెట్టేందుకు వీలుగా ప్లాన్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. మార్కెట్ లో పైచేయి సాధించేలా సంస్థను ఉత్తమంగా ఉంచేందుకు వీలుగా సంస్థాగతంగా ఎప్పటికప్పుడు మార్పులు చేయటం మామూలే అని.. అలాంటి పనే తాజాగా జరుగుతున్నట్లుగా చెబుతున్నారు.

ఇటీవల కాలంలో సంస్థ ఏదైనా.. తాను ఎదిగే కొద్దీ.. ఖర్చుల మీద కత్తి దూసే ధోరణి పెరుగుతోంది. ఖర్చుల కోత అన్నంతనే ఉద్యోగుల్ని తీసేయటం ఒక అలవాటుగా మారుతోంది. ఇందుకు దిగ్గజ టెక్ సంస్థలైన మైక్రోసాఫ్ట్.. గూగుల లాంటివి కూడా మినహాయింపు కాకుండా పోతున్నాయి.

మైక్రోసాఫ్ట్ తాజా నిర్ణయంతో మధ్యస్థ స్థాయి మేనేజ్ మెంట్ ఉద్యోగులపై అధిక ప్రభావం పడుతుందని చెబుతన్నారు. నిజానికి ఇప్పటికే ఈ ఏడాది జనవరిలో పని తీరు ఆధారంగా కొంతమందిపై వేటు వేసింది సంస్థ. అయితే.. తాజాగా అమలు చేస్తున్న లేఆఫ్ లు.. ఉద్యోగుల పనితీరుతో సంబంధం లేదని చెబుతున్నారు. మైక్రోసాఫ్ట్ మొదలు పెట్టిన తాజా లేఆఫ్ ల ఊచకోత రానున్న రోజుల్లో మరిన్ని కంపెనీలు ఇదే తరహా బాట పట్టొచ్చన్న మాట వినిపిస్తోంది.